Telugu Global
Science and Technology

దేశంలో హైస్పీడ్‌ రైళ్లు రాబోతున్నాయి

గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారన్న రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

దేశంలో  హైస్పీడ్‌ రైళ్లు రాబోతున్నాయి
X

దేశంలో త్వరలో హైస్పీడ్‌ రైళ్లు రాబోతున్నాయని, దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. బీఈఎంఎల్‌తో కలిసి చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఈ రైళ్ల డిజైన్‌, తయారీ కొనసాగుతున్నదని రైల్వే మంత్రి తెలిపారు. బీజేపీ ఎంపీ సుధీర్‌ గుప్తా అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

వందేభారత్‌ రైళ్లు విజయవంతమైన నేపథ్యంలో మేకిన్‌ ఇండియా స్ఫూర్తితో హైస్పీడ్‌ రైళ్ల తయారీ చేపట్టినట్లు వైష్ణవ్‌ తెలిపారు. దీనికోసం ఒక్కో కార్‌కు (బోగీ) ట్యాక్సులు మినహాయించి రూ. 28 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇతర బోగీలతో పోలిస్తే ఈ ఖర్చు ఎక్కువని పేర్కొన్నారు. అయితే, హైస్పీడ్‌ రైళ్ల సెట్ల తయారీ సంక్లిష్టమని, టెక్నికల్‌ అంశాలు అందులో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు.

సాధారణ రైళ్లతో పోలిస్తే వీటి ఏరోడైనమిక్‌ భిన్నంగా ఉంటాయని వైష్ణవ్‌ చెప్పారు. గాలి చొచ్చుకోవడానికి వీలులేకుండా బాడీ ఉంటుందన్నారు. మొత్తం అన్నీ చైర్‌ కార్సే ఉంటాయన్నారు. అత్యాధునిక ఫీచర్లు ఉంటాయని పేర్కొన్నారు. ఆటోమేటిక్‌ డోర్స్‌, బోగీకి బోగికి మధ్య అనుసంధానం, బైటి వాతావరణానికి అనుగుణంగా బోగీ లోపలి పరిస్థితులు, సీసీ టీవీ, మొబైల్‌ ఛార్జింగ్‌ సౌకర్యం, ఫైర్‌ సేఫ్టీ పరికరాలు ఉంటాయని పేర్కొన్నారు. డిజైన్‌ పూర్తయ్యాక ప్రాజెక్టు పూర్తి చేయడానికి అయ్యే ఖర్చుపై ఓ అవగాహన వస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

First Published:  27 Nov 2024 6:21 PM IST
Next Story