Telugu Global
Sports

విశ్వవిజేతకు అర్జెంటీనా బ్రహ్మరథం!

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ విజేత అర్జెంటీనాజట్టుకు స్వదేశంలో లక్షలాదిమంది అభిమానులు ఘనస్వాగతం పలికారు.

విశ్వవిజేతకు అర్జెంటీనా బ్రహ్మరథం!
X

2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ విజేత అర్జెంటీనాజట్టుకు స్వదేశంలో లక్షలాదిమంది అభిమానులు ఘనస్వాగతం పలికారు. రాజధాని బ్యునోస్ ఏర్స్ లో తమజట్టు కు స్వాగతం పలకడానికి 60 లక్షల మంది అభిమానులు తరలి వచ్చారు...

ఖతర్ వేదికగా ముగిసిన 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ లో విజేతగా నిలిచి..స్వదేశానికి తిరిగి వచ్చిన అర్జెంటీనా సాకర్ వీరులకు రాజధాని బ్యునోస్ ఏర్స్ లో తండోపతండాలుగా తరలి వచ్చిన లక్షలాదిమంది అభిమానులు బ్రహ్మరథం పట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం పలికారు.

30 కిలోమీటర్లు.. 60 లక్షలమంది అభిమానులు

36 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ గెలుచుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన మెస్సీ సేనకు అర్జెంటీనా రాజధాని బ్యునోస్ ఏర్స్ నగరంలోని అభిమానులు అపూర్వస్వాగతం పలికారు.

ఖతర్ రాజధాని దోహా నుంచి ప్రత్యేక విమానంలో అర్జెంటీనా రాజధానికి చేరుకొన్న సాకర్ వీరుల బృందం కోసం 30 కిలోమీటర్ల మేర బస్సుయాత్రను ఏర్పాటు చేశారు.

విమానాశ్రయం నుంచి అధ్యక్షభవనం వరకూ గల మొత్తం 30 కిలోమీటర్ల మార్గం 60 లక్షలమంది అభిమానులతో కిటకిటలాడిపోయింది. ఇసకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసి పోయింది.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ బస్సులో పరేడ్ ప్రారంభించిన అర్జెంటీనా జట్టు సభ్యులకు అభిమానులు హర్షద్వానాలతో, నినాదాలతో స్వాగతం పలికారు. మిడ్ ఫీల్డ్ మాంత్రికుడు, నాయకుడు లయనల్ మెస్సీ ప్రపంచకప్ ను రెండుచేతులతో పట్టుకొని..గాలిలోకి లేపుతూ అభిమానులకు అభివాదం చేశాడు.

హెలీకాప్టర్ లో అధ్యక్షభవనానికి...

అంచనాలకు మించి అభిమానులు తరలి రావడంతో పోలీసులు అదుపు చేయడంలో విఫలమయ్యారు. మొత్తం 30 కిలోమీటర్ల దూరం పరేడ్ సజావుగా కొనసాగే అవకాశం లేకపోడంతో...మార్గమధ్యం నుంచే ఆటగాళ్లు ప్రత్యేక హెలీకాప్టర్లలో తమ విజయయాత్రను కొనసాగిస్తూ అర్జెంటీనా అధ్యక్షభవనానికి చేరుకోగలిగారు.

అయితే..మొత్తం 30 కిలోమీటర్ల దూరం ఊరేగింపును నిర్వహించక పోడం పట్ల అర్జెంటీనా ఫుట్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు క్లాడియో తాపియా ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాదిమంది అభిమానులకు సాకర్ హీరోలను దూరం చేయటానికి ఇది పోలీసులు పన్నిన కుట్ర అంటూ మండిపడ్డారు.

రాజధాని బ్యునోస్ ఏర్స్ నడిబొ్డ్డున ఉన్న ఓబ్లిస్క్ చారిత్రక కట్టడం దగ్గర అర్జెంటీనా క్రీడావిజయోత్సవాలను జరపడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే..ఓబ్లిస్కీ కట్టడం దగ్గర...ప్రపంచ విజేత జట్టును అనుమతించకపోడం దేశానికే అవమానమని విమర్శించారు. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు..తమకు శాంతిభద్రతలు, ఆటగాళ్ల భద్రత ప్రధానమని పోలీసు అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం రోజు రోజుకూ పెరిగి పోతున్న ద్రవ్యోల్బణంతో అర్జెంటీనా అతలాకుతలమైపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో సామాన్య ప్రజలు ప్రభుత్వం పట్ల తీవ్రఅసంతృప్తితో ఉన్నారు.

అసంతృప్తి, అశాంతితో ఉన్న ప్రజలకు ఫుట్ బాల్ జట్టు సాధించిన ప్రపంచకప్ విజయం ఓదార్పు మిగుల్చుతుందనుకొంటే..అదికూడా సవ్యంగా జరగపోడం దురదృష్టకరమని అంటున్నారు.

సాకర్ వీరుల బస్సు పరేడ్ అర్థంతరంగా ముగియటం, హెలీకాప్టర్లో వెళ్లిపోడంతో లక్షలాదిమంది అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

First Published:  21 Dec 2022 11:45 AM IST
Next Story