Telugu Global
Sports

64 నోబాల్స్ తో టీ-20 క్రికెట్లో మరో చెత్త రికార్డు!

క్రికెట్ ను ప్రపంచ దేశాలకు విస్తరించాలన్న ఐసీసీ లక్ష్యం బెడిసి కొడుతోంది. బ్యాటు ,బంతి పట్టుకోడం రాని దేశాలకు క్రికెట్ ను పరిచయం చేస్తూ చెత్త రికార్డులకు ఆలవాలమవుతోంది.

64 నోబాల్స్ తో టీ-20 క్రికెట్లో మరో చెత్త రికార్డు!
X

క్రికెట్ ను ప్రపంచ దేశాలకు విస్తరించాలన్న ఐసీసీ లక్ష్యం బెడిసి కొడుతోంది. బ్యాటు ,బంతి పట్టుకోడం రాని దేశాలకు క్రికెట్ ను పరిచయం చేస్తూ చెత్త రికార్డులకు ఆలవాలమవుతోంది.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ చరిత్రలో పలు చెత్తరికార్డుల మరో మ్యాచ్ వచ్చి చేరింది. 20 ఓవర్ల మ్యాచ్ లో తొలిసారిగా 64 నోబాల్స్, ఒక్క ఓవర్లో 52 పరుగులు, ఓ ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ నష్టానికి 421 పరుగుల భారీస్కోర్ల రికార్డులు నమోదయ్యాయి.

చిలీపై అర్జెంటీనా మహిళల రికార్డుల వెల్లువ...

సాకర్ క్రేజీ లాటిన్ అమెరికా ( చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్ ) దేశాలలో క్రికెట్ విస్తరణకు ఐసీసీ నడుంబిగించింది. తన నిధుల నుంచి కోట్లాదిరూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెడుతోంది.

ఐసీసీ ప్రోద్భలంతో ఫుట్ బాలే ఊపిరిగా భావించే చిలీ, అర్జెంటీనా దేశాలు సైతం క్రికెట్ బరిలో నిలిచాయి. అర్జెంటీనా- చిలీ దేశాల మహిళా జట్లు మూడుమ్యాచ్ ల సిరీస్ లో పాల్గొనడం ద్వారా పలు చెత్తరికార్డులకు కేంద్రంగా నిలిచాయి.

చిలీ మహిళాజట్టుతో జరిగిన 20 ఓవర్ల మ్యాచ్ లో అర్జెంటీనా వికెట్ నష్టానికి 421 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. 2022 లో సౌదీ అరేబియాపై బెహ్రీన్ మహిళాజట్టు సాధించిన 381 పరుగుల ప్రపంచ రికార్డును అర్జెంటీనా 421 పరుగులతో అధిగమించింది.

84 బంతుల్లో 169 పరుగులు...

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన అర్జెంటీనా..చిలీ బౌలర్ల ఘోరవైఫల్యంతో 421 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేయగలిగారు. ఓపెనర్లు లూసియా టేలర్- అల్బెర్టీనా గలాన్ మొదటి వికెట్ కు 16.5 ఓవర్లలో 350 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు.

లూసియా 84 బంతుల్లో 27 ఫోర్లతో 169 పరుగులు సాధించి అవుట్ కాగా.. గలాన్ 84 బంతుల్లో 23 ఫోర్లతో 145 పరుగుల స్కోరు నమోదు చేసింది. వన్ డౌన్ మారియో కాస్టినీరా 16 బంతుల్లో 40 పరుగుల అజేయ స్కోరుతో నిలిచింది.

ఒక్క ఓవర్లో 52 పరుగులు...

చిలీ బౌలర్లు 64 నోబాల్స్ వేయడంతో 73 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో సమర్పించుకోవాల్సి వచ్చింది. ఫ్లారెన్షియా మార్టినేజ్ ఒక్క ఓవర్లో 52 పరుగులు, కాన్ స్టాంజా ఒయార్సీ తన కోటా 4 ఓవర్లలో92 పరుగులు ఇవ్వటం కూడా చెత్త రికార్డులుగా నమోదయ్యాయి. ఎమీలియా టారో కేవలం 3 ఓవర్లలోనే 83 పరుగులు ఇవ్వటం చూస్తే క్రికెట్ ఏవిధంగా నవ్వులపాలయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు.

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 422 పరుగులు చేయాల్సిన చిలీ 63 పరుగులకు కుప్పకూలింది. దీంతో అర్జెంటీనా 364 పరుగుల రికార్డు విజయం నమోదు చేయగలిగింది.

ఇటీవలే ముగిసిన ఆసియాక్రీడల పురుషుల క్రికెట్లో భాగంగా మంగోలియాతో ముగిసిన పోటీలో నేపాల్ 3 వికెట్లకు 314 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేసింది. ఆమ్యాచ్ లో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా 34 బంతుల్లో సెంచరీ, దీపేంద్ర సింగ్ అయిరీ 9 బంతుల్లో హాఫ్ సెంచరీలతో ప్రపంచ రికార్డుల మోత మోగించారు.

నేపాల్ జట్టు 273 పరుగుల తేడాతో మంగోలియాను చిత్తు చేసింది. అభిమానులు నేపాల్- మంగోలియాజట్ల మ్యాచ్ లో నమోదైన రికార్డులను మరచిపోక ముందే..

అర్జెంటీనా- చిలీ మహిళాజట్ల మ్యాచ్ లో పలు చెత్తరికార్డులు నమోదు కావడం చూస్తే..ఇలాంటి చెత్త రికార్డులు, చెత్త జట్లు క్రికెట్ కు అవసరమా? అనుకోక తప్పదు.

First Published:  15 Oct 2023 12:25 PM IST
Next Story