ఓటీపీ చెప్పకుండానే అకౌంట్ ఖాళీ.. కొత్త తరహా మిస్డ్ కాల్ స్కామ్!
ఈ మధ్యకాలంలో సైబర్ స్కామ్‌లు ఎక్కువ అవుతున్నాయి. రకరకాల పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేసి మోసం చేస్తున్నారు. అయితే తాజాగా మరో కొత్త రకం స్కామ్ వెలుగులోకి వచ్చింది.
ఈ మధ్యకాలంలో సైబర్ స్కామ్‌లు ఎక్కువ అవుతున్నాయి. రకరకాల పద్ధతుల్లో సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల వేసి మోసం చేస్తున్నారు. అయితే తాజాగా మరో కొత్త రకం స్కామ్ వెలుగులోకి వచ్చింది. మీకు తెలియకుండానే మీ సిమ్ కార్డుని యాక్సెస్ చేసే ఈ స్కామ్ ఎలా ఉంటుందంటే.
తాజాగా జరిగిన ఓ సైబర్ స్కామ్ కేసుని పరిశీలిస్తే.. ఓ మహిళకు ఒక వ్యక్తి కాల్ చేసి కొరియర్ వచ్చిందని నమ్మించి ఇంటి అడ్రస్, ఇతర వ్యక్తిగత వివరాలు, డబ్బు రిటర్న్ చేయడం కోసం బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించాడు. ఆ తర్వాత గుర్తు తెలియని నెంబర్ నుంచి పదుల కొద్దీ మిస్డ్ కాల్స్, మెసేజెస్ వచ్చేవి. అమె విసిగిపోయి మొబైల్‌ను పట్టించుకోకుండా వదిలేసింది. ఆ తర్వాతి రోజు ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు ఖాళీ అయింది. సుమారు లక్షన్నర వరకూ పోయిందని సదరు మహిళ కంప్లెయింట్ ఇచ్చింది. అయితే ఎలాంటి లింక్ క్లి్క్ చేయకుండా, ఓటీపీ లాంటివి షేర్ చేయకుండానే ఈ స్కామ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతకీ ఈ స్కామ్‌లో జరిగిందేంటంటే.
మొబైల్ నెంబర్, అడ్రెస్, ఇతర పర్సనల్ వివరాలతో పాటు స్కామర్లు సదరు వ్యక్తి ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు వివరాలు కూడా సేకరిస్తారు. మొబైల్ నెంబర్ అడ్రెస్ వివరాల సాయంతో నకిలీ ఆధార్ కార్డు క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత మల్టిపుల్ మిస్డ్ కాల్స్, మెసేజ్‌లు పంపి మొబైల్‌ను పక్కనపెట్టేలా లేదా స్విచాఫ్ చేసేలా విసిగిస్తారు. ఆ టైంలో నకిలీ ఆధార్ కార్డు సాయంతో ఆ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ ఆఫీసుకు వెళ్లి సిమ్ పోయిందని కంప్లెయింట్ చేస్తారు. అలా సేమ్ నెంబర్‌తో డూప్లికేట్ సిమ్ పొందుతారు. మొబైల్‌ను పక్కన పెట్టడం లేదా స్విచాఫ్ చేయడం వల్ల సదరు వ్యక్తి మొబైల్ నెట్‌వర్క్ ఆఫ్ అయిన సంగతి తెలుసుకోలేడు. ఈ లోపు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఓటీపీ వంటి వివరాలు కొత్త సిమ్ పొందిన స్కామర్‌కు చేరతాయి. అలా సిమ్ స్వాపింగ్ ద్వారా తెలియకుండానే మోసం జరిగిపోతుంది.
ఈ సిమ్ స్వాపింగ్ స్కామ్ ద్వారా చాలామంది డబ్బు కోల్పోయినట్టు రిపోర్ట్‌లు చెప్తున్నాయి. ఈ స్కామ్‌లో మీ మొబైల్ నెంబర్‌పై వేరొకరు సిమ్ తీసుకుంటారు. దాంతో మీ సిమ్ మీది కాకుండా పోతుంది. ఇలా జరగకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
జాగ్రత్తలు ఇలా..
ఎవరు కాల్ చేసి అడిగినా బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వకూడదు. అలాగే పదుల కొద్దీ మిస్డ్ కాల్స్ వస్తుంటే అది స్కామర్ల పనిగా గుర్తించాలి. ఆ టైంలో ఫోన్ పక్కన పడేయకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంపై మొబైల్ ఆపరేటర్‌కు కంప్లెయింట్ చేయాలి. ఫోన్ ఎట్టిపరిస్థితుల్లో స్విచాఫ్ చేయొద్దు.
ఒకవేళ సిమ్ కార్డ్ లాక్ అయినట్టు లేదా బ్లాక్ అయినట్టు గుర్తించినా.. ఉన్నట్టుండి నెట్‌వర్క్ పోయినా వెంటనే మరో నెంబర్‌తో మొబైల్ ఆపరేటర్‌కు కంప్లెయింట్ ఇచ్చి నెంబర్‌ను బ్లా్క్ చేయమని కోరాలి. వెంటనే బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్‌లు మార్చాలి. అవసరమైతే ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలను టెంపరరీగా బ్లాక్ చేయాలి. డబ్బు పోయినట్టు గుర్తిస్తే వెంటనే బ్యాంక్ వాళ్లకు, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.