Telugu Global
Sports

ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తొలి రెండు వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

తొలి రెండు వన్డేలకు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌, జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చారు.

ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తొలి రెండు వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
X

కీలకమైన వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో స్వదేశంలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్నది. ఆసియా కప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఈ జట్టును ప్రకటిస్తామని ముందుగానే వెల్లడించారు. ఈ మేరకు సోమవారం రాత్రి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ నిర్వహించిన వర్చువల్ ప్రెస్ మీట్‌లో ఈ మేరకు భారత జట్టును ప్రకటించారు.

తొలి రెండు వన్డేలకు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌, జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చారు. ఇక మొదటి, రెండో వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించారు. ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన కుల్దీప్‌ను పక్కన పెట్టడంపై కూడా అజిత్, రోహిత్ స్పందించారు. కుద్దీప్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే వరల్డ్ కప్ జట్టులో ఉన్న ఇతర స్పిన్నర్లకు కూడా ఛాన్స్ ఇవ్వాల్సి ఉన్నది. అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చామని చెప్పారు.

అక్షర్ పటేల్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. అందుకే మూడో వన్డేకు మాత్రమే ఎంపిక చేశాము. అప్పటికి అతడు పూర్తి ఫిట్‌గా ఉంటేనే అందుబాటులో ఉంటాడని అజిత్ అగార్కర్ అన్నాడు. ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంపిక చేశారు. అశ్విన్ దాదాపు 150 వన్డేలు, 100 టెస్టులు ఆడాడు. టెస్టులు బాగానే ఆడినా.. వన్డే ఫార్మాట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. స్వదేశంలో అతడిని అనుభవం తప్పకుండా పనికి వస్తుందనే అతడిని ఎంపిక చేశామని చెప్పారు.

సాధ్యమైనంత మంచి జట్టును మేం ఎంపిక చేశాము. ఎప్పుడూ ఒకే జట్టుతో ఆడుతూ ఉంటే మన బెంచ్ స్ట్రెంత్ ఎక్కువగా పెరగదు. అందుకే మేం ఈ సారి డిఫరెంట్ జట్టుతో ఆసీస్ సిరీస్ ఆడబోతున్నామని చెప్పారు. వరల్డ్ కప్‌లో 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. అందుకే అందరి ఫిట్‌నెస్, ఫామ్‌ను పరీక్షించాల్సిన అవసరం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు.

మూడో వన్డేకు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, కుద్దీప్ యాదవ్ అందుబాటులోకి వస్తారు. తొలి రెండు వన్డేల్లో హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ, బౌలర్ ప్రసిద్ క్రిష్ణకు చోటు దక్కింది. అయితే మూడో వన్డేలో మాత్రం ఇద్దరినీ పక్కన పెట్టారు.

తొలి రెండు వన్డేలకు భారత జట్టు :

కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, తిలక్ వర్మ, ప్రసిద్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్

మూడో వన్డేకు భారత జట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్

మ్యాచ్ షెడ్యూల్..

తొలి వన్డే - సెప్టెంబర్ 22 - మొహలీ

రెండో వన్డే - సెప్టెంబర్ 24 - ఇండోర్

మూడో వన్డే - సెప్టెంబర్ 27 - రాజ్‌కోట్

అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 నుంచి ప్రారంభం అవుతాయి.


First Published:  18 Sept 2023 3:43 PM GMT
Next Story