Telugu Global
Sports

క్రిస్టియానో రొనాల్డోకి 2000 కోట్ల కాంట్రాక్ట్!

పోర్చుగల్ కెప్టెన్, ప్రపంచ మేటి సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన కెరియర్ ముగింపు దశలో అతిపెద్ద కాంట్రాక్టు సాధించాడు. సౌదీ అరేబియాక్లబ్ అల్ -నాజర్ కు రెండున్నరేళ్లపాటు ఆడనున్నాడు....

క్రిస్టియానో రొనాల్డోకి 2000 కోట్ల కాంట్రాక్ట్!
X

పోర్చుగల్ కెప్టెన్, ప్రపంచ మేటి సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన కెరియర్ ముగింపు దశలో అతిపెద్ద కాంట్రాక్టు సాధించాడు. సౌదీ అరేబియాక్లబ్ అల్ -నాజర్ కు రెండున్నరేళ్లపాటు ఆడనున్నాడు....

క్రిస్టియానో రొనాల్డో...ప్రపంచ సాకర్ అభిమానులకు అంతగా పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచ, యూరోపియన్ సాకర్ లో గత దశాబ్దకాలంగా మెరుపు గోల్స్, సంచలన రికార్డులతో తనకుతానే సాటిగా నిలుస్తూ వస్తున్న 37 సంవత్సరాల రొనాల్డో తన కెరియర్ ముగింపు దశలో కళ్ళు చెదిరే కాంట్రాక్టు సాధించాడు.

మాంచెస్టర్ టు అల్-నాజర్ క్లబ్....

ప్రొఫెషనల్ లీగ్ ఫుట్ బాల్ లో లిస్బన్, యువెంటస్, రియల్ మాడ్ర్డిడ్, మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ లకు ఆడుతూ ఇప్పటి వరకూ యూరోప్ కు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన క్రిస్టియానో రొనాల్డో తొలిసారిగా ఆసియావైపు మొగ్గు చూపాడు. తన కెరియర్ ముగింపు దశలో ఆసియా సాకర్ లీగ్ లో పాల్గొనాలని నిర్ణయించాడు. అందులో భాగంగానే సౌదీ అరేబియాకు చెందిన అల్- నాజర్ క్లబ్ తో భారీకాంట్రాక్టు కుదుర్చుకొన్నాడు.

సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో తమక్లబ్ కాంట్రాక్టు ఖరారైనట్లు అల్ -నాజర్ ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు. రొనాల్డో 2023 నుంచి 2025 సీజన్ వరకూ అల్-నాజర్ క్లబ్ తరపునే ఆడాల్సి ఉంది.

రెండున్నర ఏళ్ళకు 2వేల కోట్లు...

క్రిస్టియానో రొనాల్డో వచ్చే రెండున్నర సంవత్సరాల పాటు సౌదీక్లబ్ తరపున ఆడటానికి 2వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కుదుర్చుకొన్నాడు. ఏడాదికి 800 కోట్ల రూపాయలు రొనాల్డోకి చెల్లించనున్నారు.

రొనాల్డోకి 7వ నంబర్ జెర్సీని కేటాయించినట్లు, సూపర్ స్టార్ రాకతో తమ క్లబ్ ప్రతిష్ట మరింతగా ఇనుమడించనున్నట్లు అల్-నాజర్ క్లబ్ ప్రతినిధి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

క్రిస్టియానో రొనాల్డోకి ఏడాదికి 75 మిలియన్ పౌండ్లు చొప్పున చెల్లిస్తారని, ఈ కాంట్రాక్టు మన రూపాయలలో 2వేల కోట్లకు సమానమని సాకర్ వర్గాలు అంటున్నాయి.

సరైన సమయంలో....

యూరోప్ నుంచి ఆసియా లీగ్ కు రావడాన్ని క్రిస్టియానో రొనాల్డో సమర్థించుకొన్నాడు. ఆసియాలో సాకర్ ప్రమాణాలు అనూహ్యంగా పెరిగాయని, భవిష్యత్ ఆసియాదేనని చెప్పాడు. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ లో జపాన్, కొరియా, సౌదీ అరేబియాజట్ల ఆటతీరే దానికి నిదర్శనమని రొనాల్డో చెప్పాడు.

యూరోపియన్ లీగ్ ఫుట్ బాల్ లో తాను దాదాపుగా అన్ని విజయాలు చవిచూశానని..ఇక అక్కడ సాధించాల్సింది ఏమీలేదని తేల్చి చెప్పాడు.

పోర్చుగల్ కు యూరోపియన్ ఫుట్ బాల్ టైటిల్ ను అందించిన క్రిస్టియానో రొనాల్డోకి ఐదు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన అరుదైన రికార్డు ఉంది.

2009- 2018 వరకూ రియల్ మాడ్రిడ్ తరపున స్పానిష్ లీగ్ లో ఆడిన రొనాల్డో రెండు లాలీగా టైటిల్స్, రెండు స్పానిష్ కప్పులు, నాలుగు చాంపియన్స్ లీగ్ టైటిల్స్, మూడు ప్రపంచ క్లబ్ టైటిల్స్ సాధించాడు.

2021 నుంచి మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కు ఆడిన రొనాల్డో..ఆ క్లబ్ మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్ తో పొసగక కాంట్రాక్టు రద్దు చేసుకొన్నాడు.

రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున 451 మ్యాచ్ లు ఆడి 800కు పైగా గోల్స్ సాధించిన ఘనత రొనాల్డోకి ఉంది.

యువెంటస్ క్లబ్ తరపున మూడేళ్లపాటు ఇటాలియన్ సాకర్ లీగ్ లో ఆడిన రొనాల్డో రెండు సీరీ ఏ టైటిల్స్ తో పాటు కోపా ఇటాలియా ట్రోఫీని మూడేళ్లపాటు తన జట్టుకు అందించాడు.

రానున్న రెండున్నర సంవత్సరాలపాటు సౌదీ క్లబ్ అల్- నాజర్ తరపున క్రిస్టియానో రొనాల్డో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో..ఏం మెరుపులు మెరిపిస్తాడో వేచిచూడాల్సిందే.

First Published:  31 Dec 2022 11:25 AM IST
Next Story