యూపీఐ లైట్ నుంచి త్వరలో 'విత్ డ్రా' ఆప్షన్
ఖాతాలో డబ్బులు జమ చేసే సదుపాయం మాత్రమే ఉన్నది. ఉపసంహరించుకొనే అవకాశం లేకపోవడంతో ఈ ఆలోచన

చిన్నమొత్తాల్లో చేసే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన యూపీఐ లైట్ సేవలు వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ఈ సేవలను మరింత మెరుగుపరచడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ ) సిద్ధమైంది. ఇప్పటివరకు అందుబాటులో లేని బ్యాలెన్స్ 'విత్ డ్రా' ఆప్షన్‌ను యూపీఐ లైట్‌లో తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ పేమెంట్స్ చేయడానికి యూపీఐ లైట్ సేవలు సహకరిస్తాయి. ఇది 'వన్ వే' సేవ. అంటే ఈ ఖాతాలో డబ్బులు జమ చేసే సదుపాయం మాత్రమే ఉంటుంది. దాన్ని ఉపసంహరించుకొనే అవకాశం ఉండదు. ఒకవేళ ఆ అకౌంట్‌లోనిధుల్ని ఉపసంహరించుకోవాలనుకుంటే యూపీఐ లైట్ ఖాతాను నిలిపివేయాల్సిందే. మరో మార్గం లేదు. ఇకపై ఆ సమస్య లేకుండా సొమ్మును విత్ డ్రా చేసుకునే సదుపాయం రానున్నది. త్వరలో ఈ సేవను తీసుకురావడానికి ఎన్‌పీసీఐ సిద్ధమౌతున్నది. నగదు విత్ డ్రాకు వీలు కల్పించాలని పేర్కొంటూ బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాసింది. మార్చి 31 నాటికి నగదు విత్ డ్రా కోసం 'ట్రాన్స్‌ఫర్ అవుట్' ఆప్షన్ అందుబాటులోకి రానున్నదని సమాచారం.