Telugu Global
Sports

ఆసియాక్రీడల 11వ రోజు భారత్ కు 12 పతకాలు!

గాంగ్జు ఆసియాక్రీడల్లో సైతం భారత స్టార్ అథ్లెట్, బల్లెం విసురుడులో బాహుబలి నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. పోటీల 11వ రోజున భారత్ 12 పతకాలు సొంతం చేసుకొంది.

ఆసియాక్రీడల 11వ రోజు భారత్ కు 12 పతకాలు!
X

గాంగ్జు ఆసియాక్రీడల్లో సైతం భారత స్టార్ అథ్లెట్, బల్లెం విసురుడులో బాహుబలి నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. పోటీల 11వ రోజున భారత్ 12 పతకాలు సొంతం చేసుకొంది.

చైనాలోని గాంగ్జు వేదికగా జరుగుతున్న 19వ ఆసియాక్రీడల్లో భారత పతకాల వేట జోరందుకొంది. పోటీలు ముగియటానికి మరో నాలుగురోజులు మిగిలి ఉండగానే భారత్ రికార్డుస్థాయిలో 81 పతకాలు సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది.

అథ్లెట్లు, ఆర్చర్లు సాధించిన పతకాలతో భారత్ 1951 నుంచి 2018 వరకూ ఏ క్రీడల్లోనూ సాధించని పతకాలను ప్రస్తుత ఆసియాక్రీడల్లో కైవసం చేసుకొని పతకాల పట్టిక 4వ స్థానంలో కొనసాగుతోంది. 18 స్వర్ణ, 31 రజత, 32 కాంస్యాలతో గత క్రీడల రికార్డు 70 పతకాలను తెరమరుగు చేసింది.

జావలిన్ త్రోలో తిరుగులేని నీరజ్...

పురుషుల జావలిన్ త్రో లో భారత జోడీ నీరజ్ చోప్రా, కిశోర్ జెనా మొదటి రెండుస్థానాలలో నిలవడం ద్వారా సంచలనం సృష్టించారు. ఇటీవలే ముగిసిన ప్రపంచ అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్..88.88 మీటర్ల రికార్డుతో ప్రస్తుత ఆసియాక్రీడల్లో సైతం విజేతగా నిలిచాడు. 2018, 2022 ఆసియాక్రీడల్లో జావలిన్ త్రో గోల్డ్ మెడల్ సాధించిన మొనగాడిగా నీరజ్ నిలిచాడు.

భారత్ కే చెందిన కిశోర్ కుమార్ జెనా 87.54 మీటర్ల రికార్డుతో రజత పతకం సాధించాడు.

35 కిలోమీటర్ల రేస్ వాక్ మిక్సిడ్ విభాగంలో భారత రన్నర్లు రాంబాబు- మనురాణి జోడీ కాంస్య పతకం గెలుచుకొన్నారు.

రిలేజట్లకు స్వర్ణ, రజతాలు...

పురుషుల 400 మీటర్ల రిలేలో భారతజట్టు బంగారు పతకం గెలచుకొంది. మహిళల రిలేలో రజతపతకంతో సరిపెట్టుకొంది. మహిళల 800 మీటర్ల పరుగులో హర్మిలన్ బెయిన్స్ , పురుషుల 800 మీటర్ల పరుగులే అవినాశ్ సాబ్లే రజత పతకాలు సాధించారు.

స్క్వాష్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు భారత వెటరన్ స్టార్ సౌరవ్ గోశాల్ చేరుకొన్నాడు. మహిళల బాక్సింగ్ లో లవ్లీన్ బోర్గెయిన్ రజత పతకంతో సంతృప్తి పడాల్సి వచ్చింది.

ఆర్చరీ మిక్సిడ్ విభాగంలో స్వర్ణం...

విలువిద్య కాంపౌండ్ విభాగం మిక్సిడ్ డబుల్స్ బంగారు పతకాన్ని భారతజోడీ జ్యోతి సురేఖ వెన్నం- ఓజాస్ దేవ్ తాలే జోడీ గెలుచుకొన్నారు. పురుషుల కుస్తీ గ్రీకో-రోమన్ విభాగంలో భారత వస్తాదు సునీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. మహిళల బాక్సింగ్ 57 కిలోల విభాగంలో ప్రవీణ్ హుడాకు కాంస్య పతకం దక్కింది.

కబడ్డీ పురుషుల, మహిళల విభాగాల గ్రూప్ మ్యాచ్ ల్లో భారతజట్లు విజయాలు నమోదు చేశాయి.

పురుషుల గ్రూప్- ఏ లీగ్ మ్యాచ్ లో 7సార్లు గోల్డ్ మెడలిస్ట్ భారత్ 55-18తో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. మహిళల పోరులో భారత్ 56-23 పాయింట్లతో దక్షిణ కొరియాపై విజయం సాధించింది.

ఆసియాక్రీడల చివరి నాలుగురోజుల పోటీలలో భాగంగా చదరంగం, విలువిద్య, క్రికెట్, హాకీ, కుస్తీ అంశాలలో భారత్ మరిన్ని బంగారు పతకాలు గెలుచుకొనే అవకాశాలున్నాయి.

పురుషుల క్రికెట్ ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ పోరులో బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది.

First Published:  5 Oct 2023 10:59 AM IST
Next Story