Telugu Global
Sports

ఆసియాక్రీడల తొలిరోజునే భారత్ కు 5 పతకాలు!

19వ ఆసియాక్రీడల తొలిరోజునే భారత్ ఐదు పతకాలతో శుభారంభం చేసింది. పతకాల పట్టిక 7వ స్థానంలో నిలిచింది.

ఆసియాక్రీడల తొలిరోజునే భారత్ కు 5 పతకాలు!
X

19వ ఆసియాక్రీడల తొలిరోజునే భారత్ ఐదు పతకాలతో శుభారంభం చేసింది. పతకాల పట్టిక 7వ స్థానంలో నిలిచింది.

చైనాలోని హాంగ్జు నగరం వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన 2022 ఆసియా క్రీడల తొలిరోజును భారత్ సంతృప్తిగా ముగించింది. 651 మంది సభ్యుల భారీబృందంతో ..38 రకాల అంశాలలో పతకాలవేటకు దిగిన భారత అథ్లెట్లు క్రీడల తొలిరోజునే మూడు రజత, 2 కాంస్యాలతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించారు. దీంతో ..భారత్ పతకాల పట్టిక 7వ స్థానంలో నిలువగలిగింది. ఆతిథ్య చైనా మాత్రం 20 స్వర్ణాలతో సహా మొత్తం 30 పతకాలు సాధించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచింది.

షూటింగ్ టీమ్ విభాగంలో రజతం...

మహిళల 10 మీటర్ల ఏర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత్ రజత పతకంతో సరిపెట్టుకొంది. మేహులీ ఘోష్, రామితా జిందాల్, అషీ చోక్సీలతో కూడిన భారతజట్టు మొత్తం 1,886 పాయింట్లతో రెండోస్థానంలో నిలవడం ద్వారా రజత పతకం కైవసం చేసుకొంది.

ఆతిథ్య చైనాజట్టు 1, 896.6 పాయింట్లు సాధించడం ద్వారా సరికొత్త ఆసియా రికార్డుతో బంగారు పతకం సొంతం చేసుకొంది.

భారత షూటర్ రామితా జిందాల్ 230.1 పాయింట్లతో వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలుచుకొంది. చైనా షూటర్లు స్వర్ణ, రజత పతకాలు సాధించారు.

రోయింగ్ లో రజతం...

రోయింగ్ పురుషుల డబుల్స్ లో భారత జోడీ అర్జున్ లాల్ జాట్- అరవింద్ సింగ్ రజత పతకం సాధించారు. కాక్స్ డ్ -8 టీమ్ విభాగంలో సైతం భారత్ కు రజత పతకం దక్కింది.

భారతజట్టులో నీరజ్, నరేశ్, నితీశ్, చరణ్ జీత్, జస్విందర్, భీమ్, పునీత్ కుమార్, అశీశ్ సభ్యులుగా ఉన్నారు.

కాక్స్ లెస్ పెయిర్స్ విభాగంలో భారతజోడీ బాబులాల్ యాదవ్- లేఖా రామ్ కాంస్య పతకంతో సరిపెట్టుకొన్నారు. ప్రస్తుత ఆసియాక్రీడల రోయింగ్ బరిలో మొత్తం 33 మంది సభ్యుల జట్టుతో భారత్ పోటీకి దిగింది.

ఫుట్ బాల్ ప్రీ-క్వార్టర్స్ లో భారత్....

ఆసియాక్రీడల పురుషుల ఫుట్ బాల్ లో 9 సంవత్సరాల విరామం తర్వాత పాల్గొంటున్న భారత్ గ్రూప్ - లీగ్ ఆఖరి పోటీని డ్రాగా ముగించడం ద్వారా ఆఖరి 16 జట్ల రౌండ్ కు అర్హత సంపాదించింది.

తొలిరౌండ్లో చైనా చేతిలో 1-5తో ఓటమి పొందిన భారత్..రెండోరౌండ్లో బంగ్లాదేశ్ ను 1-0తో అధిగమించడం ద్వారా నాకౌట్ రౌండ్ అవకాశాలను సజీవంగా నిలుపుకొంది. కీలక ఆఖరి రౌండ్ మ్యాచ్ లో మియన్మార్ ను 1-1తో నిలువరించడం ద్వారా..గ్రూపు-ఏ లీగ్ లో రెండో అత్యుత్తమ జట్టుగా ప్రీ- క్వార్టర్ ఫైనల్ రౌండ్ చేరుకొంది.

నిఖత్ జరీన్ తొలిగెలుపు...

మహిళల బాక్సింగ్ లో హాట్ ఫేవరెట్, తెలుగు రాష్ట్ర్రాల మేటి బాక్సర్ నిఖత్ జరీన్ తొలిరౌండ్ విజయంతో ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. వియత్నాంకు చెందిన థీ టామ్ గుయెన్ ను చిత్తు చేసి ఆఖరి 16 మంది బాక్సర్ల పోరులో నిలిచింది.

మహిళా క్రికెట్లో బంగ్లాదేశ్ ను చిత్తు చేయడం ద్వారా భారత్ మెడల్ రౌండ్లో ప్రవేశించింది. గోల్డ్ మెడల్ పోరులో శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  24 Sept 2023 3:30 PM GMT
Next Story