Telugu Global
Sports

ప్రపంచ టెస్టులీగ్ ఫైనల్లో భారత్ కు ఫాలోఆన్ ముప్పు!

2023 ఐసీసీ ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ ఎదురీదుతోంది. టాపార్డర్ వైఫల్యంతో భారత్ కు ఫాలోఆన్ ముప్పు పొంచి ఉంది....

ప్రపంచ టెస్టులీగ్ ఫైనల్లో భారత్ కు ఫాలోఆన్ ముప్పు!
X

2023 ఐసీసీ ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ ఎదురీదుతోంది. టాపార్డర్ వైఫల్యంతో భారత్ కు ఫాలోఆన్ ముప్పు పొంచి ఉంది....

ఐసీసీ టెస్టులీగ్ ఫైనల్ రెండోరోజుఆటలో సైతం భారత్ దారుణంగా విఫలమయ్యింది. తొలిరోజు ఆటలో బౌలర్లు విఫలమైతే..రెండోరోజుఆటలో భారత బ్యాటింగ్ ఆర్డర్లోని టాపార్డర్చే తులెత్తేసింది.

ఆస్ట్ర్రేలియా తొలిఇన్నింగ్స్ భారీస్కోరు 469 పరుగులకు సమాధానంగా భారత్ తన తొలిఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 151 పరుగుల స్కోరుతో పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది. కంగారూల కంటే 318 పరుగులతో వెనుకబడి ఉంది. ఫాలోఆన్ గండం నుంచి బయటపడాలంటే మూడోరోజుఆటలో మరో 118 పరుగులు చేయాల్సి ఉంది. మరో ఐదు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 327/3తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 469 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది. ట్రావిస్‌ హెడ్‌ (174 బంతుల్లో 163; 25 ఫోర్లు, ఒక సిక్సర్‌) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ (121; 19 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్‌ కేరీ (48; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) విలువైన పరుగులు తనజట్టుకు అందించాడు.

భారత బౌలర్లలో సిరాజ్‌ 4, షమీ, శార్దూల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. నాలుగు వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్టు క్రికెట్లో సిరాజ్ 50 వికెట్ల మైలురాయిని చేరుకోగలిగాడు.

రవీంద్ర జడేజా ఎదురుదాడి..

రెండోరోజుఆటలో ఆస్ట్ర్రేలియాను 469 పరుగులకు పరిమితం చేసి...తన బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్ వెంట వెంటనే వికెట్లు నష్టపోతూ తేరుకోలేకపోయింది.

ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ- శుభ మన్ గిల్ మొదటి వికెట్ కు 30 పరుగులు మాత్రమే చేర్చి ఒకరి తరువాత ఒకరుగా వెనుదిరిగారు.

కంగారూ ఫాస్ట్ బౌలర్లు చక్కడి లైన్ అండ్ లెంత్ తో ఆఫ్ స్టంప్ నే లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేస్తూ..భారత టాపార్డర్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 26 బంతుల్లో 2 బౌండ్రీలతో 15 పరుగులకు కమిన్స్ బౌలింగ్ లో ఎల్బీగా అవుట్ కావడంతో భారత్ పతనం ప్రారంభమయ్యింది.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో పరుగులు మోత మోగించిన యువఓపెనర్ శుభ మన్ గిల్ 15 బంతుల్లో 2 బౌండ్రీలతో 13 పరుగుల స్కోరుకే చిక్కాడు. బోలాండ్ బౌలింగ్ లో..ఆఫ్ స్టంప్ మీదకు వచ్చిన బంతిని పొరపాటుగా అంచనావేసి బౌల్డయ్యాడు.

వన్ డౌన్ చతేశ్వర్ పూజారా సైతం 14 పరుగుల స్కోరుకే..మీడియం పేసర్ కమెరాన్ గ్రీన్ బౌలింగ్ లో అవుట్ కాగా...పరుగుల యంత్రం విరాట్ కొహ్లీని లెఫ్టామ్ ఫాస్ట్ బౌలర్ స్టార్క్ పడగొట్టాడు.స్టీవ్ స్మిత్ పట్టిన సూపర్ క్యాచ్ కు 14 పరుగుల స్కోరుతో ఉన్న విరాట్ వెనుదిరిగాడు.

అత్యధిక పరుగుల రికార్డు నిలబెట్టుకొన్న విరాట్..

టెస్టు చాంపియ‌న్‌షిప్‌ లీగ్ లో అత్యధిక పరుగుల భారత బ్యాటర్ గా విరాట్ త‌న రికార్డు నిల‌బెట్టుకున్నాడు. ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాడిగా విరాట్ నిలిచాడు. ప్ర‌స్తుతం విరాట్ 1,817 పరుగులతో ఉన్నాడు.అంతకుముందు.. కొహ్లీ పేరుతో ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ అధిగ‌మించాడు. కొహ్లీ పేరుతో ఉన్న 1803 పరుగుల రికార్డును రోహిత్ 1,809 ప‌రుగుల‌తో అధిగమించాడు. అయితే..ఆ రికార్డు తాత్కాలికమే అయ్యింది.

విరాట్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడం ద్వారా 1,817 పరుగులతో రోహిత్ ను మరోసారి అధిగమించగలిగాడు. భారత టాపార్డర్ లోని నలుగురు బ్యాటర్లు 15, 13, 14, 14 స్కోర్లకే అవుట్ కావడం విశేషం.

71 పరుగులకే నాలుగు టాపార్డర్ వికెట్లు నష్టపోయిన భారత్ ను ఆదుకొనే భారం మిడిలార్డర్ బ్యాటర్లు రహానే- జడేజాల పైన పడింది.

జడేజా, రహానే కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేయడంతో వికెట్ల పతనానికి తాత్కాలికంగా అడ్డుకట్ట వేయగలిగారు.

ఒక ఎండ్‌లో రహానే క్రీజులో పాతుకుపోయి ఆడుతుంటే.... మరో ఎండ్‌ నుంచి జడేజా దూకుడుగా ఆడుతూ ఎదురుదాడి మొదలు పెట్టాడు. జడ్డూ.. ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో టీమ్‌ఇండియా 142/4తో కోలుకున్నట్లే కనిపించినా..కీలక దశలో 5వ వికెట్ కోల్పోయింది.

రెండో రోజు ఆట ముగియటానికి సమయం దగ్గర పడిన తరుణంలో ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ బౌలింగ్ లో జడేజా దొరికిపోయాడు. కేవలం 51 బంతుల్లోనే 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 48 పరుగుల స్కోరుకు జడేజా అవుటయ్యాడు.

అజింక్యా రహానే పైనే ఇక భారం...

ఆట ముగిసే క్షణాలలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ భరత్ తో కలసి రహానే మరో వికెట్‌ పడకుండా రెండోరోజు ఆటను ముగించగలిగాడు. ఈ మ్యాచ్‌లో

భారత్ భారమంతా రహానేతో పాటు మిడిలార్డర్ పైనే పడింది.

అజింక్యా రహానే 4 బౌండ్రీలతో 29 పరుగుల స్కోరుతోను, భరత్ 5 పరుగుల నాటౌట్ స్కోరుతోనూ క్రీజులో ఉన్నారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌, కమిన్స్‌, బోలాండ్‌, గ్రీన్‌, లియాన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

రహానే నిలదొక్కుకొని బ్యాటింగ్ కొనసాగించగలిగితే..మిగిలిన బ్యాటర్లు అండగా నిలువగలిగితే భారత్ 269 పరుగుల ఫాలోఆన్ లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది.

ఫాలోఆన్ ముప్పు నుంచి భారత్ తప్పించుకోగలిగితే..టెస్టును సగం కాపాడుకొన్నట్లే అవుతుంది. ఈరోజు జరిగే మూడోరోజుఆటలోనే టెస్టు మ్యాచ్ తుదిఫలితం తేలిపోనుంది.

First Published:  9 Jun 2023 5:08 AM GMT
Next Story