Telugu Global
Sports

నేటి నుంచే ఆసియా క్రీడల సంరంభం!

చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా నేటి నుంచి 19వ ఆసియా క్రీడల సంరంభం ప్రారంభంకానుంది. భారీ సంఖ్యలో పతకాలు సాధించడమే లక్ష్యంగా 651మంది సభ్యుల బృందంతో భారత్ బరిలో నిలిచింది.

నేటి నుంచే ఆసియా క్రీడల సంరంభం!
X

ఆసియా ఖండ దేశాల నడుమ నాలుగేళ్లకోమారు జరిగే క్రీడల పరంపరలో భాగంగా 19వ ఆసియా క్రీడలకు చైనా నగరం హాంగ్జౌ ఆతిథ్యమిస్తోంది.

ఏడాది ఆలస్యంగా 2022 ఏషియాడ్...

గత ఏడాదే జరగాల్సిన 19వ ఆసియా క్రీడలను కరోనా భయంతో సంవత్సరం పాటు వాయిదా వేసి..2023 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకూ నిర్వహించడానికి ఆసియా ఒలింపిక్ మండలి నేతృత్వంలో చైనా ఒలింపిక్ సంఘం భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది. మొత్తం 45 దేశాలకు చెందిన 4 వేల మందికి పైగా అథ్లెట్లు వివిధ క్రీడల్లో తలపడబోతున్నారు. భారత్ మాత్రం అత్యధిక పతకాలు సాధించడమే లక్ష్యంగా 651 మంది సభ్యుల భారీ బృందంతో హాంగ్జౌలో అడుగుపెట్టింది.

38 క్రీడాంశాలలో భారత్ పోటీ...

2018లో ఇండోనేషియాలోని పాలెమ్ బ్యాంగ్ నగరం వేదికగా ముగిసిన 18వ ఆసియా క్రీడల పతకాల పట్టిక 8వ స్థానంలో నిలిచిన భారత్.. 2022 ఆసియా క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయటానికి వీలుగా అథ్లెట్లను సమాయత్తం చేసింది. భారత అథ్లెట్లు గత ఏషియాడ్‌లో 16 స్వర్ణాలతో సహా మొత్తం 70 పతకాలు సాధించగలిగారు.

ప్రస్తుత క్రీడల కోసం ముందుగా 634 మంది సభ్యుల బృందాన్ని సిద్ధం చేశారు. అయితే భారత ఒలింపిక్స్ సంఘం సిఫారసు మేరకు 17 మంది సభ్యులకు అదనంగా చోటు కల్పించారు. 2018 జకార్తా ఆసియాక్రీడల్లో 572 మంది అథ్లెట్ల బృందంతో పాల్గొన్న భారత్ ఈసారి రికార్డు స్థాయిలో 651 మంది సభ్యుల బృందంతో పోటీకి దిగుతోంది. భారత అథ్లెట్లు మొత్తం 38 క్రీడాంశాలలో పతకాల వేటకు దిగుతున్నారు. పురుషుల జావలిన్ త్రో, హాకీ, చెస్ టీమ్, వ్యక్తిగత అంశాలతో పాటు కబడ్డీలో సైతం భారత్ బంగారు పతకాలు గెలుచుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడల్లోనూ భారత్ పోటీ..

దశాబ్ద కాలం విరామం తర్వాత తిరిగి ప్రవేశపెట్టిన క్రికెట్‌తో పాటు చదరంగం, ఫుట్‌బాల్ క్రీడల్లో సైతం భారత్ పోటీకి దిగుతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో 65 మంది సభ్యుల జట్టుతో పతకాల వేటకు దిగుతోంది. ఒలింపిక్‌ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో సహా 34 మంది పురుషులు, 31మంది మహిళలు భారత అథ్లెటిక్స్ జట్టులో సభ్యులుగా ఉన్నారు.

ఫుట్‌బాల్ పురుషుల, మహిళల విభాగాలలో 44 మంది, హాకీ పురుషుల, మహిళల విభాగాలలో 36 మంది, క్రికెట్ పురుషుల, మహిళల విభాగాలలో 30 మంది సభ్యులు భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. సెయిలింగ్ జట్టులో 33 మంది క్రీడాకారులున్నారు. వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, రగ్బీ, కురాష్ క్రీడల్లోనూ భారత అథ్లెట్లు పోటీకి దిగనున్నారు.

చెస్ జట్లలో తెలుగు రాష్ట్రాల‌ క్రీడాకారులు...

ఆసియా క్రీడల క్రీడాంశాలలో భాగంగా 13 ఏళ్ళ విరామం తర్వాత నిర్వహిస్తున్న చదరంగ క్రీడ పురుషుల, మహిళల విభాగాలలో 10 మంది సభ్యుల జట్లతో భారత్ పోటీకి దిగుతోంది. పురుషుల, మహిళల జట్లలో ఇద్దరేసి తెలుగు రాష్ట్రాల‌ గ్రాండ్ మాస్టర్లకు చోటు దక్కింది. మహిళల జట్టులో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పురుషుల జట్టులో పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్ సభ్యులుగా ఉన్నారు. ప్రపంచకప్ రన్నరప్ ప్రజ్ఞానంద్, గుకేశ్, విదిత్ గుజరాతీ సభ్యులుగా ఉన్నారు. టీమ్, వ్యక్తిగత విభాగాలలో భారత్ పతకాలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. మహిళల విభాగంలో రెండు సార్లు ఆసియా స్వర్ణ పతక విజేత కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక పోటీ పడుతున్నారు. 2010 ఆసియా క్రీడల్లో చివరిసారిగా చదరంగ క్రీడను నిర్వహించారు.

హాకీ.. ఒకే గ్రూపులో భారత్, పాక్!

ఆసియా క్రీడల హాకీ పురుషుల విభాగం ఒకే గ్రూపులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ తలపడనున్నాయి. ఎనిమిది సార్లు ఆసియా క్రీడల హాకీ గోల్డ్ మెడలిస్ట్ పాకిస్థాన్, మూడుసార్లు స్వర్ణ విజేత భారత జట్లకు గ్రూపు-ఏలో చోటు దక్కింది. జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఉజ్బెకిస్థాన్ జట్లు సైతం ఇదే గ్రూపులో ఉన్నాయి. సెప్టెంబర్ 30న జరిగే కీలక పోరులో భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత జట్టు సెప్టెంబర్ 26న సింగపూర్, 28న జపాన్ జట్లతో తలపడనుంది. ఆసియా క్రీడల హాకీ పోటీలకు గాంగ్సు కెనాల్ స్పోర్ట్స్ పార్క్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. పురుషుల గోల్డ్ మెడల్ మ్యాచ్ అక్టోబర్ 6న, మహిళల స్వర్ణ పతకం పోరును అక్టోబర్ 7న నిర్వహిస్తారు. భారత్ చివరిసారిగా 2014 ఇంచెన్ ఆసియా క్రీడల్లో హాకీ బంగారు పతకం సాధించింది.

చైనా ప్రధాన ప్రత్యర్థిగా భారత్ పోరు..

ఆసియా క్రీడల ఫుట్‌బాల్‌లో భారత్ గ్రూప్- ఏ నుంచి తన అదృష్టం పరీక్షించుకోనుంది. నిర్వాహక సంఘం విడుదల చేసిన డ్రా ప్రకారం..గ్రూప్ - ఏ లీగ్‌లో ఆతిథ్య చైనా, బంగ్లాదేశ్, మయన్మార్ జట్లతో భారత పురుషుల జట్టు తలపడనుంది. మహిళల గ్రూప్ - బీ లీగ్‌లో థాయ్ లాండ్, చైనీస్ తైపీ జట్లతో భారత జట్టు పోటీపడనుంది.

మొత్తం 24 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశలో మొదటి రెండు స్థానాలు సాధించిన జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సి ఉంది. మొత్తం ఆరు జట్లలోని నాలుగు అత్యుత్తమ మూడో స్థానం సాధించిన జట్లకు సైతం క్వార్టర్స్ లో చోటు కల్పిస్తారు. పురుషుల గ్రూపు-ఏ నుంచి చైనా, భారత జట్లు క్వార్టర్ ఫైనల్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రెండుసార్లు ఏషియాడ్ విజేత భారత్....

భారత ఫుట్ బాల్ జట్టుకు ఆసియా క్రీడల్లో రెండుసార్లు బంగారు పతకం సాధించిన ఘనత సైతం ఉంది. 1951లో తొలిసారిగా నిర్వహించిన ఆసియా క్రీడల తొలి పోటీల ఫుట్ బాల్ లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు తిరిగి 1962 గేమ్స్ లో సైతం బంగారు పతకం సంపాదించింది.

2002 ఆసియాక్రీడల నుంచి 23 సంవత్సరాల లోపు వయసున్న వారికి మాత్రమే ఫుట్ బాల్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. అయితే..గతేడాది జరగాల్సిన 2022 ఆసియా క్రీడలు కరోన దెబ్బతో ఏడాది వాయిదా పడటంతో.. ప్రస్తుత ఆసియా క్రీడల్లో 23 సంవత్సరాలు పైబడిన ముగ్గురు ఆటగాళ్లకు ఆడే అవకాశం ఇచ్చారు. దీంతో సునీల్ ఛెత్రీ, గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు, డిఫెండర్ సందేశ్ జింగాన్ లకు ఆసియాక్రీడల్లో పాల్గోనే అవకాశం దక్కింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు మినహా మిగిలిన వారంతా 23 సంవత్సరాల లోపు వారై మాత్రమే ఉండాలి.

651 మంది అథ్లెట్ల భారీ బృందంతో ప్రస్తుత ఏషియాడ్‌లో పాల్గొంటున్న భారత్ 2018 గేమ్స్ కంటే ఎక్కువ బంగారు పతకాలు సాధించాలని కోరుకొందాం.!

First Published:  23 Sept 2023 7:38 AM IST
Next Story