Telugu Global
Sports

భారత పేసర్లు ముగ్గురూ ముగ్గురే!

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత ఫాస్ట్ బౌలర్ల త్రయం చెలరేగిపోతున్నారు. ప్రత్యర్ధిజట్ల గుండెల్లో గుబులు రేపుతూ ముగ్గురూ ముగ్గురే అనిపించుకొంటున్నారు...

భారత పేసర్లు ముగ్గురూ ముగ్గురే!
X

వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత ఫాస్ట్ బౌలర్ల త్రయం చెలరేగిపోతున్నారు. ప్రత్యర్ధిజట్ల గుండెల్లో గుబులు రేపుతూ ముగ్గురూ ముగ్గురే అనిపించుకొంటున్నారు...

ఐసీసీ వన్డే ప్రపంచకప్ తొలిదశ..10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ ఎనిమిది రౌండ్లలో ఎనిమిది విజయాలు సాధించడం వెనుక బ్యాటర్లు మాత్రమే కాదు...బౌలర్లు సైతం ఉన్నారు.

జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లతో కూడిన ముగ్గురు మొనగాళ్ల పేస్ ఎటాక్ కు..స్పిన్ జోడీ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ జత కావడంతో భారత్ ప్రత్యర్థిజట్ల బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలు చేయగలుగుతోంది.

ఆరుజట్లను ఆలౌట్ చేసిన భారత్....

ప్రపంచకప్ మొదటి ఎనిమిదిరౌండ్లలో ఆరు ప్రత్యర్థిజట్లను కుప్పకూల్చిన తొలిజట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. పవర్ ప్లే ఓవర్లలో పేస్ జోడీ మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రా గంటకు 140 కిలోమీటర్ల సగటు వేగంతో నిప్పులు చెరుగుతుంటే..మిడిల్, డెత్ ఓవర్లలో మహ్మద్ షమీ రివర్స్ స్వింగ్ తో చెలరేగిపోతున్నాడు.

చెన్నై చెపాక్ స్టేడియంలో ఆస్ట్ర్రేలియాను, ధర్మశాల స్టేడియంలో న్యూజిలాండ్ ను, ముంబై వాంఖడే స్టేడియంలో శ్రీలంకను, కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేయడంలో భారత బౌలర్ల పాత్ర అంతాఇంతా కాదు.

మహ్మద్ షమీ విశ్వరూపం....

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కేవలం 4 మ్యాచ్ ల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు 5 వికెట్ల చొప్పున సాధించాడు. రౌండ్ రాబిన్ లీగ్ లోని మొదటి నాలుగుమ్యాచ్ ల్లో బెంచ్ కే పరిమితమైన షమీ..న్యూజిలాండ్ తో మ్యాచ్ ద్వారా అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొన్నాడు.

ధర్మశాల, ముంబై వేదికలుగా జరిగిన మ్యాచ్ ల్లో షమీ ఐదేసి వికెట్ల ఘనత సంపాదించాడు.

ఓ బ్యాటర్ 100 పరుగులు సాధిస్తే ఎంత గౌరవమో..ఓ బౌలర్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టినా అంతే గొప్పగా పరిగణిస్తారు. శ్రీలంకపై షమీ సాధించిన 18 పరుగులకే 5 వికెట్ల రికార్డు అరుదైనది గా మిగిలిపోతుంది. అంతేకాదు ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా కూడా మహ్మద్ షమీ మరో రికార్డు నమోదు చేశాడు. జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్ ల పేరుతో ఉన్న 44 ప్రపంచకప్ వికెట్ల రికార్డును షమీ అధిగమించాడు. తాను వేసిన ప్రతి 9.4 బంతులకు ఓ వికెట్ చొప్పున పడగొడుతూ 6.71 సగటు నమోదు చేశాడు.

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం మహ్మద్ షమీ 10వ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.

యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా...

కొత్తబంతి, పాత బంతి అన్న తేడా లేకుండా మ్యాచ్ ఏ దశలోనైనా వికెట్లు తీయగల మొనగాడు జస్ ప్రీత్ బుమ్రా. భారత పేస్ ఎటాక్ కు వెన్నెముక లాంటి బుమ్రా గంటకు 145 కిలోమీటర్ల సగటు వేగానికి స్వింగ్ ను జోడించి పవర్ ప్లే, మిడిల్ ఓవర్లతో పాటు డెత్ ఓవర్లలో సైతం వికెట్లు పడగొట్టడంలో తనకు తానే సాటిగా నిలుస్తూ వస్తున్నాడు.

ఇప్పటి వరకూ ఆడిన 8 మ్యాచ్ ల్లో 10 వికెట్లు పడగొట్టడం ద్వారా బుమ్రా 8వ ర్యాంకర్ గా నిలిచాడు.

బౌలర్ నంబర్ వన్ మహ్మద్ సిరాజ్...

భారతజట్టులోని హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రపంచకప్ లో భారత్ విజయాలలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఆట మొదటి 10( పవర్ ప్లే ) ఓవర్లలో కీలక వికెట్లు పడగొడుతూ అత్యుత్తమంగా రాణిస్తున్నాడు.

లీగ్ దశలో ఇప్పటి వరకూ ఆడిన 8 మ్యాచ్ ల్లో సిరాజ్ మొత్తం 10 వికెట్లు పడగొట్టి 5.23 ఎకానమీ సాధించాడు. ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్ లో నిలిచాడు.

బుమ్రా, షమీలతో కలసి సమన్వయంతో బౌలింగ్ చేస్తూ సిరాజ్ దూసుకుపోతున్నాడు. కొత్తబంతితో, షార్ట్ పిచ్ బౌలింగ్ తో వికెట్లు పడగొట్టడంలో సిరాజ్ తనకు తానే సాటిగా నిలుస్తూ వస్తున్నాడు.

స్పిన్ జోడీ తక్కువేం కాదు...

ముగ్గురు పేసర్లు మాత్రమే కాదు...మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిజట్లకు పగ్గాలు వేయడంతో పాటు కీలక వికెట్లు పడగొట్టడంలో స్పిన్ జోడీ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సైతం తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు.

ఎడమచేతివాటం చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మణికట్టుతో స్పిన్ మాయ చేస్తూ ప్రత్యర్థిజట్ల కీలక బ్యాటర్లకు చెక్ చెబుతున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి మ్యాజిక్ బంతులతో వికెట్లు పడగొడుతూ జట్టుకు తురుపుముక్కగా మారాడు. ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్ లో 4వ స్థానం సంపాదించాడు.

మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా 8 మ్యాచ్ ల్లో 14 వికెట్లతో మూడో అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా 5 వికెట్లు పడగొట్టడం తో పాటు 3.76 ఎకానమీ నమోదు చేశాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎనిమిది స్థానాలు మెరుగు పరచుకొని 19వ ర్యాంక్ కు చేరాడు.

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు మాత్రం స్థాయికి తగ్గట్టుగా అవకాశాలు లభించడంలేదు. చెన్నై వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన ప్రారంభమ్యాచ్ లో అశ్విన్ ప్రతిభావంతంగా బౌల్ చేయగలిగాడు.

పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ సైతం బ్యాకప్ ఆల్ రౌండర్ గా బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తోంది.

First Published:  9 Nov 2023 7:43 AM IST
Next Story