Telugu Global
Sports

కొసరు క్రికెట్ తో అసలు క్రికెట్ కే ఎసరు...కపిల్ ఆందోళన!

క్రికెట్...మూడక్షరాల ఆట..మూడు రూపాలలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరిస్తూ వందల కోట్ల రూపాయల వ్యాపారంగా రూపాంతరం చెందుతోంది.

కొసరు క్రికెట్ తో అసలు క్రికెట్ కే ఎసరు...కపిల్ ఆందోళన!
X

క్రికెట్...మూడక్షరాల ఆట..మూడు రూపాలలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను అలరిస్తూ వందల కోట్ల రూపాయల వ్యాపారంగా రూపాంతరం చెందుతోంది.

అలనాటి బ్రిటీష్ పాలిత దేశాలకు మాత్రమే పరిమితమైన క్రికెట్ ...ప్రపంచీకరణ పుణ్యమా అంటూ వ్యాపారవాహక, ప్రచార క్రీడగా మారిపోయింది. క్రికెట్ అంటే పెద్దమనుషుల క్రీడ, మర్యాదస్తుల క్రీడ అన్న భావనలకు కాలం చెల్లింది.

18వ శతాబ్దంలో ప్రారంభమైన సాంప్రదాయ టెస్టు క్రికెట్, 1970 దశకంలో రూపుదిద్దుకొన్న 50 ఓవర్ల వన్డే క్రికెట్ ఫార్మాట్లు క్రికెట్ ఉనికిని నిలబెడుతూ వస్తున్నా..

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ తుపానులో నిలబడలేని పరిస్థితి ముంచుకొస్తోంది.

ముందొచ్చిన చెవుల కన్నా.....

ముందొచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నసామెత ప్రస్తుత క్రికెట్ పరిస్థితికి అతికినట్లు సరిపోతుంది. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ నుంచి ప్రపంచ క్రికెట్ కు

కరోనా వైరస్ స్థాయిలో విస్తరించిన టీ-20 క్రికెట్ లీగ్ లతో అసలు సిసలు క్రికెట్ కే ముప్పువాటిల్లింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, దక్షిణాఫ్రికా ప్రీమియర్ లీగ్, హండ్రెడ్స్, గ్లోబల్ ప్రీమియర్ లీగ్...ఇలా పలురకాల పేర్లతో టీ-20 క్రికెట్ విలసిల్లుతోంది. మూడున్నర గంటల్లో 20 ఓవర్లు..60 థ్రిల్స్ గా సాగిపోతున్న ఈ లీగ్ మహమ్మారి బడాబాబులు, బిజినెస్ మ్యాగ్నెట్లు, సెలెబ్రిటీల ఘరానా వ్యాపారంగా మారిపోయింది.

ఒక్కో టీ-20 మ్యాచ్ తో 200 కోట్లు, ఒక్కో టీ-20 లీగ్ తో వందల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతోంది. క్రికెటర్లకు, క్రికెట్ సంఘాలకు, క్రికెట్ వ్యవస్థకు, క్రికెట్ తో సంబంధం ఉన్న వివిధ వర్గాలకు దండిగా ఆదాయం సమకూర్చి పెడుతోంది. ప్రసారహక్కుల ద్వారా వివిధ రూపాలలో వేలకోట్ల రూపాయల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతోంది.



కష్టం తక్కువ- రాబడి ఎక్కువ!

ఐదురోజులపాటు జరిగే టెస్ట్ క్రికెట్, 50 ఓవర్ల వన్డే క్రికెట్ ఫార్మాట్లలో ఆడటానికి ప్రస్తుత తరం క్రికెటర్లలో ఎక్కువమంది ఏమాత్రం ఆసక్తి చూపడంలేదు. సంవత్సరం పొడుగునా టెస్టు, వన్డే సిరీస్ లు ఆడినా లభించని ఆదాయం..కేవలం కొద్ది వారాలపాటు మాత్రమేసాగే టీ-20 లీగ్ ల ద్వారా క్రికెటర్లకు దక్కుతోంది. నాలుగు ఓవర్ల బౌలింగ్, 20 ఓవర్ల బ్యాటింగ్ తో దండిగా సంపాదించడం అలవాటైన నేటితరం క్రికెటర్లు..కఠోరసాధన, శ్రమ, ఓర్పునేర్పులు అవసరమైన టెస్టు క్రికెట్లో పాల్గొనటానికి విముఖత చూపుతున్నారు.

దీనికితోడు ఐసీసీ, బీసీసీఐ లాంటి బడా క్రికెట్ వ్యవస్థలు సైతం సంపాదన కోసం మూడున్నర గంటల తమాషాగా సాగే టీ-20 లీగ్ టోర్నీలకే ప్రాధాన్యమివ్వడం ఆందోళన కలిగిస్తోంది.

ఐసీసీ, బీసీసీఐల చర్యల కారణంగా టీ-20 మ్యాచ్ స్టేడియాలు కిటకిటలాడుతుంటే...టెస్టు, వన్డేమ్యాచ్ లు జరిగే స్టేడియాలు జనం లేక వెలవెలబోతున్నాయి.

క్రికెట్ దిగ్గజం ఆందోళన...

మరోవైపు... పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ-20 ఫ్రాంచైజీ లీగ్‌లతో సంప్రదాయ క్రికెట్‌మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రసుత పరిస్థితులను చూస్తుంటే .. యూరప్ లో ఫుట్‌బాల్ మాదిరిగా క్రికెట్ తయారవుతుందని, ఇదేమంత సంతోషించదగ్గ విషయం కాదని కపిల్ వాపోయారు. టెస్టు, వన్డే క్రికెట్‌ను పరిరక్షించుకోడం పైన ఐసీసీ దృష్టి కేంద్రీకరించాలని సూచించాడు.

ఓ విదేశీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌దేవ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు...ప్రస్తుత క్రికెట్‌ను చూస్తుంటే యూరప్‌లో ఫుట్‌బాల్ లాగానే క్రికెట్ సైతం తయారవుతోందని, అక్కడి ఫుట్ బాల్ ప్లేయర్లు ప్రయివేటు లీగ్ ల్లో ఆడటానికి ఇచ్చిన ప్రాధాన్యం..తమ దేశం తరపున ఆడే మ్యాచ్ లకు ఇవ్వటం లేదని గుర్తు చేశారు.

నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ లో పాల్గొనటం, ఆ తర్వాత నుంచి ప్రయివేటు లీగ్ ల్లో ఆడటం చేస్తున్నారని...అదే పరిస్థితి క్రికెట్ కు దాపురించిందని కపిల్ మండి పడ్డారు. యూరోపియన్ ఫుట్ బాల్ జాఢ్యం క్రికెట్‌కూ సోకితే.. క్రికెటర్లందరూ ప్రపంచకప్‌టోర్నీలలో మాత్రమే తమతమ దేశాలకు ప్రాతినిథ్యం వహించి..ఆ తర్వాత నుంచి ఫ్రాంచైజీ లీగ్ లకే పరిమితమైపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఐసీసీ పైన బృహతర బాధ్యత ఉంది. టీ -20 క్రికెట్‌నే కాకుండా టెస్టు, వన్డేలనూ బతికించుకోడానికి నడుంబిగించాలి. టెస్టు, వన్డే సిరీస్ ల కోసం తగిన సమయం కేటాయించాలని కపిల్ సూచించాడు.

ఇది టీ-20 మాయాబజార్!

క్రికెట్‌లో ఇప్పుడు టీ- 20 యుగం నడుస్తోంది. ప్రస్తుతం వన్డేలు ఆడేందుకు ఏ జట్టు, క్రికెటర్లు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) రిటైర్మెంట్ తర్వాత వన్డే క్రికెట్ మనుగడ మీద చర్చకు తెరలేచింది. క్రికెటర్లు సైతం తమకు తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం లభించే ఇన్ స్టాంట్ టీ-20 లీగ్ ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కపిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గాయాలు, ఫిట్ నెస్ సమస్యల సాకుతో ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరంగా ఉంటున్న క్రికెటర్లు ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, ది హండ్రెడ్ వంటి లీగ్ లలో మాత్రం పూర్తి ఫిట్ నెస్ తో క్రమం తప్పకుండా ఆడుతున్నారు. ఇవీచాలవన్నట్లుగా వీటికి తోడుగా వచ్చే ఏడాది నుంచి దక్షిణాఫ్రికా, యూఏఈలలో కూడా కొత్త టీ-20 లీగ్ లు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగామ్స్ కార్యక్రమం ఊపిరి సలుపని రీతిలో తయారయ్యింది.

బంగారు బాతుగా మారిన క్రికెట్ ను జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అంతర్జాతీయ క్రికెట్ మండలిపైనే ఎంతైనా ఉంది.




First Published:  17 Aug 2022 6:33 AM GMT
Next Story