భారతజట్టులో ఆంధ్రా వికెట్ కీపర్ కు చోటు!
ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ శ్రీకర్ భరత్ ను ఎట్టకేలకు అదృష్టం వరించింది. ప్రధాన వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయం భరత్ పాలిట వరంగా మారింది.
ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ శ్రీకర్ భరత్ ను ఎట్టకేలకు అదృష్టం వరించింది. ప్రధాన వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయం భరత్ పాలిట వరంగా మారింది.
ఏకంగా భారత టెస్టు, వన్డేజట్లలో చోటు దక్కింది.....
భారత క్రికెట్లో ఆటగాళ్ల ఎంపిక ఇప్పుడు మలుపులు తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగుతోంది. అదృష్టం ఎప్పుడు , ఎవరి తలుపు తడుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
భారత నంబర్ వన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకు దూరం కావడంతో..వికెట్ కీపర్ స్థానం కోసం మూడు ఫార్మాట్లలోనూ గట్టిపోటీ నెలకొని ఉంది.
భరత్ కు డబుల్ ధమాకా!
ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఆస్ట్ర్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి జరుగనున్న నాలుగుమ్యాచ్ ల కీలక టెస్టు సిరీస్ లో పాల్గొనే మొదటి రెండుటెస్టులకు బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించిన జట్టులో ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్సమన్ శ్రీకర్ భరత్ కు చోటు దక్కింది.
అయితే.. తుదిజట్టులో చోటు కోసం వైట్ బాల్ స్పెషలిస్ట్ ఇషాన్ కిషన్ తో పోటీపడాల్సి ఉంది. గత కొద్ది నెలలుగా టెస్ట్ ఫార్మాట్లో భారత రెండో వికెట్ కీపర్ గా భరత్ వ్యవహరిస్తున్నాడు.
ఆస్ట్ర్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ లో పాల్గొనే భారత తుదిజట్టులో ఛాన్స్ దొరికితే..ఎమ్మెస్కే ప్రసాద్ తర్వాత భారత వికెట్ కీపర్ గా వ్యవహరించిన అరుదైన ఘనతను భరత్ దక్కించుకోగలుగుతాడు.
వన్డే జట్టులోనూ భరత్ కు చోటు...
వన్డే క్రికెట్లో వికెట్ కీపర్ బ్యాటర్ గా సేవలు అందిస్తున్న కెఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాలతో న్యూజిలాండ్ తో సిరీస్ కు దూరం కావడంతో..అతని స్థానంలో భరత్ కు ఎంపిక సంఘం చోటు కల్పించింది.
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు జనవరి 18 నుంచి 24 వరకూ హైదరాబాద్, రాయపూర్, ఇండోర్ వేదికలుగా జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.
బంగ్లాదేశ్ తో వన్డేలో డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ ప్రధాన వికెట్ కీపర్ గాను, భరత్ రెండో వికెట్ కీపర్ గాను భారతజట్టులో చోటు సంపాదించారు. ఇటు టెస్టు..అటు వన్డే జట్లలో చోటు సంపాదించినా భరత్ కు కనీసం ఒక్కఫార్మాట్లో అవకాశం దొరికినా..అది ఆంధ్రా క్రికెట్ కు ఓ ఘనతగానే మిగిలిపోతుంది.