Telugu Global
Sports

ఆంధ్రా వికెట్ కీపర్ కు అంత సీన్ లేదా?

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదంలో ఆస్పత్రిపాలు కావడంతో పంత్ వారసుడిగా ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ పేరు గట్టిగా వినిపిస్తోంది.

ఆంధ్రా వికెట్ కీపర్ కు అంత సీన్ లేదా?
X

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదంలో ఆస్పత్రిపాలు కావడంతో పంత్ వారసుడిగా ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే..భరత్ కు అంతసీన్ లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు...

ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా త్వరలో ఆస్ట్ర్రేలియాతో జరిగే 4 మ్యాచ్ ల స్వదేశీ సిరీస్ లో పాల్గొనే భారతజట్టు వికెట్ కీపర్ కోసం అన్వేషణ ప్రారంభమయ్యింది. కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో ఆరుమాసాలపాటు అందుబాటులో ఉండే పరిస్థితి లేకపోడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

పంత్ కు తగిన వారుసుడే లేడా?

భారత క్రికెట్ చరిత్రలోనే గతంలో ఎన్నడూలేని విధంగా వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం కనీవినీ ఎరుగని పోటీ నెలకొని ఉంది. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ భారతజట్ల స్థానాల కోసం పలువురు నాణ్యమైన వికెట్ కీపర్ బ్యాటర్లు పోటీపడుతున్నారు.

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సూపర్ హిట్టర్ రిషభ్ పంత్ కు వికెట్ కీపర్ బ్యాటర్ గా తిరుగులేని రికార్డే ఉంది. భారీషాట్లతో దూకుడుగా ఆడుతూ మెరుపువేగంతో పరుగులు సాధించడం ద్వారా ప్రత్యర్థిజట్లను ఒత్తిడికి గురిచేయటంలో 25 సంవత్సరాల రిషభ్ పంత్ కు రిషభ్ మాత్రమే సాటి. కేవలం తన బ్యాటింగ్ ప్రతిభతోనే భారత్ కు చిసర్మరణీయ విజయాలు అందించిన ఘనత రిషభ్ కు ఉంది.

అయితే...రిషభ్ వచ్చే ఆరుమాసాలపాటు భారతజట్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేకపోడంతో...టెస్టుజట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న తలెత్తింది. పంత్ కు తగిన వారసుడు ఎవరన్న విషయమై ఎవరికివారే తమతమ వాదనలు వినిపిస్తున్నారు.

భరత్ కు టెస్ట్ బెర్త్ అనుమానమేనా?

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో గతంలో వికెట్ కీపర్ బ్యాటర్లుగా సేవలు అందించిన సీనియర్లు వృద్ధిమాన్ సాహా, దినేశ్ కార్తీక్ దాదాపుగా రిటైర్మెంట్ దశలో ఉన్నారు. టెస్టు ఫార్మాట్లో భారత రెండో వికెట్ కీపర్ గా ఆంధ్రాకు చెందిన కెఎస్ భరత్ ను తయారు చేస్తున్నారు. మరోవైపు... స్టార్ ప్లేయర్ కెఎల్ రాహుల్, రెడ్ బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేని ఇషాన్ కిషన్, సంజు శాంసన్, ఇండియా-ఏ ఆటగాడు ఉపేంద్ర యాదవ్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి.

అయితే..రాహుల్ ను స్టాప్ గ్యాప్ వికెట్ కీపర్ గా టీమ్ మేనేజ్ మెంట్ వినియోగించుకొంటుందా? లేక భరత్ కు టెస్టు చాన్స్ ఇస్తుందా?...లేక మరొకరికి అవకాశం ఇస్తుందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

వాస్తవానికి..పంత్ అందుబాటులో లేకపోతే..రెండో వికెట్ కీపర్ భరత్ కే అవకాశం ఇవ్వాలి. అయితే..వికెట్ కీపర్ గా భరత్ ప్రతిభావంతుడే కానీ..బ్యాటర్ గా జట్టు అవసరాలు తీర్చలేడని, పంత్ స్థానాన్ని భర్తీ చేయలేడని క్రికెట్ కామెంటీటర్, భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీం అంటున్నారు.

29 సంవత్సరాల భరత్ అంటే తనకు గౌరవం ఉందని..పంత్ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా మాత్రం ఇషాన్ కిషన్ కు మాత్రమే ఉందని చెబుతున్నారు. పంత్ లా ధాటిగా ఆడే నేర్పు ఇషాన్ లో ఉందని, పైగా..పంత్ లానే ఎడమచేతి వాటం బ్యాటర్ కూడానని గుర్తు చేశారు. దీనికితోడు ఇండియా-ఏ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ఉపేంద్ర యాదవ్, కేరళ సూపర్ హిట్టర్ బ్యాటర్ సంజు శాంసన్ పేర్లు సైతం తెరమీదకు వచ్చాయి.

ఇషాన్ కిషన్, సంజు శాంసన్ లాంటి ఆటగాళ్లు ఇప్పటి వరకూ వైట్ బాల్ క్రికెట్లోనే తమ సత్తా చాటుకొన్నారు. రెడ్ బాల్ క్రికెట్లో అంతగా రాణించిన అనుభవం లేకపోడం వారి టెస్టు అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.

రిషభ్ పంత్ స్థానంలో భరత్ కు అవకాశం కల్పిస్తారా? లేక కెఎల్ రాహుల్ తో సర్ధుకొంటారా?...భరత్ కు అవకాశం ఇచ్చే సాహసం చేస్తారా? తెలుసుకోవాలంటే కొద్దిరోజులపాటు వేచిచూడక తప్పదు.

First Published:  1 Jan 2023 1:30 PM IST
Next Story