Telugu Global
Sports

ఇన్ స్టా పోస్టుకు 90కోట్లు..దటీజ్ లయనల్ మెస్సీ!

ఇన్ స్టా గ్రామ్ లో ఒక్కోబ్రాండెడ్ పోస్టింగ్ కు 90 కోట్ల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు.

ఇన్ స్టా పోస్టుకు 90కోట్లు..దటీజ్ లయనల్ మెస్సీ!
X

అర్జెంటీనా కెప్టెన్, ప్రపంచకప్ హీరో లయనల్ మెస్సీ సాకర్ ఆటతో మాత్రమే కాదు..సోషల్ మీడియా ద్వారాను కళ్లు చెదిరే మొత్తం ఆర్జిస్తున్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో ఒక్కోబ్రాండెడ్ పోస్టింగ్ కు 90 కోట్ల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు....

క్రీడలు ఏవైనా..జనసంమోహక క్రీడాకారులకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉండటం సాధారణ విషయమే. అయితే.. జయాపజయాలతో సంబంధం లేకుండా తమను గుడ్డిగా ఆరాధించి, అభిమానించే ఫ్యాన్స్ అభిమానాన్ని సైతం సొమ్ము చేసుకోడంలో అర్జెంటీనా సాకర్ కెప్టెన్, ప్రపంచకప్ ఫుట్ బాల్ హీరో లయనల్ మెస్సీ తర్వాతే ఎవరైనా.

ఇన్ స్టా గ్రామ్ ద్వారా డబ్బే డబ్బు!

ఖతర్ వేదికగా ఇటీవలే ముగిసిన 2022 ఫిఫా ప్రపంచకప్ పుట్ బాల్ టోర్నీలో కెప్టెన్ గా అర్జెంటీనాకు ట్రోఫీ అందించడంతో మెస్సీ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది.

సోషల్ మీడియా ద్వారా మెస్సీని అనుసరించే అభిమానుల సంఖ్య సైతం రాత్రికి రాత్రే పెరిగిపోయింది.

ఇప్పటి వరకూ సోషల్ మీడియా రారాజుగా వెలుగొందుతూ వచ్చిన పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డోను ప్రపంచకప్ విజయం ద్వారా మెస్సీ అధిగమించాడు. ఇన్ స్టా గ్రామ్ ద్వారా మెస్సీని అనుసరించేవారి సంఖ్య ఒక్కసారిగా 4కోట్లకు పెరిగిపోయింది.

గతంలో టీవీలు, ఆన్ లైన్ ద్వారా తనను అనుసరించే అభిమానులను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకొన్న రొనాల్డో ను మెస్సీ ప్రస్తుత ప్రపంచకప్ సక్సెస్ తో మించిపోయాడు.

ఇన్ స్టాగ్రామ్ ద్వారా మెస్సీ ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్లు దాటిపోయింది.

ప్రపంచకప్ ఫైనల్ సమయంలో మెస్సీ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఆదివారం ఒక్కరోజే మెస్సీని సరికొత్తగా అనుసరించేవారి సంఖ్య 50 లక్షల సంఖ్యను మించిపోయింది. గత 30 రోజులుగా మెస్సీని రోజుకు 2 కోట్ల మంది సోషల్ మీడియా ద్వారా అనుసరిస్తూ వస్తున్నారు.

పీఎస్జీ కాంట్రాక్టుతో మరింతగా...

యూరోపియన్ క్లబ్ లీగ్ లో 18 సీజన్లపాటు బార్సిలోనా క్లబ్ కు ఆడిన మెస్సీ పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ లో చేరడంతో సరికొత్తగా 2కోట్ల మంది ఫాలోవర్లు వచ్చి మెస్సీ పక్షాన చేరారు.

ప్రపంచకప్ విజయం అనంతరం మెస్సీ అందుకొన్న ఫిఫాకప్ తో ఓ ఫోటోను..వరల్డ్ చాంపియన్స్ అంటూ స్పానిష్ లో టాగ్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకొన్నాడు.

ఈ పోస్ట్ కు 48 మిలియన్ల లైక్స్ రావడం విశేషం. మొదటి 20 గంటల్లో 48 మిలియన్లుగా ఉన్న లైక్ ల సంఖ్య ఆ తర్వాత మరింతగా పెరిగిపోయింది. 2019 లో ఎగ్ పేరుతో షేర్ చేసిన ఓ ఫోటోకు 56 మిలియన్ల లైక్ లు వచ్చాయి.

లూయి వ్యూటన్ బ్రాండ్ ప్రచారం కోసం మెస్సీ- రొనాల్డో కలసి చెస్ ఆడుతూ గత నెలలో పంచిన చిత్రానికి సైతం విపరీతమైన లైక్ లు వచ్చాయి. ఈ చిత్రాన్ని రొనాల్డో షేర్ చేస్తే 42 మిలియన్ లైక్ లు రాగా..మెస్సీ షేర్ చేసిన సమయంలో 32 మిలియన్ లైక్ లు మాత్రమే రావడం విశేషం.

కోట్ల రూపాయలుగా మారుతున్న అభిమానం...

క్రీడారంగంలో ఎండార్స్ మెంట్ల ద్వారా అత్యధికంగా 127 మిలియన్ డాలర్లను లెబ్రాన్ జేమ్స్ ఆర్జిస్తుండగా..లయనల్ మెస్సీ 122 మిలియన్ డాలర్ల తో ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.

ప్రస్తుతం అడిడాస్,బుడ్ వీజెర్, మాస్టర్ కార్డ్, పెప్సీకో, సోషియాలకు ప్రచారకర్తగా మెస్సీ వ్యవహరిస్తున్నాడు. ఫుట్ బాల్ స్టార్ గా వందలకోట్ల రూపాయల వార్షిక కాంట్రాక్టుతో పాటు..సోషల్ మీడియా ద్వారా రెండు చేతులా ఆర్జిస్తూ వేలకోట్ల రూపాయల సంపదను కూడగట్టుకోగలుగుతున్నాడు.

ఇన్ స్టా గ్రామ్ లో ఒక్కో బ్రాండెడ్ పోస్టింగ్ ఉంచినందుకు లయనల్ మెస్సీ మన రూపాయలలో అక్షరాల 90 కోట్లు చార్జి చేస్తున్నాడు. తనపట్ల ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది చూపుతున్న అభిమానాన్ని కోట్ల రూపాయలుగా మార్చుకోగలుగుతున్నాడు.

16 సంవత్సరాల చిరుప్రాయంలో తన తొలి ప్రపంచకప్ ఆడిన మెస్సీ 35 సంవత్సరాల వయసులో ఐదో ప్రపంచకప్ ఆడుతూ..ఆఖరి ప్రయత్నంలో ఫిపా ప్రపంచకప్ ను అందుకోగలిగాడు.

రెండుసార్లు గోల్డెన్ బాల్ అవార్డుతో పాటు...ఏడుసార్లు బాలన్ డి వోర్ అవార్డు విన్నర్ గా నిలిచిన మెస్సీ కేవలం వివిధ గ్లోబల్ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఏడాదికి 50 మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నాడు.

First Published:  8 Jan 2023 11:41 AM IST
Next Story