వింబుల్డన్ లో ఒకే ఒక్క భారతీయుడు!
లండన్ వేదికగా ఈరోజు ప్రారంభంకానున్న 136వ వింబుల్డన్ టోర్నీలో ఒకే ఒక్క భారత క్రీడాకారుడు బరిలో నిలువబోతున్నాడు.
లండన్ వేదికగా ఈరోజు ప్రారంభంకానున్న 136వ వింబుల్డన్ టోర్నీలో ఒకే ఒక్క భారత క్రీడాకారుడు బరిలో నిలువబోతున్నాడు.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత పురాతనమైన వింబుల్డన్ గ్రాస్ కోర్ట్ సమర పరంపరలో భాగంగా లండన్ లోని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ లో ఈ రోజు 136వ చాంపియన్షిప్ కు తెరలేవనుంది.
ప్రపంచంలోని విఖ్యాత టెన్నిస్ స్టార్ల నుంచి యువక్రీడాకారుల వరకూ జీవితకాలంలో కనీసం ఒక్కసారి వింబుల్డన్ బరిలో నిలిచినా తమ జన్మధన్యమైనట్లే భావిస్తారు.
వింబుల్డన్ లో విజేతగా నిలవడం కంటే బరిలో నిలిచి కనీసం ఒక్కమ్యాచ్ ఆడినా టెన్నిస్ ప్లేయర్లుగా జీవితకాల అనుభవంగా పరిగణిస్తారు.
వింబుల్డన్ పచ్చిక కోర్టుల్లో 135 సంవత్సరాలుగా..క్రమం తప్పకుండా జరుగుతూ వస్తున్న ఈ టోర్నీ 136వ పడిలోకి అడుగుపెట్టింది.
వింబుల్డన్ తో భారత్ అనుబంధం..
వింబుల్డన్ టెన్నిస్ తో భారత్ కు విడదీయరాని అనుబంధం ఉంది. రామనాథన్ కృష్ణన్, ప్రేమజిత్ లాల్, నరేశ్ కుమార్, విజయ్ అమృత్ రాజ్, రమేశ్ కృష్ణన్, ఆనంద్ అమృత్ రాజ్, లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా, రోహన్ బొపన్నలాంటి క్రీడాకారులకు వింబుల్డన్లో గొప్పఅనుభవాలు, మరపురాని విజయాలే ఉన్నాయి.
వింబుల్డన్ పోటీలు జరుగుతున్నాయంటే చాలు..ఇద్దరూ లేదా ముగ్గురు వరకూ భారత క్రీడాకారులు పాల్గొనటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రస్తుత 2023 వింబుల్డన్లో మాత్రం ఆ ఆనవాయితీ తప్పింది.
పురుషుల, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో 43 సంవత్సరాల రోహన్ బొపన్న మాత్రమే భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలలో భారత క్రీడాకారులకు అవకాశమే లేకుండా పోయింది.
డబుల్స్ లో 11వ ర్యాంకర్ రోహన్...
ప్రపంచ పురుషుల డబుల్స్ లో ప్రస్తుతం 11వ ర్యాంక్ ప్లేయర్ గా ఉన్న వెటరన్ రోహన్ బొపన్న పురుషుల డబుల్స్ లో ఆస్ట్ర్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్ డెన్ తో కలసి పోటీకి దిగనున్నాడు.
రోహన్ బొపన్న సుదీర్ఘ కెరియర్ లో 13వసారి వింబుల్డన్ పోటీలలో పాల్గొనబోతున్నాడు. ప్రస్తుత సీజన్ వింబుల్డన్ బరిలో భారత్ తరపున తాను ఒక్కడినే నిలవటం బాధ కలిగిస్తోందని, భారత క్రీడాకారులు వేర్వేరు విభాగాలలో పోటీకి నిలిస్తే అదే సంతృప్తని చెప్పాడు.
గతంలో భారతజట్టు డేవిస్ కప్ ఫైనల్స్ కు పలుమార్లు చేరుకోగా..పురుషుల సింగిల్స్ లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్ చేరిన రికార్డు సైతం భారత క్రీడాకారులకు ఉంది.
ప్రపంచ టెన్నిస్ సింగిల్స్ లో ప్రస్తుతం భారత్ కు చెందిన ఒక్క క్రీడాకారుడు మాత్రమే 200వ ర్యాంక్ లో ఉంటే..మహిళల సింగిల్స్ లో అంకిత రైనా 197వ ర్యాంకర్ గా కొనసాగుతోంది.
6వ సీడ్ గా రోహన్ జోడీ...
మహిళల సింగిల్స్ క్వాలిఫైయింగ్ రౌండ్లలోనే అంకిత రైనా ఓటమి పొందగా..పురుషుల డబుల్స్ లో రోహన్ బొపన్న- మాథ్యూ ఎబ్ డెన్ జోడీ 6వ సీడ్ గా టైటిల్ వేటకు దిగుతున్నారు.
43 సంవత్సరాల వయసులో వింబుల్డన్ బరిలోకి దిగుతున్న భారత ఏకైక క్రీడాకారుడు తానే కావడం ఇబ్బందిగా ఉందని రోహన్ వాపోతున్నాడు. గత రెండు దశాబ్దాలుగా తాను ప్రపంచ టెన్నిస్ టూర్ లో పాల్గొంటూ వస్తున్నానని, భారత క్రీడాకారులు మాత్రం ఎదుగుబొదుగూ లేకుండా ఉండిపోయారని, రానున్న కాలంలో
భారత్ కు ప్రపంచ స్థాయి టెన్నిస్ ప్లేయర్ల కరువు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని రోహన్ ఆందోళన వ్యక్తం చేశాడు. అండర్ -12, అండర్ -14 స్థాయి నుంచే టెన్నిస్ అభివృద్దికి కృషి చేయాలని సూచించాడు.
ప్రస్తుత వింబుల్డన్ కు తాను శారీరకంగా, మానసికంగా పూర్తిస్థాయిలో సిద్ధమై ఉన్నానని, వింబుల్డన్ తర్వాత అమెరికన్ ఓపెన్ కు సన్నాహాలు ఉంటాయని ప్రకటించాడు.
ఈ రోజు నుంచి రానున్న రెండువారాలపాటు ప్రపంచ టెన్నిస్ అభిమానులకు పసందైన గ్రాస్ కోర్టు విందుగా మారనున్న 136వ వింబుల్డన్ పురుషుల, మహిళల సింగిల్స్ లో యువఆటగాడు కార్లోస్ అస్ కరాజ్, పోలిష్ స్టార్ ఇగా స్వైయిటెక్ టాప్ సీడ్లుగా టైటిల్ వేటకు దిగుతుంటే..సెర్బియన్ థండర్ నొవాక్ జోకోవిచ్ రికార్డుస్థాయిలో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టాడు.