Telugu Global
Sports

మూడు మ్యాచ్‌లు.. స్టార్‌కు రూ. 500 కోట్ల వ్యాపారం

ఇండియా, పాకిస్తాన్ సెమీస్‌కు చేరుకోవడంతో స్టార్ స్పోర్ట్స్ ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ పెంచింది. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ సహా అన్నింటికీ స్పాట్స్ అమ్మేసింది.

మూడు మ్యాచ్‌లు.. స్టార్‌కు రూ. 500 కోట్ల వ్యాపారం
X

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022ను ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న స్టార్ స్పోర్ట్స్‌కు కాసుల వర్షం కురుస్తోంది. క్రికెట్‌ను అమితంగా ప్రేమించే ఇండియా, పాకిస్తాన్ జట్లు సెమీస్‌కు చేరుకోవడంతో ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ పెరిగింది. ఎవరూ ఊహించని రీతిలో ఈ సారి చిన్న జట్లు కూడా గట్టి పోటీ ఇవ్వడంతో బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియాకు భారీగా ఆదాయం పెరిగింది. నెదర్లాండ్స్, జింబాబ్వే వంటి జట్లు పెద్ద టీమ్స్‌ను ఓడించడంతో అందరూ మ్యాచ్‌లను ఆసక్తిగా చూస్తున్నారు. ఇండియా ఈ సారి మంచి ఊపు మీద ఉండటం, కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో భారత క్రికెట్ అభిమానులు కప్‌పై ఆశలు పెట్టుకున్నారు.

ఈ రోజు న్యూజీలాండ్-పాకిస్తాన్ మధ్య సెమీస్ జరుగుతోంది. రేపు ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరుగనున్నది. ఇండియా, పాకిస్తాన్ సెమీస్‌కు చేరుకోవడంతో స్టార్ స్పోర్ట్స్ ఒక్కసారిగా యాడ్ రెవెన్యూ పెంచింది. ఇప్పటికే ఫైనల్ మ్యాచ్ సహా అన్నింటికీ స్పాట్స్ అమ్మేసింది. ఈ మూడు మ్యాచ్‌లకు కలిపి దాదాపు రూ. 500 కోట్ల యాడ్స్ అమ్మేసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఐసీసీ ఈవెంట్స్‌కు స్టార్ గ్రూప్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా ఉన్నది. ఐపీఎల్ హక్కులను కోల్పోయిన తర్వాత స్టార్ గ్రూప్ ఐసీసీ ఈవెంట్స్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకున్నది. రెండు సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు కలిపి రూ. 820 కోట్లు రెవెన్యూ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నది. కానీ చివరకు రూ. 500 కోట్లను సాధించింది. ఒక వేళ ఇండియా-పాకిస్తాన్ కనుక ఫైనల్ చేరితే మరో రూ. 50 కోట్ల రెవెన్యూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం, కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే పోటీ పడుతుండటం స్టార్‌కు కలిసి వచ్చింది.

కేవలం శాటిలైట్ రైట్స్ మాత్రమే కాకుండా ఓటీటీ రైట్స్ కూడా స్టార్‌కు ఉండటం కలసి వస్తోంది. చివరి మూడు మ్యాచ్‌లకు గాను శాటిలైట్ రెవెన్యూ కంటే ఓటీటీ రెవెన్యూనే ఎక్కువగా ఉండటం గమనార్హం. టీవీ యాడ్స్ ద్వారా రూ. 240 కోట్లు వస్తుండగా.. ఓటీటీ ద్వారా రూ. 260 కోట్లు సాధిస్తుండటం మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

ఇక ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో స్టార్ 10 సెకెన్ల యాడ్‌ రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షలు వసూలు చేస్తోంది. ఇవి కేవలం సూపర్ 12 మ్యాచ్‌లకే మాత్రమే. అది కూడా ముందుగా బుక్ చేసుకున్న వారికి ఈ రేట్లను అమలు చేస్తోంది. అదే స్పాట్ బుకింగ్‌కి అయితే రూ. 25 లక్షలు వసూలు చేస్తున్నట్లు స్టార్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇండియా, పాకిస్తాన్ సెమీస్ చేరడంతో అన్ని స్లాట్స్ బుక్ అయ్యాయని.. ఫైనల్ చేరితే రేట్లు మరింతగా పెంచేందుకు స్టార్ రంగం సిద్దం చేసిందని తెలుస్తోంది.

First Published:  9 Nov 2022 8:34 AM GMT
Next Story