కొత్త ఏడాదిలో రానున్న కొత్త టెక్నాలజీలివే..
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. అయితే సమయంతోపాటే టెక్నాలజీ కూడా అప్‌డేట్ అవుతూ వస్తుందని మనకు తెలుసు.
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. అయితే సమయంతోపాటే టెక్నాలజీ కూడా అప్‌డేట్ అవుతూ వస్తుందని మనకు తెలుసు. ఈ క్రమంలో వచ్చే ఏడాది కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ ట్రెండ్స్‌ను మనం చూడబోతున్నాం. అవేంటంటే..
మెరుగైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వరకూ బోలెడు కొత్త టెక్నాలజీలను 2024లో ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 2024లో ఏయే టెక్నాలజీలను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే..
జనరేటివ్ ఏఐ
వచ్చే ఏడాది ఏఐలో చాలారకాల అప్‌డేట్స్‌ను ఆశించొచ్చు. ముఖ్యంగా రోజువారీ జీవితంలో ఉపయోగపడేవిధంగా జనరేటివ్ ఏఐ మోడల్స్ 2024లో డెవలప్ అవ్వనున్నాయి. ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, కమ్యూనికేషన్.. ఇలా కార్పొరేట్ సొల్యూషన్స్ నుంచి చేతికి పెట్టుకునే స్మార్ట్ వాచీ వరకూ అన్ని పరికరాల్లో ఏఐ మోడల్స్ అందుబాటులోకి వస్తాయి.
క్వాంటమ్ కంప్యూటింగ్
సాంప్రదాయ కంప్యూటర్ పనితీరుకి భిన్నంగా సరికొత్త క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీపై ఎప్పట్నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది ఇవి ఒక తుదిరూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి కంప్యూటర్లు డేటాను బైనరీ బిట్ల రూపంలోకి మార్చుకుని పనిచేస్తాయి. అంటే ‘1’ లేదా ‘0’ రూపంలో మాత్రమే డేటాను రీడ్ చేయగలవు. కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ దీనికి పూర్తిగా భిన్నం. ఇవి డేటాను క్యూబిట్ల రూపంలోకి కన్వర్ట్ చేసుకుని పనిచేస్తాయి. అంటే ఒకేసమయంలో డేటాను రెండు రూపాలుగా రీడ్ చేయగలవు. ఇప్పటి కంప్యూటర్ల కంటే పది లక్షల రెట్లు ఎక్కువ వేగంతో పనిచేయగల సామర్థ్యం వీటి సొంతం.
ఇంటర్నెట్ ఆఫ్ బిహేవియర్
డేటాను మానవ ఆలోచనా తీరుతో ముడిపెట్టే టెక్నాలజీ ఇది. ఇది ఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అయినప్పటికీ వీటికి సంబంధించిన కొన్ని టూల్స్ వచ్చే ఏడాది అందుబాటులోకి రావొచ్చు. ఇవి మనిషి ఆలోచనను గ్రహించి దానికి తగ్గట్టుగా డివైజ్‌లకు సిగ్నల్స్ ఇస్తాయి. ఉదాహరణకు చేతికి కొన్ని టూల్స్ ధరించడం ద్వారా మెదడు సిగ్నల్స్‌ను ఆ డివైజ్ రీడ్ చేస్తుంది. మనసులో ‘ఏసీ ఆఫ్ చేయాలి’ అనిపించిన వెంటనే ఆటోమేటిక్‌గా గదిలో ఏసీ ఆఫ్ అవుతుందన్న మాట.
అటానమస్ వెహికల్స్
ఫ్యూచర్‌లో డ్రైవర్లు లేకుండానే వాహనాలు నడుస్తాయని నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే ఈ కార్లు వాటంతట అవే ఇతర కార్లతో కమ్యూనికేట్ చేసుకుంటూ సేఫ్‌గా డ్రైవ్ చేయగలిగే టెక్నాలజీలను 2024లో మనం చూడొచ్చు.
ఇక వీటితోపాటు 2024 లో స్మార్ట్ హోమ్స్ టెక్నాలజీలను మనం చూడొచ్చు. ఇంట్లోని పరికరాలన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి పనిచేసే టెక్నాలజీలు రాబోతున్నాయి. అలాగే 2024లో 5జీ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన రీసెర్చ్‌లు, కోర్సులు అందుబాటులోకి వస్తాయి. మరిన్ని ఎక్కువ ఏఐ సైబర్ స్కామ్‌లకు కూడా స్కోప్ ఉంది. వాటికి సంబంధించిన ఏఐ చట్టాల వంటివి కూడా 2024 లో ఆశించొచ్చు.