Telugu Global
Sports

40 ఏళ్ల వయసులో ప్రపంచ నంబర్ వన్!

న్యూజిలాండ్ తో ముగిసిన తొలిటెస్టులో 7 వికెట్లు పడగొట్టడం ద్వారా 40 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి పేస్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

40 ఏళ్ల వయసులో ప్రపంచ నంబర్ వన్!
X

ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సత్తా ఉండాలేకానీ ప్రపంచ నంబర్ వన్ గా నిలవడానికి వయసుతో ఏమాత్రం పనిలేదని చాటి చెప్పాడు...

టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్ ర్యాంక్ ను ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ ఐదేళ్ల విరామం తర్వాత సాధించాడు. న్యూజిలాండ్ తో ముగిసిన తొలిటెస్టులో 7 వికెట్లు పడగొట్టడం ద్వారా 40 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన తొలి పేస్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

కమ్మిన్స్ ఆధిపత్యానికి యాండర్సన్ గండి...

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో గత 1466 రోజులుగా టాప్ ర్యాంకర్ గా కొనసాగిన ఆస్ట్ర్రేలియా కెప్టెన్ కమ్ ఫాస్ట్ బౌలర్ యాండీ కమ్మిన్స్ ఆధిపత్యానికి యాండర్సన్ ఎట్టకేలకు గండి కొట్టగలిగాడు.

ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..కమ్మిన్స్ మూడోస్థానానికి పడిపోయాడు. జేమ్స్ యాండర్సన్, రవిచంద్రన్ అశ్విన్ మొదటి రెండుర్యాంకుల్లో నిలిచారు.

ప్రపంచ అత్య్తుత్తమ స్వింగ్ కమ్ పేసర్ గా పేరున్న జిమ్మీ యాండర్సన్ నాలుగుపదుల వయసులో ఆరోసారి తిరిగి టాప్ ర్యాంక్ ను చేరుకోగలిగాడు.

2016 మే నెలలో తొలిసారిగా నెంబర్ వన్ బౌలర్ ర్యాంక్ ను సాధించిన యాండర్సన్ తన ఆధిపత్యాన్ని 2018 వరకూ కొనసాగించగలిగాడు. ఆ తర్వాత మరో ఐదుసార్లు ర్యాంక్ చేతులు మారుతూ వచ్చింది.

నాడు గ్రిమెట్..నేడు యాండర్సన్..

1936లో ఆస్ట్ర్రేలియా బౌలర్ క్లారీ గ్రిమెట్ 40 ఏళ్ల వయసులో ప్రపంచ బౌలర్ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తరువాత..8 దశాబ్దాలకు అదే ఘనతను జేమ్స్ యాండర్సన్ 40 సంవత్సరాల 207 రోజుల వయసులో సాధించగలిగాడు.

అంతేకాదు...టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ గా, అత్యధిక వికెట్లు సాధించిన మూడోబౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

గత రెండుదశాబ్దాలుగా ఇంగ్లండ్ ప్రధాన అస్త్రంగా, తురుపుముక్కగా తన ప్రత్యేకతను నిలుపుకొంటూ వస్తున్న యాండర్సన్..న్యూజిలాండ్ తో ముగిసిన ప్రస్తుత 2023 సిరీస్ లోని తొలిటెస్ట్ వరకూ 682 వికెట్లు పడగొట్టి..దిగ్గజ బౌలర్లు ముత్తయ్య మురళీధరన్ ( 800 వికెట్లు ), షేన్ వార్న్ ( 708 వికెట్లు )ల తర్వాతి స్థానంలో నిలిచాడు.

తన కెరియర్ లో 178 టెస్టులు ఆడిన యాండర్సన్ 32 సార్లు ఐదు వికెట్ల రికార్డును నమోదు చేశాడు.

2003 నుంచి 2023 వరకూ...

2003 మే 22న లార్డ్స్ వేదికగా జింబాబ్వే ప్రత్యర్థిగా టెస్టు అరంగేట్రం చేసిన జేమ్స్ యాండర్సన్ గత 20 సంవత్సరాలుగా ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా తన ప్రస్థానం కొనసాగిస్తూనే వస్తున్నాడు.

30 లేదా 35 సంవత్సరాలకే ఫాస్ట్ బౌలర్లు తెరమరుగైపోతున్న ప్రస్తుత తరుణంలో జేమ్స్ యాండర్సన్ 40 సంవత్సరాల వయసులోనూ అదేజోరు, అదే దూకుడు కొనసాగిస్తూ అత్యంత విజయవంతమైన, టెస్ట్ టాప్ ర్యాంక్ బౌలర్ గా నిలవడం చూస్తే..వయసుతో ఏమాత్రం పనిలేదని చెప్పక తప్పదు.

First Published:  23 Feb 2023 10:00 AM IST
Next Story