Telugu Global
Sports

ఐపీఎల్ మినీ వేలం బరిలో ఆంధ్రాకుర్రోడు!

కొచ్చీ వేదికగా ఈరోజు జరిగే ఐపీఎల్ 16వ సీజన్ మినీ వేలం బరిలోకి ఆంధ్ర కుర్రోడు షేక్ రషీద్ తో సహా ఐదుగురు యువక్రికెటర్లు దిగుతున్నారు.

ఐపీఎల్ మినీ వేలం బరిలో ఆంధ్రాకుర్రోడు!
X

కొచ్చీ వేదికగా ఈరోజు జరిగే ఐపీఎల్ 16వ సీజన్ మినీ వేలం బరిలోకి ఆంధ్ర కుర్రోడు షేక్ రషీద్ తో సహా ఐదుగురు యువక్రికెటర్లు దిగుతున్నారు.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన ఐపీఎల్ వేలం బరిలో నిలిచే అరుదైన అవకాశం ఐదుగురు పిల్లక్రికెటర్లకు దక్కింది. వివిధ దేశాలకు చెందిన పలువురు కాకలుతీరిన ఆటగాళ్లతో కలసి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు వయసున్న ఐదుగురు వేలంలో పాల్గొంటున్నారు.

20 లక్షల రూపాయల కనీస వేలంధరతో..

సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం లేని అన్ క్యాప్డ్ ప్లేయర్లుగా ఆంధ్రాకు చెందిన షేక్ రషీద్, అఫ్ఘనిస్థాన్ కు చెందిన అల్లా మహ్మద్ ఘజన్ ఫర్, దినేశ్ బానా, సకీబ్ హుస్సేన్, కుమార్ కుశాగ్రా ఉన్నారు. ఈ ఐదుగురిలో నలుగురు భారత్ కు చెందినవారే కావడం విశేషం.

మొత్తం 405 మంది ఆటగాళ్ల వేల తుదిజాబితాలో ఐదుగురు క్రికెటర్ల వయసు 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపే ఉండటం మరో విశేషం.

ప్రతిభకు వయసుతో పనిలేదు...

ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధం లేదనటానికి ఐపీఎల్ వేలం మాత్రమే నిదర్శనం. వయసుకు మించిన ప్రతిభతో ఆకట్టుకొంటున్న కుర్రక్రికెటర్లకు తగిన అవకాశాలు కల్పించడానికి వివిధ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయి.

కేవలం 20 లక్షల రూపాయల ధరతోనే నవతరం ఆటగాళ్లలోని అపారప్రతిభను సొమ్ము చేసుకోడానికి పోటీపడుతున్నాయి.

అల్లా మహ్మద్ వయసు 15 ఏళ్ళే..!

వేలం జాబితాలో చోటు సంపాదించిన ఆఫ్ఘన్ కుర్రక్రికెటర్ అల్లా మహ్మద్ ఘజన్ ఫర్ వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. అప్ఘన్ దేశవాళీ క్రికెట్లో బౌలర్ గా సత్తా చాటుకొన్న అల్లా మహ్మద్ ఓ టీ-20 మ్యాచ్ లో 15 పరుగులకే 4 వికెట్లు పడగొ్ట్టాడు. షఫాజీజా క్రికెట్ లీగ్ లో నిలకడగా రాణిస్తు అప్ఘన్ క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాడు.

భారత అండర్ -19 జట్టులోని వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ బానా వయసు 18 సంవత్సరాలు మాత్రమే. జూనియర్ స్థాయిలో అపూర్వంగా రాణించిన దినేశ్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటుకొన్నాడు. హర్యానాకు చెందిన దినేశ్ పేరును వేలం జాబితాలో చేర్చారు.

దేశవాళీ టీ-20 క్రికెట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బీహార్ తరపున బౌలర్ గా అదరగొట్టిన సకీబ్ హుస్సేన్ సైతం 18 సంవత్సరాల కుర్రాడే. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగులకే 4 వికెట్లు పడగొట్టడం ద్వారా అందరి దృష్టిని ఆకట్టుకోడంతో పాటు..ఐపీఎల్ వేలం జాబితా వరకూ రాగలిగాడు. కుదురైన మీడియం పేస్ బౌలర్ గా సకీబ్ గుర్తింపు సంపాదించాడు.

జార్ఖండ్ కు చెందిన 18 సంవత్సరాల బ్యాటింగ్ సంచలనం కుమార్ కుశాగ్రా కు సైతం వేలం జాబితాలో చోటు దక్కింది. కేవలం 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లోనే 250కి పైగా స్కోరుతో 439 పరుగులు సాధించాడు. 62.71 సగటుతో వారేవ్వా అనిపించుకొన్నాడు. వికెట్ కీపర్ గా కూడా అపారప్రతిభ కలిగిన కుశాగ్రా వైపు పలు ఫ్రాంచైజీలు చూస్తున్నాయి.

ఇక..ఆంధ్రా బ్యాటర్, జూనియర్ ప్రపంచకప్ హీరో షేక్ రషీద్ వయసు సైతం 18 సంవత్సరాలే. 2021 జూనియర్ ఆసియాకప్ లో భారత్ విజేతగా నిలవడంలో ప్రధానపాత్ర వహించిన రషీద్ గుంటూరు జిల్లా నుంచి అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగాడు.

బంగ్లాదేశ్ తో జరిగిన ఆసియాకప్ పోరులో రషీద్ 108 బంతులు ఎదుర్కొని 90 పరుగుల నాటౌట్ స్కోరుతో భారత్ ను విజేతగా నిలిపాడు. అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యం కలిగిన రషీద్ 20 లక్షల రూపాయల కనీస వేలం ధరతో ఐపీఎల్ వేలం జాబితాలో తొలిసారిగా చోటు సంపాదించాడు.

పై ఐదుగురు కుర్రాళ్లలో ఎవరికి జాక్ పాట్ దక్కుతుందో మరి.

First Published:  23 Dec 2022 9:30 AM IST
Next Story