Telugu Global
Sports

ముంబైలో చోటు లేక.. చోటా టెండుల్కర్ వలసబాట!

ముంబై తరఫున‌ తగిన అవకాశాలు లభించకపోవడం, లభించే అవకాశం కనుచూపు మేరలో లేకపోడంతో...పొరుగునే ఉన్న గోవాకు వలస వెళ్ళాలని సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున టెండుల్కర్ నిర్ణయించుకున్నాడు.

ముంబైలో చోటు లేక.. చోటా టెండుల్కర్ వలసబాట!
X

క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున టెండుల్కర్ వలసబాట పట్టాడు. జూనియర్ స్థాయి నుంచి ముంబై జట్లలో సభ్యుడిగా ఉన్నా, ఐపీఎల్ లో గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్ జట్టు బెంచ్‌కే పరిమితమైన 22 ఏళ్ల అర్జున్ తగిన అవకాశాలు లేక సతమతమవుతున్నాడు.

ముంబైలో చోటా టెండుల్కర్‌కు కష్టమే!

సచిన్ ఏకైక పుత్రుడు అర్జున్ టెండుల్కర్ సబ్ జూనియర్ స్థాయి నుంచి క్రికెట్లో అత్యాధునిక శిక్షణ పొందుతూ వస్తున్నాడు. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ క్రికెట్ అకాడమీలో అత్యాధునిక శిక్షణతో రాటు దేలాడు. ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత జట్టుకు నెట్ బౌలర్‌గా కూడా సేవలు అందిస్తూ...బౌలింగ్ గ్రేట్స్ వాసిం అక్రం, జహీర్ ఖాన్‌ల పర్యవేక్షణలో తన బౌలింగ్ కు మెరుగులు దిద్దుకున్నాడు. సబ్-జూనియర్, జూనియర్ స్థాయి టోర్నీలలో ముంబై జట్టు సభ్యుడుగా పాల్గొన్నాడు. అండర్ -19 స్థాయిలో భారత్‌కు పలు మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించినా సత్తా చాటుకోడంలో విఫలమయ్యాడు. ఇక..అత్యున్నత ప్రమామాణాలకు మరో పేరైన ముంబై జట్టులో చోటు సంపాదించడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ముంబై రంజీ జట్టులోని 11 స్థానాల కోసం 40 మందికి పైగా ఆటగాళ్లు పోటీ పడే పరిస్థితి ఉంది. ఇలాంటి స్థితిలో గత రెండేళ్లుగా తనవంతు కోసం ఎదురు చూసిన అర్జున్‌కు నిరాశే ఎదురైంది. పైగా ముంబై రంజీ జట్టులో చోటు లేకుండా పోయింది.

ఐపీఎల్‌లోనూ అదే సీన్...

దేశవాళీ క్రికెట్‌లో ముంబై తర‌ఫున‌ ఆడుతూ సత్తా చాటాలనుకున్న అర్జున్ టెండుల్కర్‌కు తగిన అవకాశాలు లేక బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. పైగా..ముంబై రంజీ జట్టులో చోటే లేకుండా పోయింది. అదీ చాలదన్నట్లు.. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లుగా 30 లక్షల రూపాయల కనీస ధరకు ఆడుతున్న అర్జున్‌కు కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడే అవకాశమే లేకుండా పోయింది. ముంబై ఇండియన్స్ తుది జట్టులో అర్జున్ స్థానం పొందాలంటే ఆల్ రౌండర్‌గా మరింత మెరుగుపడాలని, అతని ఫీల్డింగ్ బాగుపడితేనే అవకాశం ఉంటుందని ఆ ఫ్రాంచైజీ ప్రధాన శిక్షకుడు మహేల జయవర్థనే, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ గతంలోనే చెప్పారు. ఏ విధంగా చూసినా..ముంబై తరఫున‌ తనకు తగిన అవకాశాలు లభించకపోవడం, లభించే అవకాశం కనుచూపు మేరలో లేకపోడంతో...పొరుగునే ఉన్న గోవాకు వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.

ముంబై క్రికెట్ సంఘానికి లేఖ...

గోవా క్రికెట్ సంఘం తరఫున‌ ఆడటానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ అర్జున్ టెండుల్కర్ నిరభ్యంతర పత్రం కోసం ముంబై క్రికెట్ సంఘానికి దరఖాస్తు చేశాడు. 2022-23 సీజన్ దేశవాళీ క్రికెట్లో గోవా జట్టు తరఫున‌ బరిలో నిలిస్తే... రంజీ ట్రోఫీ, సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్‌లు ఆడటం ద్వారా తగిన మ్యాచ్ ప్రాక్టీసు దక్కుతుందని అర్జున్ భావిస్తున్నాడు. తన తండ్రి మాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు భిన్నంగా.. 22 సంవత్సరాల వయసుకే ఆరడుగుల ఎత్తు కలిగిన అర్జున్ టెండుల్కర్‌కు 2020-21 సీజన్‌లో ముంబై తరఫున రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హర్యానా, పుదుచ్చేరిలతో జరిగిన మ్యాచ్‌లలో అర్జున్ పాల్గొన్నాడు. కానీ ఆ తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. గత సీజన్ రంజీ ట్రోఫీలో సైతం అర్జున్‌కు ముంబై జట్టులో చోటు దక్కినా రిజర్వ్ ఆటగాడిగానే ఉంటూ మిగిలిన ఆటగాళ్లకు డ్రింక్స్ అందిస్తూ గడపాల్సి వచ్చింది. పైగా ప్రస్తుత సీజన్ రంజీ జ‌ట్టులో అర్జున్‌కు చోటే లేకుండాపోయింది. ముంబై రంజీ జట్టుతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అర్జున్ పేరు ఉన్నా అతడిని ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. దీంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు.ఈ నేపథ్యంలోనే అర్జున్.. ఇక ముంబైతో ఉంటే లాభం లేదని గ్రహించాడు. ఇదే విషయమై సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ స్పందిస్తూ.. 'అర్జున్ ఎక్కువ సమయం గ్రౌండ్‌లో గడపాలని భావిస్తున్నాడు. అదే అతడి కెరీర్‌కు మేలు చేస్తుంది. గోవాకు మారితే ఆ జట్టు తర‌ఫున‌ గణనీయమైన సంఖ్యలో మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కుతుంది. అతని కెరీర్‌లో ఇదో కీలక పరిణామం..' అని తెలిపింది.

గోవా క్రికెట్ సంఘం ఆహ్వానం...

మరోవైపు...సచిన్ పుత్రుడు అర్జున్ టెండుల్కర్ తమ జట్టుకు ఆడతానంటే అంతకంటే ఆనందం ఏముంటుందంటూ గోవా క్రికెట్ సంఘం అధ్య‌క్షుడు ఉబ్బితబ్బిబవుతున్నాడు. తన జట్టుకు లెఫ్టార్మ్ పేస్ ఆల్ రౌండర్ అవసరం ఎంతో ఉందని, అర్జున్ లాంటి యువ ఆల్ రౌండర్ కోసమే తాము ఎదురుచూస్తున్నామంటూ.. గోవా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరజ్ లొత్లీకర్ ప్రకటించాడు.

అప్పుడు రోహన్ - ఇప్పుడు అర్జున్!

భారత క్రికెట్లో క్రికెట్ దిగ్గజాల పుత్రరత్నాలు పొరుగు రాష్ట్రాల‌కు వలస వెళ్ళటం ఇదే మొదటిసారికాదు. గతంలో సునీల్ గవాస్కర్ కుమారుడు రోహన్ గవాస్కర్ సైతం.. ముంబై జట్టు తరఫున‌ ఆడటానికి తగిన అవకాశాలు లభించక..బెంగాల్ క్రికెట్ సంఘానికి వలస వెళ్లాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున‌ ఆడటం ద్వారా భారత వన్డే జట్టులో రోహన్ చోటు దక్కించుకోగలిగాడు. ఇప్పుడు అర్జున్ టెండుల్కర్ సైతం..ముంబైని కాదనుకుని గోవాకు వలస బాట పట్టాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండుల్కర్ ..ఇద్దరూ క్రికెట్ చరిత్రలోనే దిగ్గజాలు మాత్రమే కాదు...ముంబై, భారత జట్లకు నాయకులుగా వ్యవహరించారు. ఈ ఇద్దరి దిగ్గజ ఆటగాళ్ల కుమారులు సైతం ఎడమ చేతివాటం ఆల్ రౌండర్లే కావడం విశేషం.

ముంబై జట్టులో చోటు లేక బ్యాటు, బాలు చేతపట్టి పొరుగు రాష్ట్రాల‌కు వలసపోక తప్పని పరిస్థితిలో పడిపోవటం యాధృచ్చికమే మరి.!

First Published:  12 Aug 2022 12:24 PM IST
Next Story