Telugu Global
Sports

భారత యువ ఆర్చర్ కు ఒలింపిక్స్ అర్హత!

పారిస్ వేదికగా మరి కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ విలువిద్య మహిళల రికర్వ్ విభాగంలో పాల్గొనటానికి భారత యువఆర్చర్ భజన్ కౌర్ అర్హత సంపాదించింది.

భారత యువ ఆర్చర్ కు ఒలింపిక్స్ అర్హత!
X

పారిస్ వేదికగా మరి కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న 2024 ఒలింపిక్స్ విలువిద్య మహిళల రికర్వ్ విభాగంలో పాల్గొనటానికి భారత యువఆర్చర్ భజన్ కౌర్ అర్హత సంపాదించింది.

టర్కీ వేదికగా జరిగిన ఒలింపిక్స్ అర్హత విలువిద్య పోటీల మహిళల రికర్వ్ విభాగంలో అంచనాలు తలకిందులయ్యాయి.భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి అర్హత సాధించడంలో విఫలం కాగా...ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన 18 ఏళ్ల యువఆర్చర్ భజన్ కౌర్ బంగారు పతకం గెలుచుకోడం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది.

ఒలింపిక్స్ ఆర్చరీలో ఇద్దరికే అర్హత....

ఒలింపిక్స్ ఆర్చరీ రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత్ కు చెందిన ధీరజ్ బొమ్మదేవర గతంలోనే అర్హత సంపాదించగా.. మహిళల వ్యక్తిగత విభాగంలో భజన్ కౌర్ అనూహ్యంగా ఒలింపిక్స్ బెర్త్ సాధించింది.

టర్కీ నగరం అటాల్యా వేదికగా ఒలింపిక్స్ అర్హత కోసం నిర్వహించిన ప్రపంచ అర్హత టోర్నీ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ దశలోనే భారత మేటి ఆర్చర్ దీపిక కుమారి విఫలమయ్యింది.

అయితే..మహిళల రికర్వ్ వ్యక్తిగత బెర్త్ కోసం జరిగిన పోరులో భారత యువఆర్చర్ భజన్ కౌర్ వరుస విజయాలతో విజేతగా నిలిచింది. బంగారు పతకంతో పాటు..ఒలింపిక్స్ అర్హత ను సైతం సాధించింది.

కొద్దిమాసాల క్రితం జరిగిన ఆసియా క్వాలిఫైయింగ్ లెగ్ పోటీల పురుషుల రికర్వ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవర సఫలం కాగా..ఇప్పుడు మహిళల విభాగంలో భజన్ కౌర్ అదే ఘనత సాధించగలిగింది.

గోల్డ్ మెడల్ రౌండ్లో భజన్ కౌర్ హిట్...

బంగారు పతకం కోసం జరిగిన టైటిల్ పోరులో ఇరాన్ ఆర్చర్ మోబీనా ఫాలాను 6-2 తో భజన్ కౌర్ చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన ప్రారంభ సెట్లో భజన్ కౌర్ 28-26 పాయింట్లతో నెగ్గి 1-0తో శుభారంభం చేసింది.

రెండోసెట్లో ఇద్దరూ 29-29 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. మూడోసెట్లో భజన్ 29-26తో నెగ్గింది. కీలక నాలుగో సెట్ సైతం 29-29తో ముగిసింది.

అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో మాల్దోవా ఆర్చర్ అలెగ్జాండ్రా మిర్కాను సైతం 6-2తోనే భజన్ కౌర్ చిత్తు చేయడం ద్వారా ఫైనల్లో చోటు సంపాదించింది.

భారత మరో ఆర్చర్ అంకితా భక్త్ క్వార్టర్ ఫైనల్స్ వరకూ నిలకడగా రాణిస్తూ వచ్చినా సెమీస్ చేరుకోడంలో విఫలం కావడంతో...ఒలింపిక్స్ కోటా దక్కించుకొనే అవకాశం భజన్ కౌర్ కు దక్కింది.

టీమ్ ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ మహిళల రికర్వ్ విభాగంలో అర్హత దక్కించుకొనే అవకాశం లేకపోలేదు. దీపిక కుమారి, భజన్ కౌర్, అంకిత భక్త్ లతో కూడిన భారతజట్టు మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో పాల్గొనే అవకాశం ఉంది.

8వ ర్యాంకులో భారత మహిళాజట్టు..

అంతర్జాతీయ విలువిద్య సమాఖ్య తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..భారత మహిళల రికర్వ్ జట్టు 8వ ర్యాంకులో కొనసాగుతోంది. దక్షిణ కొరియా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, మెక్సికో, అమెరికా, చైనీస్ తైపీ జట్లు తమ ర్యాంకింగ్స్ ఆధారంగా ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ టీమ్ బెర్త్ లు ఖాయం చేసుకోగా...8వ ర్యాంక్ లో ఉన్న భారతజట్టు ఒలింపిక్స్ కోటాను దక్కించుకోనుంది.

మహిళల టీమ్ విభాగంలో భారత్ 185 పాయింట్లు, ఇండోనీసియా 179.5, కొలంబియా 152, ఇటలీ 150 పాయింట్లతో ఒలింపిక్స్ బెర్త్ రేస్ లో పోరాడుతున్నాయి.

పురుషుల విభాగంలో భారత్ కు 2వ ర్యాంక్..

పురుషుల రికర్వ్ టీ్మ్ ర్యాంకింగ్స్ లో భారత్ 243 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. దక్షిణ కొరియా నంబర్ వన్ ర్యాంకర్ హోదాలో ఒలింపిక్స్ అర్హత సంపాదించగా..

204 పాయింట్లతో చైనా, 190 పాయింట్లతో జపాన్ జట్లు భారత్ తర్వాతిస్థానాలలో కొనసాగుతున్నాయి.

First Published:  18 Jun 2024 5:17 PM IST
Next Story