Telugu Global
Sports

ప్రపంచ బాక్సింగ్ ఫైనల్లో నలుగురు భారత బాక్సర్లు!

2023 మహిళా ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్ కు నలుగురు భారత బాక్సర్లు అర్హత సాధించడం ద్వారా నాలుగు పతకాలు ఖాయం చేశారు.

ప్రపంచ బాక్సింగ్ ఫైనల్లో నలుగురు భారత బాక్సర్లు!
X

2023 మహిళా ప్రపంచ బాక్సింగ్ ఫైనల్స్ కు నలుగురు భారత బాక్సర్లు అర్హత సాధించడం ద్వారా నాలుగు పతకాలు ఖాయం చేశారు....

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 2023 ప్రపంచ మహిళా బాక్సింగ్ సమరంలో ఆతిథ్య భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఏకంగా నాలుగు విభాగాల ఫైనల్స్ కు భారత బాక్సర్లు అర్హత సాధించడం ద్వారా ..కనీసం నాలుగు రజత పతకాలు ఖాయం చేశారు.

నిఖత్, నీతూ అలవోక విజయాలు..

మహిళల 50 కిలోల విభాగంలో తెలంగాణా బాక్సర్ నిఖత్ జరీన్, 75 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గోహెయిన్, 48 కిలోల విభాగంలో నీతూ గణేశ్, 81 కిలోల విభాగంలో స్వీటీ బూరా సెమీఫైనల్స్ విజయాలతో టైటిల్ రౌండ్లో అడుగుపెట్టారు.

50కిలోల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ గా ఉన్న స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లో కొలంబియాకు చెందిన ఇంగ్రిడ్ వలెన్షియాను చిత్తు చేయడం ద్వారా వరుసగా రెండోసారి ఫైనల్స్ లో అడుగుపెట్టింది.

తన కంటే అనుభవజ్ఞురాలైన కొలంబియా బాక్సర్‌పై నిఖత్‌ ఫైట్ ప్రారంభం నుంచే పంచ్ లు విసురుతూ ఎదురుదాడికి దిగడం ద్వారా పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. .ఏ మాత్రం అలసట దరిచేరనీయకుండా ప్రత్యర్థి బలం, బలహీనతలను అంచనా వేస్తూ నిఖత్‌ సంధించిన పంచ్‌లకు బదులే లేకపోయింది.

భారత ఆల్ టైమ్ గ్రేట్ బాక్సర్ మేరీకోమ్‌ను ఓడించడం ద్వారా రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన వాలెన్సియాకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా తొలి రెండు రౌండ్లలోనే నిఖత్‌ కీలక పాయింట్లు సంపాదించింది.

మొదటి రెండురౌండ్లలో పూర్తిగా వెనుకబడిన కొలంబియా బాక్సర్‌ ఆ తర్వాతి రౌండ్లలో పుంజుకోడానికి చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. నిఖత్ ప్రత్యర్థి పంచ్ ల నుంచి తనను తాను కాపాడుకొంటూనే అదను చూసి ఎదురుదాడికి దిగడం ద్వారా విజయం అందుకొంది.

టైటిల్ సమరంలో రెండుసార్లు విన్నర్ , వియత్నాం బాక్సర్ న్యుయెన్‌ థీ తామ్‌ (వియత్నాం)తో నిఖత్‌ అమీతుమీ తేల్చుకోనుంది.

గతేడాది టర్కీలోని ఇస్తాంబుల్‌ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ 52కిలోల విభాగంలో నిఖత్ తొలిసారిగా ప్రపంచ స్వర్ణం అందుకొంది. ప్రస్తుత టోర్నీలో సైతం టైటిల్ నిలుపుకోవాలన్న పట్టుదలతో నిఖత్ ఫైనల్స్ కు సిద్ధమవుతోంది.

48 కిలోల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ నీతూ ప్రత్యర్థి, కజకిస్థాన్ బాక్సర్ అలువా బాల్కిబెకోవాను అధిగమించగలిగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నీతు వెంట్రుక వాసిలో విజేతగా నిలిచింది.

గోల్డ్ మెడల్ సమరంలో మంగోలియాకు చెందిన ఆసియా చాంపియన్ లుత్సాయి ఖాన్ అల్ టాంట్ టెట్ సెగ్ తో నీతు తలపడనుంది.

చైనా బాక్సర్ కు లవ్లీనా పంచ్....

75కిలోల విభాగంలో చైనా బాక్సర్ లీ కియాన్ ను లవ్లీనా ఓడించింది. ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పోరాడినా...చివరకు పాయింట్ల తేడాతో లవ్లీనానే విజయం వరించింది. 4-1 తేడాతో నెగ్గడం ద్వారా లవ్లీనా తన కెరియర్ లో తొలిసారిగా ప్రపంచ ఫైనల్స్ కు అర్హత సంపాదించగలిగింది.

81 కిలోల విభాగంలో సైతం భారత ఆధిపత్యమే కొనసాగింది. సెమీస్ సమరంలో ఆస్ట్ర్ర్రేలియా బాక్సర్ ఎమ్మా గ్రీన్ ట్రీని స్వీటీ బూరా అధిగమించింది.

ఈ ఇద్దరి పోరు సైతం తొలిరౌండ్ నుంచి పట్టుగా సాగింది. చివరకు లవ్లీనా పాయింట్ల తేడాతో విజయంతో పాటు ఫైనల్లో చోటును ఖాయం చేసుకోగలిగింది.

4-3తో విజేతగా నిలవడం ద్వారా లవ్లీనా తొలిసారిగా ప్రపంచ టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది.

బంగారు పతకం కోసం జరిగే పోరులో ఆస్ట్ర్రేలియాకు చెందిన సియాట్ లిన్ పార్క్ తో లవ్లీనా తలపడనుంది. గత రెండు ప్రపంచకప్ టోర్నీలలో కాంస్యపతకాలతో సరిపెట్టుకొన్న లవ్లీనా ప్రస్తుత టోర్నీ ఫైనల్స్ చేరడం ద్వారా రజత పతకం ఖాయం చేసుకొంది. ఒక వేళ ఫైనల్లో నెగ్గితే విశ్వవిజేత కాగలుగుతుంది.

శని, ఆది వారాల్లో ఫైనల్స్ నిర్వహిస్తారు.

భారత బాక్సింగ్ సమాఖ్య ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

First Published:  24 March 2023 1:30 PM IST
Next Story