Telugu Global
Sports

విశ్వవిజేత అర్జెంటీనాకు డబ్బేడబ్బు!

విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ తో పాటు 42 మిలియన్ డాలర్లు ( 348 కోట్ల రూపాయలు ) బంపర్ ప్రైజ్ మనీ అందుకొంది. ఫుట్ బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఇదే అతిపెద్ద ప్రైజ్ మనీ కావడం విశేషం.

విశ్వవిజేత అర్జెంటీనాకు డబ్బేడబ్బు!
X

విశ్వవిజేత అర్జెంటీనాకు డబ్బేడబ్బు!

ఫిఫా ప్రపంచకప్ అంటే ఫుట్ బాల్ సంబరం, రికార్డులు మాత్రమే కాదు, కళ్ళు చెదిరే మొత్తంలో డబ్బు కూడా. మరే క్రీడలో లేనంత ప్రైజ్ మనీ ఫిఫా ప్రపంచకప్ లో మాత్రమే ఉంటుందని 2022 ప్రపంచకప్ తేల్చి చెప్పింది...

ఖతర్ వేదికగా గత నాలుగువారాలుగా సాగిన 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ మహాసంబరానికి అర్జెంటీనా విజేతగా నిలవడంతో తెరపడింది. మొత్తం 32 జట్లతో దోహాలోని ఎనిమిది స్టేడియాలు వేదికలుగా 64 మ్యాచ్ లు గా నిర్వహించిన ఈ టోర్నీ టైటిల్ సమరానికి అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు గొప్ప ముగింపునిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లమంది అభిమానులకు పైసా వసూల్ అనుకొనేలా చేశాయి.

అర్జెంటీనా తరపున మిడ్ ఫీల్డ్ మాంత్రికుడు లయనల్ మెస్సీ, ఫ్రాన్స్ తరపున సూపర్ స్ట్ర్రయికర్ కీలాన్ ఎంబప్పే స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించి వారేవ్వా అనిపించుకొన్నారు.

మెస్సీ తన జట్టు తరపున రెండు కీలక గోల్స్ సాధిస్తే...ఎంబప్పే హ్యాట్రిక్ తో మ్యాచ్ ను పెనాల్టీ షూటౌట్ వరకూ తీసుకెళ్లాడు.

షూటౌట్ లో అర్జెంటీనా 4-2 గోల్స్ తో మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.నాకౌట్ రౌండ్లలో రెండుసార్లు పెనాల్టీ షూటౌట్ విజయాలు సాధించడం ద్వారా అర్జెంటీనా ప్రపంచ చాంపియన్ గా అవతరించింది.

ఫైనల్స్ లో మూడో షూటౌట్...

ప్రపంచకప్ ఫుట్ బాల్ ఎనిమిదిన్నర దశాబ్దాల చరిత్రలో టైటిల్ సమరం షూటౌట్లో ముగియటం ఇది మూడోసారి. 1994 ప్రపంచకప్ ఫైనల్లో ఇటలీ-బ్రెజిల్ జట్ల పోరు, 2006 ఫైనల్లో ఫ్రాన్స్- ఇటలీజట్ల పోరు పెనాల్టీ షూటౌట్లోనే ముగియటం విశేషం. ప్రస్తుత 2022 ప్రపంచకప్ ఫైనల్స్ సైతం షూటౌట్ ఫలితంతోనే ముగిసింది.

కనీస ప్రైజ్ మనీ 75 కోట్లు...

ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందుతున్న క్రీడ, నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ మాత్రమే. ఆటకు తగ్గట్టుగానే అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య భారీమొత్తంలో ప్రైజ్ మనీ ఇస్తూ వస్తోంది.

ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్ రౌండ్లో పాల్గొన్న మొత్తం 32 జట్లు 75 కోట్ల రూపాయల కనీస ప్రైజ్ మనీ నుంచి విజేత జట్టుకు ఇచ్చే 348 కోట్ల రూపాయల వరకూ నజరానాగా అందుకొన్నాయి.

విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ తో పాటు 42 మిలియన్ డాలర్లు ( 348 కోట్ల రూపాయలు ) బంపర్ ప్రైజ్ మనీ అందుకొంది. ఫుట్ బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఇదే అతిపెద్ద ప్రైజ్ మనీ కావడం విశేషం.

రన్నరప్ ఫ్రాన్స్ జట్టుకు 30 మిలియన్ డాలర్లు ( 248 కోట్ల రూపాయల ) నజరానా సొంతమయ్యింది. కాంస్య పతకంతో మూడోస్థానం దక్కించుకొన్న క్రొయేషియాజట్టుకు 27 మిలియన్ డాలర్లు ( 223 కోట్ల రూపాయలు ), 4వ స్థానంలో నిలిచిన మొరాకోకు 25 మిలియన్ డాలర్లు ( 207 కోట్ల రూపాయలు) దక్కాయి.

క్వార్టర్ ఫైనల్స్ లో పరాజయం పొందిన నాలుగుజట్లకు 110 కోట్లు ( 17 మిలియన్ డాలర్లు ), గ్రూపులీగ్ దశలో పాల్గొన్న ఒక్కోజట్టుకు 75 కోట్ల రూపాయలు ( 13 మిలియన్ డాలర్లు ) చొప్పున ప్రైజ్ మనీగా చెల్లించారు.

ప్రపంచవ్యాప్తంగా 204 దేశాలు ఫుట్ బాల్ ఆడుతుంటే ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించిన 32 అగ్రశ్రేణిజట్లకు ఎనలేని గౌరవంతో పాటు ఘనమైన పారితోషికం అందటం...ఫిఫా ప్రపంచకప్ గొప్పతనం కాక మరేమిటి.!

First Published:  19 Dec 2022 9:32 AM IST
Next Story