Telugu Global
Science and Technology

డిజీలాకర్ ఎలా వాడాలో తెలుసా?

గుర్తింపు కార్డులు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను జేబులో పెట్టుకుని తిరగడం కుదిరేపని కాదు, కొన్ని సార్లు అవి పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వీటిని డిజిటల్‌గా భద్రపరిచుకునేందుకు ప్రభుత్వం ‘డిజీలాకర్’ అనే సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది.

డిజీలాకర్ ఎలా వాడాలో తెలుసా?
X

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకుకి వెళ్లినప్పుడు పాన్ కార్డ్, హోటల్ కు వెళ్లినప్పుడు ఆధార్.. ఇలా రకరకాల సందర్భాల్లో రకరకాల గుర్తింపు కార్డులు, డాక్యుమెంట్లు అవసరమవుతాయి. అయితే వీటిని ప్రతిసారీ ఫిజికల్‌గా క్యారీ చేసే అవసరం లేకుండా ‘డిజీలాకర్’ అనే యాప్‌లో డిజిటల్‌గా దాచుకోవచ్చు. దీన్నెలా వాడాలంటే..

గుర్తింపు కార్డులు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను జేబులో పెట్టుకుని తిరగడం కుదిరేపని కాదు, కొన్ని సార్లు అవి పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వీటిని డిజిటల్‌గా భద్రపరిచుకునేందుకు ప్రభుత్వం ‘డిజీలాకర్’ అనే సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. కానీ, గణాంకాల ప్రకారం చూస్తే దీన్ని వాడేవాళ్లు తక్కువే అని తెలుస్తోంది. ఇప్పటికీ లైసెన్స్ ఇంట్లో మర్చిపోయి రకరకాల ఇక్కట్లు పడుతున్నవాళ్లున్నారు. ఎంతో ఈజీగా వాడుకోగలిగే ఈ డిజీలాకర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

డిజీలాకర్ అనేది యాప్, ఆన్‌లైన్ సైట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మీ పదో తరగతి సర్టిఫికేట్ నుంచి ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడెంటిటీ కార్డులు, ఇన్సూరెన్స్ ఫామ్స్‌, ఇన్‌కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు వంటి అన్ని రకాల ప్రభుత్వ డాక్యుమెంట్లను సేఫ్‌గా దాచుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచైనా ఈజీగా యాక్సెస్‌ చేయొచ్చు.

వాడుకోవడం ఈజీనే.

డిజీలాకర్‌‌ను వాడుకోవడం ఎంతో ఈజీ. ముందుగా ఫోన్ లో ప్లేస్టోర్ లోకి వెళ్లి డిజీ లాకర్ అనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి పేరు, పుట్టిన తేదీ, ఇ–మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ వంటి వివరాలు ఎంటర్‌ చేసి, ఒక సెక్యూరిటీ పిన్‌ను పెట్టుకోవాలి. ఆ తర్వాత మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేస్తే యాప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.

యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత అందులో రకరకాల సర్టిఫికేట్లు జత చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో కింద ఉన్న సెర్చ్‌ బార్ పై క్లిక్‌ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్‌ ను చెక్ చేసుకోవచ్చు. యూనివర్సిటీని ఎంచుకుని హాల్ టికెట్ నెంబర్, పాస్ అయిన సంవత్సరం ఎంటర్ చేస్తే.. మీ డాక్యుమెంట్లు కనిపిస్తాయి. అలాగే పాన్, రేషన్ కార్డుల వంటివి కూడా సెర్చ్ చేసి డిజీలాకర్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న కార్డులన్నీ డిజిలాకర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

డిజీలాకర్‌లో కేవలం గవర్నమెంట్ డాక్యుమెంట్సే కాదు, మీకు అవసరమయ్యే ఇతర డాక్యుమెంట్లను కూడా మాన్యువల్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో 1 జీబీ వరకూ క్లౌడ్‌ డేటా లభిస్తుంది. దాన్ని పూర్తిగా వాడుకోవచ్చు.

ఇక ఎప్పుడైనా పోలీసులు లైసెన్స్ అడిగినా, బ్యాంకులో పాన్ కార్డు అడిగినా, ప్రయాణ టికెట్ల కోసం ఆధార్ కావాల్సి వచ్చినా యాప్ ద్వారా వాటిని యాక్సె్స్ చేయొచ్చు. మొబైల్ లేనప్పుడు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి కూడా మీ డాక్యుమెంట్లు పొందొచ్చు. అలాగే మీ అకౌంట్‌ను యాక్సెస్ చేయడం కోసం మీరు నామినీని కూడా ఎంచుకోవచ్చు.

First Published:  27 April 2024 10:00 AM IST
Next Story