Telugu Global
Sports

ఒలింపిక్స్ హాకీకి మరో పేరు భారత్ !

ఒలింపిక్స్ హాకీలో భారత్ కు ఘనమైన చరిత్రే ఉంది. ఎనిమిది స్వర్ణపతకాలు సాధించిన ఏకైక దేశం భారత్ మాత్రమే. వరుసగా ఆరు ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించిన ప్రపంచ రికార్డు భారత్ కు మాత్రమే సొంతం.

ఒలింపిక్స్ హాకీకి మరో పేరు భారత్ !
X

ఒలింపిక్స్ హాకీలో భారత్ కు ఘనమైన చరిత్రే ఉంది. ఎనిమిది స్వర్ణపతకాలు సాధించిన ఏకైక దేశం భారత్ మాత్రమే. వరుసగా ఆరు ఒలింపిక్స్ లో బంగారు పతకాలు సాధించిన ప్రపంచ రికార్డు భారత్ కు మాత్రమే సొంతం.

పారిస్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న 2024 ఒలింపిక్స్ పురుషుల హాకీలో మాజీ చాంపియన్ భారత్ బంగారు పతకానికి గురిపెట్టింది.

మొత్తం 117 మంది అథ్లెట్లతో 16 క్రీడాంశాలలో భారత అథ్లెట్లు పతకాలవేట మొదలు పెట్టారు. పురుషుల హాకీలో 7వ ర్యాంక్ జట్టుగా భారత్ బరిలో నిలిచింది. గత ఒలింపిక్స్ లో సాధించిన కాంస్య పతకానికి ప్రస్తుత ఒలింపిక్స్ లో స్వర్ణకాంతి తీసుకురావాలని ఉబలాటపడుతోంది. గ్రూపు-ఏ లీగ్ లో న్యూజిలాండ్, అర్జెంటీనా, ఐర్లాండ్, బెల్జియం, ఆస్ట్ర్రేలియా లాంటి మేటిజట్లతో తలపడనుంది. గ్రూపు మొదటి రెండుజట్లలో ఒకటిగా నిలిస్తేనే మెడల్ రౌండ్ చేరే అవకాశం ఉంది.

1928 నుంచి 2020 వరకూ....

1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ నుంచి 1980 మాస్కో ఒలింపిక్స్ వరకూ ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించిన భారత్ ఆ తర్వాత నుంచి మరో పతకం కోసం 41 సంవత్సరాలపాటు వేచి చూడాల్సి వచ్చింది.

2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడం ద్వారా భారత్.. ప్రపంచ హాకీలో తన అస్థిత్వాన్నిచాటుకోగలిగింది. ఒలింపిక్స్ లో భారత్ సాధించిన మొత్తం 12 పతకాలలో 8 స్వర్ణ, ఒక రజత, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.

అత్యధిక పతకాలు, విజయాలజట్టుగా..

ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక బంగారు పతకాలు సాధించడంలో మాత్రమే కాదు..అత్యధిక విజయాలు సాధించిన జట్టుగానూ భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకం పోరు వరకూ 134 మ్యాచ్ లు ఆడిన భారత్ 83 విజయాలతో అత్యంత విజయవంతమైనజట్టుగా నిలిచింది.

1928- 1960 మధ్యకాలంలో వరుసగా ఆరు స్వర్ణాలు సాధించిన ఘనత కూడా భారత్ కే దక్కుతుంది.

12 పతకాలతో హాకీదే అగ్రస్థానం...

స్వాతంత్ర్యానికి పూర్వమే భారత హాకీజట్టు 1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ లో స్వర్ణపతకంతో బోణీ కొట్టింది. 1932 లాస్ ఏంజెలిస్, 1936 బెర్లిన్, 1948 లండన్, 1952 హెల్సింకీ, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ వరకూ వరుసగా ఆరు బంగారు పతకాలు సాధించింది. 1960 రో్మ్ ఒలింపిక్స్ లో రజతం మాత్రమే సాధించిన భారత్ తిరిగి 1964 టోక్యో ఒలింపిక్స్ లో సైతం స్వర్ణ పతకం సాధించగలిగింది.

1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ గేమ్స్ లో కాంస్య పతకాల స్థాయికి పడిపోయిన భారత్ ఆ తర్వాత 1980 మాస్కో ఒలింపిక్స్ లో చివరిసారిగా స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో పతకం కోసం 2020 టోక్యో ఒలింపిక్స్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.

492 మాసాల విరామం తరువాత పతకం...

ఒలింపిక్స్ లో తన 12వ పతకం సాధించడానికి భారత్ 41 సంవత్సరాలు, 492 మాసాలు, 14980 రోజులపాటు వేచిచూసిన జట్టుగా కూడా ఓ అసాధారణ రికార్డును సైతం మూటగట్టుకొంది.

1980 మాస్కో ఒలింపిక్స్ లో 11వ పతకం నెగ్గిన భారత్ 12వ పతకం కోసం 2020 టోక్యో గేమ్స్ వరకూ నిరీక్షించాల్సి వచ్చింది.44 ఏళ్ల విరామం తరువాత భారత్ మరో స్వర్ణానికి గురిపెట్టింది.గత ఒలింపిక్స్ లో సాధించిన కాంస్యాన్ని ఈసారి స్వర్ణంగా మార్చుకోడానికి తహతహలాడుతోంది....

13వ పతకం అంత తేలికకాదు.....

టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన కాంస్య పతకాన్ని ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో నిలుపుకోడం భారత్ కు అంత తేలికకాదు. పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ నాయకుడిగా..మన్ ప్రీత్ సింగ్, పీఆర్ శ్రీజేష్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో కూడిన భారతజట్టులో ఐదుగురు యువక్రీడాకారులు సైతం ఉన్నారు. గత ఒలింపిక్స్ లో పాల్గొన్న జట్టులోని 11 మంది ఆటగాళ్లు పారిస్ ఒలింపిక్స్ జట్టులోనూ చోటు సంపాదించగలిగారు.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ, హాంగ్జు ఆసియా క్రీడల బంగారు పతకాలు సాధించిన భారత్..ఒలింపిక్స్ లో సైతం బంగారు వేటకు దిగుతోంది.

డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, మాజీ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, 2016 ఒలింపిక్‌ విజేత అర్జెంటీనా, న్యూజిలాండ్ లాంటి జట్లను అధిగమించగలిగితేనే భారత్ సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరే అవకాశం ఉంది.

లీగ్ దశ తొలిరౌండ్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకూ స్థాయికి మించి, అసాధారణరీతిలో పోరాడగలిగితేనే భారత్ కు బంగారు పతకం గెలుచుకొనే అవకాశం ఉంటుంది.

హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారతజట్టులోని ఇతర ఆటగాళ్లలో జర్మన్ ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్, రాజ్ కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్ ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, అభిషేక్, సుఖ్ జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ, మన్ దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, నీలకంఠ్ శర్మ, జుగ్ రాజ్ సింగ్, కృష్ణ బహదూర్ పాఠక్ ఉన్నారు.

జాతీయక్రీడ హాకీలో భారత్ 9వసారి బంగారు పతకాన్ని అందుకోవాలని 140 కోట్ల భారత అభిమానులు కోరుకొంటున్నారు. చక్ దే ఇండియా అంటూ వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్నారు.

First Published:  25 July 2024 6:11 AM GMT
Next Story