Telugu Global
Sports

వరల్డ్ కప్ ముంగిట.. భయపెడుతున్న కీలక ఆటగాళ్ల గాయాలు

ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక వంటి ఉపఖండపు జట్లే కాకుండా.. న్యూజీలాండ్ వంటి జట్టులో కూడా కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు.

వరల్డ్ కప్ ముంగిట.. భయపెడుతున్న కీలక ఆటగాళ్ల గాయాలు
X

ఇండియా వేదికగా కీలకమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నది. ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు వరల్డ్ కప్‌లో ఆడే జట్లను ప్రకటించాయి. అయితే, జట్లను ప్రకటించిన తర్వాత కొంత మంది కీలక ఆటగాళ్లు గాయపడటం ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్స్‌ను భయపెడుతున్నది. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక వంటి ఉపఖండపు జట్లే కాకుండా.. న్యూజీలాండ్ వంటి జట్టులో కూడా కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. దీంతో వీళ్లు వరల్డ్ కప్ లోపు కోలుకుంటారా లేదా అని ఆయా క్రికెట్ బోర్డులు ఆందోళన చెందుతున్నాయి. ఒక వేళ ఈ ఆటగాళ్లు గాయంతో ఆడలేకపోతే ఐసీసీ అనుమతితో వేరే ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఏయే ఆటగాళ్లు గాయాలతో ఫిట్‌గా లేరు..

అక్షర్ పటేల్ :

భారత స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ఆసియా కప్ సూపర్ 4 దశలో మ్యాచ్ ఆడుతుండగా ఎడమ తొడ కండరాలు పట్టేశాయి. పరీక్షలు చేయగా అతడికి కండరాల గాయం ఏర్పడినట్లు తేల్చారు. దీంతో ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్నాడు. గాయం కారణంగానే ఆసీస్‌తో జరుగనున్న తొలి రెండు వన్డేలకు అతడిని జట్టు నుంచి తప్పించారు. గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే తప్ప అక్షర్ వరల్డ్ కప్ ఆడటం అనుమానమే.

శ్రేయస్ అయ్యర్:

శ్రేయస్ అయ్యర్ వరుసగా గాయాల పాలవుతూనే ఉన్నాడు. గాయం నుంచి కోలుకొని ఆసియా కప్‌లో పునరాగమనం చేశాడు. అయితే అప్పుడే శ్రేయస్ మరోసారి గాయపడ్డాడు. ఒక మ్యాచ్ ఆడితే నాలుగు మ్యాచ్‌ల పాటు దూరంగా ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతానికి ఫిట్‌గా ఉన్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ చెబుతున్నా.. ఎప్పుడు గాయం తిరగబెడుతుందో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ట్రావిస్ హెడ్:

ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్.. దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడ్డాడు. అతడి ఎడమ చేయికి ఫ్రాక్చర్ కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ట్రావిస్ హెడ్ గాయపడటంతో ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురు దెబ్బే అనుకోవచ్చు. వరల్డ్ కప్ లోపు అతడు గాయం నుంచి కోలుకుంటాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. లేకపోతే అతడి స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకుంటారు.

దుష్మంత చమీర :

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీర భుజం గాయంతో బాధపడుతున్నాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడే సమయంలో అతడి భుజానికి గాయమైంది. దీంతో ఆసియా కప్ నుంచి కూడా వైదొలిగాడు. అయితే వరల్డ్ కప్ జట్టులో దుష్మంత ఉంటాడా లేదా అనే విషయంపై సందిగ్దత నెలకొన్నది.

వానిందు హసరంగ :

లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడే సమయంలోనే మరో శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగ గాయపడ్డాడు. దీంతో అతడు ఆసియా కప్‌కు కూడా పూర్తిగా దూరమయ్యాడు. భారత పిచ్‌లపై మంచి అవగాహన ఉన్న హసరంగ జట్టుకు దూరమైతే శ్రీలంక భారీ మూల్యమే చెల్లించుకోవలని వస్తుంది.

మహీష తీక్షణ :

ఆసియా కప్ సూపర్ 4లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీష తీక్షణ హామ్‌స్ట్రింగ్ ఇంజ్యురీతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడు ఇండియాతో జరిగిన ఫైనల్ ఆడలేదు. ఇప్పుడు అతడు కోలుకుంటే తప్ప వరల్డ్ కప్ జట్టులో కొనసాగలేడని మేనేజ్‌మెంట్ చెప్పింది.

ఎన్రిక్ నోకియా :

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నోకియా లోయర్ బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నాడు. అతడి వెన్నెముక పట్టేయడంతో చికిత్స తీసుకున్నా.. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. ఇండియాలోని పిచ్‌లపై నోకియాకు మంచి రికార్డు ఉన్నది. దీంతో అతడు జట్టుకు దూరం కావడం పెద్ద సెట్ బ్యాక్‌గా చెప్పవచ్చు.

నసీమ్ షా:

పాకిస్తాన్ సంచలన పేసర్ నసీమ్ షా.. ఇండియాతో ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఎప్పుడు కోలుకుంటాడనే విషయం జట్టు మేనేజ్‌మెంట్ చెప్పడం లేదు. ఇటీవల వన్డేల్లో మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉన్న నసీమ్ షా.. జట్టుకు దూరమవడం పాకిస్తాన్‌ను ఆందోళనలో పడేసింది. వరల్డ్ కప్ జట్టులో ఉంటాడా లేదా అనే సస్పెన్స్ మరి కొన్ని రోజులు కొనసాగనున్నది.

హారిస్ రవూఫ్:

పాకిస్తాన్ జట్టు మరో పేసర్ హారిస్ రవూఫ్ కూడా భారత్‌తో ఆసియా కప్‌లో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. రవూఫ్ కూడా వరల్డ్ కప్ ఆడటం కష్టమే అని తెలుస్తున్నది.

టిమ్ సౌథీ:

న్యూజీలాండ్ జట్టులో అత్యంత అనుభవం, భారత పిచ్‌లపై మంచి రికార్డు కలిగిన టిమ్ సౌథీ గాయంతో కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడి బొటని వేలు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో సౌథీ వరల్డ్ కప్ ఆడటంపై సందేహం నెలకొన్నది. సాధ్యమైనంత తర్వగా కోలుకొని జట్టుతో చేరతాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

First Published:  19 Sept 2023 10:09 AM GMT
Next Story