Telugu Global
Sports

బైక్ రేసింగ్ లో 13 ఏళ్ల బాలరైడర్ దుర్మరణం!

ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ లో విషాదం చోటు చేసుకొంది. రేస్ లో పాల్గొంటూ జరిగిన ప్రమాదంలో 13 సంవత్సరాల బాల రేసర్ ప్రాణాలు పోగొట్టుకొన్నాడు.

బైక్ రేసింగ్ లో 13 ఏళ్ల బాలరైడర్ దుర్మరణం!
X

ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ లో విషాదం చోటు చేసుకొంది. రేస్ లో పాల్గొంటూ జరిగిన ప్రమాదంలో 13 సంవత్సరాల బాల రేసర్ ప్రాణాలు పోగొట్టుకొన్నాడు.

గంటకు 300 కిలోమీటర్ల వేగంతో సాగిపోయే మోటార్ బైక్ రేసింగ్ ముక్కుపచ్చలారని ఓ బాలుడి ప్రాణాలు బలితీసుకొంది. ప్రాణాంతక క్రీడగా పేరున్న బైక్ రేసింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, ఆదరణ ఉన్నా బాలల నుంచి పెద్దల వరకూ వివిధ వయసులకు చెందిన బైక్ రైడర్లు ఈ క్రీడలో పాల్గొంటూ విలువైన ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.

హెల్మెట్ జారిపడి శ్రేయస్ దుర్మరణం...

13 సంవత్సరాల వయసుకే దేశంలోనే పేరున్న బైక్ యువరేసర్లలో ఒకడైన కొప్పారం శ్రియాస్‌ హరీశ్‌ దుర్మరణం పాలయ్యాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బాల్యం నుంచి బైక్ రేసింగ్ లో పాల్గొంటూ వస్తున్న ఈ బెంగళూరు బుడతడు జాతీయస్థాయిలో డజనుకు పైగా టైటిల్స్ సాధించాడు. ముక్కుపచ్చలారని వయసులోనే 250 సీసీ బైక్ తో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ గత రెండేళ్లుగా తల్లిదండ్రులను తన విజయాలతో ఓలలాడించిన హరీశ్ ..చివరకు అదే రేస్ ట్రాక్ లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ చాంపియన్షిప్ లో భాగంగా మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో జరిగిన రూకీ రేస్ లో పోల్ పొజిషన్ నుంచి మూడోరౌండ్ రేస్ ప్రారంభించిన హరీశ్ ..ఓ మలుపులో తలపై నుంచి హెల్మెట్ జారిపడిపోడంతో జారిపడ్డాడు. ఆ వెనుక నుంచే వస్తున్న వేరే బైక్ వచ్చి బలంగా ఢీ కొనడంలో తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్సకోసం తరలిస్తున్న సమయంలోనే హరీశ్ ప్రాణాలు కోల్పోయాడు.

హరీశ్ విషాదంతో నిర్వాహకులు మిగిలిన అన్ని రేస్ లనూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యంత ప్రతిభావంతుడైన ఓ బాలరేసర్ ను కోల్పోడం తమకు తీరని బాధను కలిగించిందంటూ మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు అజిత్ థామస్ వాపోయారు.

13వ పుట్టినరోజు జరుపుకొన్న కొద్దిరోజులకే..

బెంగళూరులోని కెన్ శ్రీ స్కూలులో 8వ తరగతి చదువుతున్న కొప్పారం శ్రీయాస్ హరీశ్ కొద్దిరోజుల క్రితమే తన 13వ పుట్టినరోజును వేడుకగా జరుపుకొన్నాడు.

ఎనిమిదేళ్ల చిరుప్రాయం నుంచే బైక్ రేసింగ్ లో పాల్గొంటూ వస్తున్న హరీశ్ 2021 లో స్పెయిన్ వేదికగా జరిగిన మినీ మోటీ జీపీలో పాల్గొని వచ్చాడు. వరుసగా నాలుగు జాతీయస్థాయి టైటిల్స్ సాధించడం ద్వారా హరీశ్ రికార్డుల మోత మోగించాడు.

అంతర్జాతీయ రేసింగ్ లో హరీశ్ కు బాలుడిగానే తమ కుమారుడు సాధిస్తున్న విజయాలు చూసి హరీశ్ తల్లిదండ్రులు మురిసిపోయారు. అంతలోనే అంతులేని విషాదంలో మునిగిపోవాల్సి వచ్చింది.

మలేసియా వేదికగా ఈ నెలలోనే జరిగే అంతర్జాతీయ బైక్ రేసింగ్ 250 సీసీ విభాగంలో హరీశ్ పాల్గొనాల్సి ఉంది. నిబంధనల ప్రకారం 12 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఇండియన్ మోటార్ బైక్ రేసింగ్ క్లబ్ లైసెన్సులు జారీ చేస్తూ వస్తోంది. రేస్ ట్రాక్ ల్లో, కట్టుదిట్టమైన భద్రతా నిబంధనలతో పాటు..పర్యవేక్షణలో మాత్రమే పాల్గొనటానికి ఈ లైసెన్స్ అనుమతి ఇస్తోంది. ఇదే లైసెన్సుతో సాధారణ రోడ్లపై బైక్ లు నడపడానికి అనుమతి లేదని నిర్వాహక సంఘం చెబుతోంది. 18 సంవత్సరాల లోపు వయసున్న బైక్ రైడర్లకు మంజూరు చేయటానికి గల కారణాలను నిర్వాహక సంఘం వివరించింది.

ప్రస్తుత 2023 భారత మోటో జీపీ సీజన్లో ఇది రెండో విషాదం. జనవరిలో జరిగిన రేస్ ప్రమాదంలో 59 సంవత్సరాల కెఇ కుమార్ దుర్మరణం పాలుకాగా..ఎనిమిదిమాసాల వ్యవధిలోనే 13 సంవత్సరాల శ్రీయాస్ హరీశ్ ను మోటో జీపీ పొట్టనపెట్టుకొంది.

First Published:  6 Aug 2023 7:31 AM GMT
Next Story