భారత బ్యాడ్మింటన్ జోడీకి మరో టైటిల్ !
అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో భారతజోడీ చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ ల జైత్రయాత్ర కొనసాగుతోంది.
అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో భారతజోడీ చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ ల జైత్రయాత్ర కొనసాగుతోంది. 2023 ఇండోనీషియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను సైతం కైవసం చేసుకొన్నారు....
ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో భారత యువజోడీ చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ ల విజయపరంపర, టైటిళ్ల జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది.
ఇటీవలే ఆసియా డబుల్స్ టైటిల్ నెగ్గిన ఈ జోడీ 2023 ఇండోనీషియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ ను సైతం అలవోకగా గెలుచుకొని చరిత్ర సృష్టించారు.
టైటిల్ నెగ్గిన భారత తొలిజోడీ..
ఇండోనీషియన్ సూపర్-1000 పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత తొలిజంటగా తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. జకార్తా వేదికగా ముగిసిన టైటిల్ సమరంలో ప్రపంచ 6వ ర్యాంక్ భారతజోడీకి ఎదురేలేకపోయింది. కేవలం 43 నిముషాలలోనే ప్రపంచ చాంపియన్ జోడీ, మలేసియాజంట ఆరోన్ చియా- సోహ్ వూ ఇక్ లను 21-17, 21-18తో చిత్తు చేసి ట్రోఫీ అందుకొన్నారు.
ఈ టైటిల్ కోసం తాము పూర్తిస్థాయిలో సిద్ధమై వచ్చామని, ఫైనల్లో అత్యుత్తమంగా ఆడామని విజయానంతరం ఈజోడీ చెప్పారు. తొలిగేమ్ లో ప్రత్యర్థిజోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడామని, రెండోగేమ్ లో సైతం అదేజోరు కొనసాగించడంతో విజయం గట్టి పోటీ లేకుండానే వచ్చిందని తెలిపారు.
బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ పురుషుల డబుల్స్ లో బంగారు పతకం, ప్రపంచ బ్యాడ్మింటన్లో కాంస్య పతకాలు సాధించిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ ల జంట..చివరకు ఇండోనీషియన్ మాస్టర్స్ లో సైతం సత్తా చాటుకోగలిగారు.
సైనా, శ్రీకాంత్ ల సరసన....
ఇండోనీషియన్ మాస్టర్స్ మహిళల సింగిల్స్ టైటిల్స్ ను సైనా నెహ్వాల్ 2010, 2012 సంవత్సరాలలో గెలుచుకోగా..2017 సీజన్ పురుషుల టైటిల్ ను కిడాంబీ శ్రీకాంత్ సాధించాడుఆ తర్వాత పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ జోడీ సాధించడం విశేషం. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్కూట్ లోని సూపర్ 100, సూపర్ 300, సూపర్ 500, సూపర్ 750 స్థాయి టైటిల్స్ ను నెగ్గిన భారత తొలిజంటగా రికార్డు నెలకొల్పిన సాయి సాత్విక్- చిరాగ్ ..ఇప్పుడు సూపర్ -1000 స్థాయి టైటిల్ ను సైతం సాధించగలిగారు.
చిరాగ్ నెట్ గేమ్ తో పాటు డిఫెన్స్ లో అదరగొడుతుంటే..సాయి సాత్విక్ ఎటాకింగ్ గేమ్ తో చెలరేగిపోతున్నాడు. ఈ ఇద్దరి జోడీ గతంలో భారత్ తొలిసారిగా థామస్ కప్ గెలుచుకోడం లో సైతం తమవంతు పాత్ర నిర్వర్తించారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ విభాగంలో భాగంగా ప్రతి ఏటా నాలుగు సూపర్ -1000, ఏడు సూపర్ -750, 11 సూపర్ 300, సూపర్ -100 స్థాయి టోర్నీలను అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహిస్తూ వస్తోంది. ఈ టోర్నీలలో పాల్గొని సాధించిన పాయింట్ల ప్రాతిపదికన ర్యాంకింగ్స్ ను నిర్ణయిస్తున్నారు.
సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ జోడీ గత మూడు సంవత్సరాల కాలంలో కామన్వెల్త్ గోల్డ్, థామస్ కప్ బంగారు పతకం, ప్రపంచ బ్యాడ్మింటన్ కాంస్య పతకం, సయద్ మోడీ ఓపెన్ సూపర్ -300, థాయ్ ఓపెన్, ఇండియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకొన్నారు. చివరకు ఇండోనీషియన్ సూపర్ -1000 టైటిల్ ను సైతం తమ ఖాతాలో జమచేసుకోగలిగారు.