Telugu Global
Sports

అప్పుడు సచిన్ టెండుల్కర్...ఇప్పుడు అర్జున్ టెండుల్కర్!

ఐపీఎల్ లో తనవంతు కోసం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న చోటా టెండుల్కర్ అర్జున్ కల ఎట్టకేలకు నెరవేరింది.

Arjun Tendulkar makes IPL debut for Mumbai Indians against KKR
X

అప్పుడు సచిన్ టెండుల్కర్...ఇప్పుడు అర్జున్ టెండుల్కర్!

ఐపీఎల్ లో తనవంతు కోసం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న చోటా టెండుల్కర్ అర్జున్ కల ఎట్టకేలకు నెరవేరింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ అరంగేట్రం క్యాప్ అందుకొన్నాడు....

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో ఓ అరుదైన రికార్డు చోటు చేసుకొంది. ఐపీఎల్ ఓ ఫ్రాంచైజీ జట్టు తరపున బరిలోకి దిగిన తండ్రితనయులుగా మాస్టర్ సచిన్ టెండుల్కర్, అర్జున్ టెండుల్కర్ రికార్డుల్లో చేరారు.

ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న పోటీ ద్వారా అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కడుపునొప్పితో విశ్రాంతి తీసుకోడంతో ఆ స్థానంలో అర్జున్ కు చోటు కల్పించారు. రోహిత్ శర్మ చేతుల మీదుగా అర్జున్ తన ఐపీఎల్ ముంబై ఇండియన్స్ క్యాప్ ను అందుకొన్నాడు.

రెండేళ్ల నిరీక్షణకు తెర...

ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ జట్టులో 20 లక్షల రూపాయల ధరకు రెండేళ్ల క్రితం అర్జున్ టెండుల్కర్ చేరాడు. నాటినుంచి అరంగేట్రం కోసం ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తూ వచ్చాడు.

2021 సీజన్ నుంచి ముంబై బెంచ్ కే పరిమితమైన అర్జున్ గత సీజన్ దేశవాళీ క్రికెట్ టోర్నీలలో బౌలింగ్ ఆల్ రౌండర్ గా సత్తా చాటుకొన్నాడు. రంజీట్రోఫీలో గోవాజట్టుకు ఆడుతున్న అర్జున్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ గా, దూకుడుగా ఆడే బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగాలని తహతహలాడిన అర్జున్ కల నేటికి నెరవేరగలిగింది. అర్జున్ అరంగేట్రం మ్యాచ్ చూడటానికి సచిన్ కుటుంబసభ్యులందరూ స్టేడియానికి తరలి వచ్చారు.

కోల్ కతాతో మ్యాచ్ లో ముంబై బౌలింగ్ ను ప్రారంభించిన అర్జున్ తన మొదటి రెండు ఓవర్లలో 17 పరుగులిచ్చి పర్వాలేదని పించాడు.

అరుదైన ఘనత...

ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు వేర్వేరు సీజన్లలో ఆడిన తండ్రితనయుల తొలిజోడీగా సచిన్, అర్జున్ టెండుల్కర్ రికార్డుల్లో చేరారు. 2008 ప్రారంభ సీజన్లో ముంబై తరపున సచిన్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తే..2023 సీజన్లో అర్జున్ అదేజట్టు తరపున పోటీకి దిగాడు.

2008 నుంచి ముంబై ఇండియన్స్ కు నాయకత్వం వహించిన సచిన్ టెండుల్కర్ తన ఐపీఎల్ కెరియర్ లో 76 మ్యాచ్ లు ఆడి 2వేల 281 పరుగులు సాధించాడు.

ఇందులో ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు, 22సార్లు 30కి పైగా, 10సార్లు 20కి పైగా స్కోర్లు సాధించాడు.

మొత్తం 1907 బాల్స్ ఎదుర్కొని 30.01 సగటుతో 119.6 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. 2008 నుంచి ఆరుసీజన్లపాటు ముంబైకి ఆడిన సచిన్ 2013 సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.

మరి..ఈ చోటా టెండుల్కర్ కెరియర్ ఎంతకాలం కొనసాగుతుందన్నదే ఇక్కడి అసలుపాయింట్..

First Published:  16 April 2023 6:05 PM IST
Next Story