5 మ్యాచ్ ల్లో 58 గోల్స్..ఆసియాక్రీడల హాకీలో భారత్ రికార్డు!
ఆసియాక్రీడల హాకీ పురుషుల గ్రూప్-ఏ లీగ్ లో భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. 5 మ్యాచ్ ల్లో 58 గోల్స్ సాధించడం ద్వారా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది.
ఆసియాక్రీడల హాకీ పురుషుల గ్రూప్-ఏ లీగ్ లో భారత్ అరుదైన రికార్డు నెలకొల్పింది. 5 మ్యాచ్ ల్లో 58 గోల్స్ సాధించడం ద్వారా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది.
19వ ఆసియాక్రీడల హాకీ పురుషుల విభాగంలో హాట్ ఫేవరెట్ భారత్ విజయపరంపర కొనసాగుతోంది. ఆరుజట్ల పూల్- ఏ లీగ్ లో భారత్ వరుసగా ఐదో విజయంతో టాపర్ గా సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.
హాంగ్జు గేమ్స్ స్టేడియం వేదికగా సోమవారం జరిగిన ఆఖరిరౌండ్ పోటీలో భారత్ 12-0 గోల్స్ తో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది.
12 గోల్స్ తో మూడో విజయం...
ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, జపాన్, సింగపూర్, బంగ్లాదేశ్ జట్లతో కూడిన పూల్ -ఏ లీగ్ లో భారతజట్టు మూడు మ్యాచ్ ల్లో 12 గోల్స్ చొప్పున, ఓ మ్యాచ్ లో 10 గోల్స్ సాధించడం విశేషం.
ఉజ్బెకిస్థాన్ తో జరిగిన తొలిరౌండ్ పోరులో 12-0తోనూ, రెండోరౌండ్లో సింగపూర్ ను 12-1తోనూ, మూడోరౌండ్లో జపాన్ ను 4-2తోనూ, నాలుగో రౌండ్లో పాకిస్థాన్ ను 10-2తోనూ ఓడించిన భారత్...ఆఖరిరౌండ్ పోటీలో బంగ్లాదేశ్ ను సైతం 12-0 గోల్స్ తో చిత్తు చేయడం ఓ అరుదైన ఘనతగా నిలిచిపోతుంది. ఆసియాక్రీడల హాకీ చరిత్రలో..కేవలం ఐదు లీగ్ మ్యాచ్ ల్లో 58 గోల్స్ సాధించిన తొలిజట్టుగా భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది.
హార్మన్ ప్రీత్ మరో హ్యాట్రిక్...
బంగ్లాదేశ్ తో ఏకపక్షంగా సాగిన పోరులో భారత్ ఆట మొదటి భాగంలో ఆరు, రెండో భాగంలో ఆరు గోల్స్ చొప్పున సాధించింది. ఇందులో 7 ఫీల్డ్ గోల్స్ కాగా...లభించిన 11 పెనాల్టీకార్నర్ల ద్వారా మరో 5 గోల్స్ నమోదు చేయగలిగింది.
భారత కెప్టెన్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ ఆట 2, 4, 32 నిముషాలలో గోల్స్ చేయడం ద్వారా ప్రస్తుత టోర్నీలో మరో హ్యాట్రిక్ నమోదు చేయగా..మాజీ కెప్టెన్ మన్ దీప్ సింగ్ ఆట 18, 24, 46 నిముషాలలో మూడు గోల్స్ తో రెండో హ్యాట్రిక్ సాధించాడు.
ఆట 23వ నిముషంలో లలిత్ ఉపాథ్యాయ, 28వ నిముషంలో అమిత్ రోహిదాస్, ఆట 41, 57 నిముషాలలో అభిషేక్ రెండుగోల్స్, ఆట 47వ నిముషంలో నీలకంఠ శర్మ, 56వ నిముషంలో గుర్యాంత్ సింగ్ చెరో గోలు సాధించారు.
గ్రూప్ - ఏ లీగ్ టాపర్ గా నాకౌట్ సెమీఫైనల్స్ చేరిన భారత్...ఫైనల్లో చోటు కోసం బుధవారం జరిగే సెమీస్ పోరులో గ్రూప్- బీ లీగ్ లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడనుంది.