Telugu Global
Sports

ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఆంధ్ర మెరుపుతీగ!

బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న 25వ ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లో విశాఖ ఎక్స్ ప్రెస్ జ్యోతి ఎర్రాజీ జంట పతకాలతో మెరుపులు మెరిపించింది.

జ్యోతి ఎర్రాజీ
X

జ్యోతి ఎర్రాజీ 

బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న 25వ ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లో విశాఖ ఎక్స్ ప్రెస్ జ్యోతి ఎర్రాజీ జంట పతకాలతో మెరుపులు మెరిపించింది.

థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా గత మూడురోజులుగా జరిగిన 25వ ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ మహిళల 100 మీటర్ల విభాగంలో భారత యువరన్నర్, ఆంధ్రప్రదేశ్ మెరుపుతీగ జ్యోతీ ఎర్రాజీ జంట పతకాలతో మెరిసింది, తెలుగు రాష్ట్ర్రాలకే గర్వకారణంగా నిలిచింది.

మహిళల 100 మీటర్ల హర్డల్స్ లో బంగారుపతకం, 200 మీటర్ల పరుగులో రజత పతకాలు సాధించింది.

13.13 సెకన్ల రికార్డుతో స్వర్ణం...

బ్యాంకాక్ స్టేడియంలో జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఈ విశాఖ యువరన్నర్ 13.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకుంది. జ్యోతికి ఇదే తొలి అంతర్జాతీయ మీట్ స్వర్ణం కావడం విశేషం. జపాన్‌కు చెందిన అసుక (13.13 సెకన్లు), మాసుమి (13.26 సె.) వరుసగా రజత ,కాంస్యాలతో సరిపెట్టుకొన్నారు.స్పో అధారటీ ఆఫ్ ఇండియా, భువనేశ్వర్ లోని రిలయన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ లలో శిక్షణ పొందుతూ జాతీయ స్థాయిలో పలు సరికొత్త రికార్డులు నెలకొల్పిన జ్యోతి..

ఆసియా స్థాయిలో తొలిసారిగా సత్తా చాటుకోగలిగింది.

పోటీల చివరి రోజున నిర్వహించిన మహిళల 200 మీటర్ల పరుగులో మాత్రం జ్యోతి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

200 మీటర్ల దూరాన్ని జ్యోతి 23.13 సెకన్లలో చేరి రెండో స్థానంలో నిలిచింది. సింగపూర్‌ రన్నర్‌ వెరోనికా (22.70) పసిడి విజేతగా నిలిచింది.

విశాఖలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన జ్యోతి ఆసియా స్థాయిలో దేశానికి రెండు పతకాలు అందించడం ద్వారా గర్వకారణంగా నిలిచింది.

1500 మీటర్ల పరుగు, ట్రిపుల్ జంప్ లో స్వర్ణాలు..

పురుషుల 1500 మీటర్ల పరుగులో అజయ్‌ 3 నిమిషాల 41 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణపతం సాధించాడు. పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో సైతం భారత్ బంగారు మోత మోగించింది. అబూబకర్‌ 16.92 మీటర్లు లంఘించి బంగారు పతకం చేజిక్కించుకున్నాడు.

మహిళల 400 మీటర్ల విభాగంలో ఐశ్వర్య మిశ్రా సైతం రాణించింది.

చివరిరోజున 13 పతకాలు...

ఆసియా అథ్లెటిక్స్ సమాఖ్యను ఏర్పాటుచేసి 50 సంవత్సరాలైన సందర్భంగా నిర్వహించిన ఈ చాంపియన్షిప్ ఆఖరిరోజు పోటీలలో భారత అధ్లెట్లు వివిధ విభాగాలలో 13 పతకాలు సాధించడం విశేషం

మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో స్వర్ణం నెగ్గిన పారుల్‌ చౌదరి.. ఆఖరి రోజున 5000 మీటర్ల పరుగులో రజతం సంపాదించింది.

ఈ చాంపియన్‌సిప్‌లో భారీబృందంతో పాల్గొన్న భారత్ మొత్తం 27 పతకాలు నెగ్గి‌..పతకాల పట్టిక మూడో స్థానంలో నిలిచింది.

భారత అథ్లెట్లు మొత్తం 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలతో సత్తా చాటుకొన్నారు. 2017లో భువనేశ్వర్‌ వేదికగా జరిగిన 24వ ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లో భారత్‌ 27 పతకాలే సాధించడం విశేషం. అదే రికార్డును 25వ ఆసియా మీట్ లో సైతం సమం చేయటం విశేషం.

జంట పతకాలు సాధించిన విశాఖ రన్నర్ జ్యోతి ఎర్రాజీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభినందిస్తూ ఓ సందేశాన్ని పంపారు.

First Published:  17 July 2023 12:00 PM IST
Next Story