Telugu Global
Sports

48 జట్లతో 2026 ఫిఫా ప్రపంచకప్!

ఖతర్ వేదికగా 2022 ఫిఫా ప్రపంచకప్ టోర్నీ అత్యంత విజయవంతంగా ముగిసిందో లేదో..మరో నాలుగేళ్లలో జరిగే 2026 ప్రపంచకప్ కు అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య అప్పుడే సన్నాహాలు ప్రారంభించింది.

48 జట్లతో 2026 ఫిఫా ప్రపంచకప్!
X

48 జట్లతో 2026 ఫిఫా ప్రపంచకప్!

మరో నాలుగేళ్లలో జరిగే 2026 ఫిఫా ప్రపంచకప్ ను వినూత్నంగా నిర్వహించాలని అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య నిర్ణయించింది. ఫైనల్ రౌండ్లో తలపడే జట్ల సంఖ్యను గణనీయంగా పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేసింది....

ఖతర్ వేదికగా 2022 ఫిఫా ప్రపంచకప్ టోర్నీ అత్యంత విజయవంతంగా ముగిసిందో లేదో..మరో నాలుగేళ్లలో జరిగే 2026 ప్రపంచకప్ కు అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య అప్పుడే సన్నాహాలు ప్రారంభించింది.

మూడుదేశాలు వేదికగా వచ్చే ప్రపంచకప్...

2026 ఫిఫా ప్రపంచకప్ కు కెనడా, అమెరికా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. రానురాను ఫుట్ బాల్ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగిపోతూ ఉండడంతో ఫైనల్ రౌండ్లో పాల్గొనేజట్లను మరింతగా పెంచాలని, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలకు చెందిన మరిన్ని దేశాలకు సరికొత్తగా అవకాశం కల్పించాలని ఫిఫా భావిస్తోంది.

48 జట్లు- 100మ్యాచ్ లతో టోర్నీ...

2022 ప్రపంచకప్ ను 32 జట్లు, 65 మ్యాచ్ లుగా నిర్వహిస్తే..2026 ప్రపంచకప్ ను 48 జట్లు, 100 మ్యాచ్ లతో నిర్వహించడానికి ఫిఫా ప్రణాళిక రూపొందించింది. 1998 ప్రపంచకప్ నుంచి 32 జట్లతో నిర్వహిస్తున్న ఈ టోర్నీని మరో 16 జట్లకు విస్తరించాలని ఫిఫా నిర్ణయించింది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఖండాలకు చెందిన 209 దేశాలు అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్యకు అనుబంధంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడగా, అత్యధిక జనాదరణ పొందుతున్న క్రీడగా నిలిచిన ఫుట్ బాల్ ను మరిన్ని దేశాలకు విస్తరింప చేయటమే లక్ష్యంగా ఫిఫా ప్రపంచకప్ టోర్నీలను నిర్వహిస్తోంది.

2016లో అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటినుంచి గియాన్నీ ఇన్ ఫాంటినో ఫిఫా టోర్నీల విస్తరణకు నడుం బిగించారు.

ఆఫ్రికా, ఆసియాజట్లకు భలే చాన్స్...

1930 లో జరిగిన ప్రారంభ ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో 13 దేశాలకు చెందిన జట్లు మాత్రమే తలపడ్డాయి. 1934 నుంచి 1978 వరకూ 16 జట్లతో ఫైనల్ రౌండ్ పోటీలు నిర్వహించారు.

1982 ప్రపంచకప్ నుంచి జట్ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచారు. 1998 ప్రపంచకప్ నుంచి జట్ల సంఖ్య 32కు చేరింది. 2026 ప్రపంచకప్ లో పాల్గొనే జట్ల సంఖ్యను 48కి పెంచడంతో ఆఫ్రికా, ఆసియాఖండానికి చెందిన మరిన్ని దేశాలకు ప్రపంచకప్ ఫైనల్ రౌండ్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది.

ప్రస్తుత 2022 ప్రపంచకప్ వరకూ ఆఫ్రికా ఖండానికి చెందిన ఐదు దేశాలకు, ఆసియాఖండానికి చెందిన 4 దేశాలజట్లు మాత్రమే పాల్గొంటూ వస్తున్నాయి. 2026 ప్రపంచకప్ నుంచి ఆఫ్రికాజట్ల సంఖ్య 5 నుంచి 9కి పెరగనుంది.

ఆసియాఖండ దేశాల సంఖ్య 4 నుంచి 8కి చేరనుంది. ఇప్పటి వరకూ ప్లే ఆఫ్ రౌండ్ల ద్వారా అర్హత సాధిస్తూ వచ్చిన ఓషీనియాజట్లు ఇక నేరుగా పాల్గోనున్నాయి.

200 మిలియన్ల జనాభా కలిగిన ఆఫ్రికాఖండ దేశాలకు ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ ఐదు బెర్త్ లు మాత్రమే కేటాయిస్తూ వచ్చారని..అయితే వచ్చే ప్రపంచకప్ నుంచి జట్ల సంఖ్య 9కి పెరగడం సంతోషమని ఆఫ్రికా సాకర్ దిగ్గజాలు అంటున్నారు.

ఆఫ్రికా సాకర్ దిగ్గజాలు ఈజిప్టు, అల్జీరియా, నైజీరియాజట్లకు సైతం వచ్చే ప్రపంచకప్ నుంచి ఫైనల్ రౌండ్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది.

యూరోప్ జట్లకూ అవకాశం..

ఇప్పటి వరకూ యూరోప్ జట్లకు 13 బెర్త్ లు కేటాయించగా...రానున్న ప్రపంచకప్ నుంచి వాటి సంఖ్య 16కు పెరగనుంది. దక్షిణ అమెరికా జట్ల సంఖ్య నాలుగు నుంచి 6కు చేరనుంది. పెరూ, కొలంబియా, చిలీ, గ్వాతెమాలా లాంటి జట్లకు సైతం ప్రపంచకప్ లో తలపడే అవకాశం దక్కుతుంది.

కెనడా, అమెరికా, మెక్సికో దేశాలజట్లకు ఆతిథ్య దేశాల హోదాలో బెర్త్ లు ఖాయం కావడంతో సరికొత్తగా మరో మూడుదేశాలజట్లకు ఫైనల్ రౌండ్ సమరంలో చోటు లభించనుంది.

32జట్లతో నాకౌట్ సమరం...

మొత్తం 48 జట్ల ఫైనల్ రౌండ్ తొలిదశను మూడేసి జట్లతో 16 గ్రూపులుగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత నుంచి 32 జట్ల నాకౌట్ పోరును నిర్వహించనున్నారు.

గ్రూపుకు 4 జట్లతో మొత్తం 12 గ్రూపుల మ్యాచ్ లు నిర్వహిస్తామని, ఒక్కో గ్రూపులో మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్లతో పాటు మూడోస్థానంలో నిలిచిన ఎనిమిది అత్యుత్తమజట్లతో నాకౌట్ రౌండ్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉంది.

మొత్తం 104 మ్యాచ్ ల ప్రపంచకప్ టోర్నీలో విజేతగా నిలిచే జట్టు మొత్తం తొమ్మిదిమ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

2026 ప్రపంచకప్ కోసం అమెరికాలో 11 స్టేడియాలను, మెక్సికోలో మూడు, కెనడాలో రెండు స్టేడియాలను సిద్ధం చేయనున్నారు. ఇప్పటి వరకూ ఎన్ఎఫ్ ఎల్ కు వాడిన స్టేడియాలనే ప్రపంచకప్ ఫుట్ బాల్ కు సైతం వినియోగించనున్నారు.

లాస్ ఏంజెలిస్ లోని సోఫీ స్టేడియం, న్యూయార్క్ లోని 82వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన మెట్ లైఫ్ స్టేడియం, ఈస్ట్ రూథర్ ఫోర్డ్ స్టేడియాలు సైతం ప్రధాన వేదికలుగా నిలువనున్నాయి.

2022 ప్రపంచకప్ ద్వారా 7.5 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిన ఫిఫా 2026 ప్రపంచకప్ ద్వారా 11 బిలియన్ డాలర్లు సంపాదించగలమన్న ధీమాతో ఉంది.

మొత్తం మీద..జట్ల సంఖ్యను 32 నుంచి 48కు పెంచడం ద్వారా వచ్చే నాలుగేళ్ల కాలంలో ఫిఫా దండిగా లాభాలు సంపాదించడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

First Published:  20 Dec 2022 9:32 AM IST
Next Story