విశ్వవిజేత నీరజ్ చోప్రాకు 58 లక్షల ప్రైజ్ మనీ!
భారత స్టార్ అథ్లెట్, జావలిన్ త్రో ప్రపంచ విజేత నీరజ్ చోప్రా బంగారు పతకంతో పాటు 58 లక్షల రూపాయల ప్రైజ్ మనీ సైతం అందుకొన్నాడు.
భారత స్టార్ అథ్లెట్, జావలిన్ త్రో ప్రపంచ విజేత నీరజ్ చోప్రా బంగారు పతకంతో పాటు 58 లక్షల రూపాయల ప్రైజ్ మనీ సైతం అందుకొన్నాడు.
అంతర్జాతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో గత మూడేళ్లుగా భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న జావలిన్ త్రో బాహుబలి నీరజ్ చోప్రాను అవార్డులు, రివార్డులు వెతుక్కొంటూ వస్తున్నాయి.
కేవలం 25 సంవత్సరాల వయసుకే జావలిన్ త్రోలోని అన్ని టైటిల్స్ నెగ్గిన నీరజ్ చోప్రా త్వరలో జరిగే హాంగ్జు ఆసియా క్రీడలు, 2024 పారిస్ ఒలింపిక్స్ బంగారు పతకాలకు సైతం గురిపెట్టాడు.
70వేల డాలర్ల నజరానా!
హంగెరీ రాజధాని బుడాపెస్ట్ వేదికగా ముగిసిన 2023 ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా తిరుగులేని విజేతగా బంగారు పతకం అందుకొన్నాడు.
గత ప్రపంచ పోటీలలో రజత పతకానికి మాత్రమే పరిమితమైన నీరజ్ ప్రస్తుత పోటీలలో నిలకడగా రాణించడం ద్వారా విజేతగా నిలిచాడు. క్వాలిఫైయింగ్ రౌండ్లో 88.77 మీటర్లు, గోల్డ్ మెడల్ రౌండ్లో 88.17 మీటర్ల రికార్డులు నమోదు చేశాడు.
ప్రపంచ టైటిల్, బంగారు పతకంతో పాటు నీరజ్ కు అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య 70 వేల డాలర్లు ( 58 లక్షల రూపాయలు ) నజరానాగా అందచేసింది.
రజత పతకం సాధించిన పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కు 35వేల డాలర్లు ( 29 లక్షల రూపాయలు ), కాంస్య విజేత జాకబ్ వాడ్లిచ్ కు 22వేల డాలర్లు ( 18 లక్షల రూపాయలు ) దక్కాయి.
జావలిన్ త్రో ఫైనల్స్ కు అర్హత సాధించిన మరో ఇద్దరు భారత అథ్లెట్లలో కిశోర్ జెనా 84.77 మీటర్ల రికార్డుతో 5వ స్థానం, డీపీ మను 84.14 మీటర్ల రికార్డుతో 6వ స్థానం సంపాదించారు.
ప్రపంచ అథ్లెటిక్స్ చరిత్రలోనే భారత్ కు చెందిన ముగ్గురు అథ్లెట్లు జావలిన్ త్రో ఫైనల్స్ కు అర్హత సాధించడంతో పాటు..బంగారు పతకం, 5,6 స్థానాలు దక్కించుకోడం ఇదే మొదటిసారి.
భారత క్రీడాచరిత్రలో అభినవ్ భింద్రా 23 సంవత్సరాల వయసుకే షూటింగ్ లో విశ్వవిజేతగా నిలిస్తే...నీరజ్ చోప్రా 25 ఏళ్ళ వయసులో అదే ఘనతను సొంతం చేసుకోగలిగాడు. అయితే..భారత అథ్లెటిక్స్ చరిత్రలో మాత్రం ప్రపంచ బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్ నీరజ్ మాత్రమే.
♦