Telugu Global
Science and Technology

మానవాళి అంతం ఎప్పుడో కనిపెట్టిన సైంటిస్టులు!

భూమిపై రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడి మరింత పెరిగి ఏదో ఒకరోజు పూర్తిగా జీవరాశి అంతమవుతుందని సైంటిస్టులు అంచనా వేశారు.

మానవాళి అంతం ఎప్పుడో కనిపెట్టిన సైంటిస్టులు!
X

మానవాళి అంతం ఎప్పుడో కనిపెట్టిన సైంటిస్టులు!

భూమిపై రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడి మరింత పెరిగి ఏదో ఒకరోజు పూర్తిగా జీవరాశి అంతమవుతుందని సైంటిస్టులు అంచనా వేశారు. అంతేకాదు, భూమిపై జీవుల మనుగడ పూర్తిగా అంతరించేందుకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో కూడా లెక్కగట్టారు.

ఈ భూమిపై జీవం పూర్తిగా అంతరించేందుకు సుమారు 25 కోట్ల సంవత్సరాల సమయం పడుతుందని సైంటిస్టులు అంచనా వేశారు. ఈ భూమిపై మనం చెప్పుకుంటున్న ఏడు ఖండాలు ఒకప్పుడు కలిసి ఉండేవట. దాన్నే ‘పాంజియా’ అనే వాళ్లు. అవి క్రమంగా జరుగుతూ ఇప్పుడున్న ఏడు ఖండాలుగా ఏర్పడ్డాయి. అయితే 25 కోట్ల ఏళ్ల తర్వాత మళ్లీ ఖండాలన్నీ కలిసి సూపర్ కాంటినెంట్‌గా మారుతుందని ‘యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌’ సైంటిస్టులు చేసిన అధ్యయనంతో తేలింది.

ఖండాలన్నీ ఒకేచోటకు వచ్చినప్పుడు ఏర్పడే సూపర్‌ కాంటినెంట్‌ను ‘పాంజియా అల్టీమా’ అంటారు. ఇది జరిగే సమయానికి భూమిపై జీవులు తట్టుకోలేనంత వేడి, ఉష్ణోగ్రతలు ఉంటాయని, ఆ పరిస్థితుల్లో ఇక భూమిపై జీవరాశి మనుగడ సాధ్యం కాదని ‘యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌’ సైంటిస్టులు అంచనావేశారు. అప్పటికి భూమి సగటు ఉష్ణోగ్రత 70 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండొచ్చట. కాబట్టి 40 నుంచి 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల్ని భరించే జీవులు మాత్రమే ఆ పరిస్థితుల్లో మనుగడ సాగించగలవట. ఒకవేళ భూమిపై గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగితే 25 కోట్ల సంవత్సరాల కంటే ముందే జీవరాశి అంతమవుతుందని అంటున్నారు సైంటిస్టులు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాలుష్యాన్ని తగ్గించాలని, భూమిపై చెట్లు ఎక్కువగా ఉండేలా చూడాలని సైంటిస్టులు చెప్తున్నారు.

ఇదిలా ఉండగా భూమిపై ఎనిమిదో ఖండం వెలుగులోకి వచ్చినట్టు కనుగొన్నారు మరో అధ్యయనంలో. దాదాపు 365 ఏళ్లుగా కనిపించకుండా సముద్రపు అడుగున దాక్కుని ఉన్న ఓ కొత్త ఖండం గురించి ‘టెక్టోనిక్స్‌ జర్నల్‌’లో ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ కొత్త ఖండం న్యూజిలాండ్‌ ద్వీపానికి పశ్చిమతీరంలో క్యాంప్‌బెల్‌ పీఠభూమి సమీపంలో ఉందట. దీనికి ‘జిలాండియా’ లేదా ‘టెరియు-ఎ-మౌయి’ అని పిలుస్తారు. ఇది సుమారు ఐదు మిలియన్‌ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుందట. సైంటిస్టులు దీనికి సంబంధించిన మ్యాప్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ భూభాగం పూర్తిగా సముద్రంలో మునిగి ఉండడంతో దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి దాని పుట్టుకను తెలుకోవాల్సి ఉందని చెప్తున్నారు.

First Published:  29 Sept 2023 2:00 PM IST
Next Story