Telugu Global
Sports

మూడునెలల్లో 6 సెంచరీలు, శుభ్ మన్ గిల్ అరుదైన రికార్డు!

భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. గత మూడుమాసాల కాలంలో క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి ఆరు సెంచరీలు సాధించాడు.

6 centuries in three months, Shubman Gills rare record
X

శుభ్ మన్ గిల్

భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. గత మూడుమాసాల కాలంలో క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి ఆరు సెంచరీలు సాధించాడు...

అంతర్జాతీయ క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ భారత యువఓపెనర్ శుభ్ మన్ గిల్ పరుగుల హోరు, సెంచరీల జోరు అప్రతి హతంగా కొనసాగుతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ఆఖరిటెస్టు మూడోరోజుఆటలో శుభ్ మన్ గిల్ స్ట్ర్రోక్ ఫుల్ సెంచరీ సాధించడం ద్వారా 2023 సీజన్ మొదటి మూడుమాసాలలో ఆరు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

15వ టెస్టులో రెండో శతకం...

2020 సీజన్లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా టెస్టు అరంగేట్రం చేసిన శుభ్ మన్ గిల్..2023 బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సైతం ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగానే సూపర్ సెంచరీ సాధించాడు. 23 సంవత్సరాల శుభ్ మన్ గిల్ తన 15వ టెస్టులో కానీ రెండో శతకం సాధించలేకపోయాడు.

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సహ ఓపెనర్ రోహిత్ శర్మ, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా, రెండోడౌన్ విరాట్ కొహ్లీలతో కలసి మొదటి మూడు వికెట్లకు కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన గిల్ మొత్తం 235 బంతులు ఎదుర్కొని 12 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో తన రెండో టెస్ట్ సెంచరీని సాధించగలిగాడు.

ప్రస్తుత 2023 సీజన్ లో బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా తన తొలిటెస్ట్ శతకం సాధించిన 23 సంవత్సరాల గిల్..వన్డేలలో ఓ డబుల్ సెంచరీతో సహా మూడు శతకాలు, టీ-20లో మరో శతకంతో సహా మొత్తం ఆరు సెంచరీలు తన ఖాతాలో వేసుకోడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకోగలిగాడు.

2021 న్యూజిలాండ్ టెస్టు సిరీస్ లో 52, 44 స్కోర్లు, ఇంగ్లండ్ తో సింగిల్ టెస్టు మ్యాచ్ లో 17 పరుగుల స్కోరుకే అవుటైన గిల్..శతకాల కోసం మాత్రం ఓపికగా నిరీక్షించాల్సి వచ్చింది.

ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో క్రికెట్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా, క్రికెట్ చరిత్రలోనే 10వ ఆటగాడిగా శుభ్‌మన్‌ గిల్‌ రికార్డుల్లోకెక్కాడు. గతంలో భారత్ తరపున సురేశ్‌ రైనా, కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ ఈ ఫీట్‌ సాధించిన క్రికెటర్లలో ఉన్నారు.

First Published:  12 March 2023 10:47 AM IST
Next Story