మనిషి మెదడులో చిప్.. పరిశోధనల కోసం ఎలాన్ మస్క్‌కు గ్రీన్‌సిగ్నల్
న్యూరాలింక్ డివైస్ పరీక్షలకు సిద్ధంగా ఉందని గత ఏడాది డిసెంబర్‌లోనే మస్క్ వెల్లడించారు. పందులు, కోతులపై ప్రయోగాల తరువాత క్లినికల్ ట్రయల్స్ చేయాలని భావించాడు.
నేరుగా మనుషుల మెదడులోకి చిప్‌ని ప్రవేశపెట్టే ప్రయోగాలకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు అనుమతి లభించింది. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్లతో లింక్ చేయడమే ఈ ప్రయోగం ఉద్దేశం. అమెరికా ప్రభుత్వ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) నుంచి ఈ అనుమతి లభించిందంటూ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తొలి హ్యూమన్ క్లినికల్ స్టడీకి ఆమోదం లభించిందని తెలిపేందుకు సంతోషిస్తున్నామని న్యూరాలింక్ ట్వీట్ చేసింది. ఆసక్తి ఉన్నవారిని వలంటీర్లుగా ఎంపిక చేసి ప్రయోగాలు చేపట్టనున్నట్టు తెలిపింది. తొలుత కోతుల మెదడులో ఈ చిప్ అమర్చి ప్రయోగాలు చేశారు. ఆ ఫలితాలతో రూపొందించిన నివేదికను న్యూరాలింక్ కంపెనీ ఎఫ్‌డీఏ ముందు ఉంచింది. వాటిని పరిశీలించిన ఆ సంస్థ బ్రెయిన్ చిప్ వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో తాజా అనుమతి లభించింది.
న్యూరాలింక్ డివైస్ పరీక్షలకు సిద్ధంగా ఉందని గత ఏడాది డిసెంబర్‌లోనే మస్క్ వెల్లడించారు. పందులు, కోతులపై ప్రయోగాల తరువాత క్లినికల్ ట్రయల్స్ చేయాలని భావించాడు. కానీ 2023 మార్చిలో, భద్రతా ప్రమాదాల రీత్యా మానవ మెదడులో చిప్‌ను అమర్చే ప్రయోగాలపై న్యూరాలింక్ అభ్యర్థనను ఎఫ్‌డీఏ తిరస్కరించింది.
పక్షవాతం, అంధత్వం వంటి తీవ్రమైన వ్యాధులకు బ్రెయిన్ చిప్ ద్వారా చికిత్స సుసాధ్యమవుతుందని న్యూరాలింక్ విశ్వసిస్తోంది. మెదడు ఇంప్లాంట్ మానవ పరీక్షల కోసం 2019 నుంచి మస్క్ వెయిట్ చేస్తున్నారు. ఏఐని తీవ్రంగా వ్యతిరేకించే మస్క్ దాన్ని ఎదుర్కోవడానికే న్యూరాలింక్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఏఐని అధిగమించేలా మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చెబుతున్న సంగతి తెలిసిందే.
న్యూరాలింక్ అనే న్యూరో టెక్నాలజీ కంపెనీని మస్క్ 2016లో స్థాపించాడు. మానవ మెదడు, కంప్యూటర్లు లేదా ఇతర బాహ్య పరికరాల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండేలా ఇంప్లాంటబుల్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ ప్లేస్‌లను అభివృద్ధి చేయడం దీని ప్రాథమిక లక్ష్యం. మానవ మేధస్సును కృత్రిమ మేధస్సుతో విలీనం చేయడం ద్వారా మానవ జ్ఞానాన్ని మెరుగుపరచడం, నాడీ సంబంధిత రుగ్మతలను సమర్థవంతంగా ఎదుర్కోవడం దీని లక్ష్యం.