Telugu Global
Science and Technology

స్మార్ట్ ఫోన్‌కు పోటీనిచ్చేలా ఏఐ డివైజ్.. దీని స్పెషాలిటీ ఏంటంటే..

టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్‌ను రారాజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించడమే కష్టం. అయితే తాజాగా రూపొందించిన ఓ కొత్త డివైజ్.. ఏకంగా మొబైల్‌కు ఆల్టర్నేటివ్‌గా నిలువనుంది.

స్మార్ట్ ఫోన్‌కు పోటీనిచ్చేలా ఏఐ డివైజ్.. దీని స్పెషాలిటీ ఏంటంటే..
X

టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్‌ను రారాజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేని ప్రపంచాన్ని ఊహించడమే కష్టం. అయితే తాజాగా రూపొందించిన ఓ కొత్త డివైజ్.. ఏకంగా మొబైల్‌కు ఆల్టర్నేటివ్‌గా నిలువనుంది. ప్రస్తుతం టెక్ వర్గాల్లో దీనిపైనే చర్చలు నడుస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్లకు చెక్ పెట్టేలా ఓ కొత్త ఏఐ డివైజ్ మార్కెట్లోకి వచ్చింది. అదే ఏఐ పిన్. ‘హ్యూమేన్’ అనే కంపెనీ దీన్ని రూపొందించింది. యాపిల్ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగులు దీన్ని స్థాపించారు. ‘హ్యూమేన్ ఏఐ పిన్’.. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇదెలా పనిచేస్తుందంటే..

హ్యూమేన్ కంపెనీ రూపొందించిన ‘ఏఐ పిన్’ కేవలం రెండు అంగుళాల సైజులో ఉంటుంది. దీన్ని షర్ట్ లేదా డెస్క్.. ఎక్కడైనా క్లిప్‌లా పెట్టుకోవచ్చు. ఈ డివైజ్‌కు డిస్ ప్లే స్క్రీన్ ఉండదు. కానీ, ఇది ప్రొజెక్షన్ ద్వారా వివరాలను డిస్‌ప్లే చేయగలదు.

ఏఐ పిన్.. మొబైల్ చేసే అన్ని పనులు చేయగలదు. ఫోన్ కాల్స్, మెసేజెస్, నోట్స్, కెమెరా, బ్రౌజింగ్.. వంటి అన్ని పనులు ఇందులో చేసుకోవచ్చు. అంతేకాదు వాయిస్ కమాండ్స్‌తో దీన్ని సింపుల్‌గా ఆపరేట్ చేయొచ్చు. ఇందులో ఉండే ప్రొజెక్టర్.. కావల్సిన సమాచారాన్ని చిన్న సైజులో డిస్‌ప్లే చేస్తుంది. అరచేతినే ప్రొజెక్టర్‌‌గా వాడుకోవచ్చు. అరచేతిపై ట్యాప్ చేసి తగిన ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇందులో ఉండే 13ఎంపీ కెమెరా మంచి ఫోటోలు క్లిక్ మనిపించగలదు.

ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ అడిక్షన్‌ను తగ్గించడం కోసమే ఈ డివైజ్‌ను రూపొందించినట్టు ‘హ్యూమేన్’ సంస్థ ఫౌండర్లు చెప్తున్నారు. ఏఐ పిన్.. రోజువారీ పనులను మరింత సులభంగా, క్షణాల్లో చక్కపెట్టగలదని, ఇదొక వేరబుల్ స్మార్ట్ ఫోన్ వంటిదని చెప్తు్న్నారు. ఈ ఏఐ పిన్ డివైజ్.. 34 గ్రాముల బరువు ఉంటుంది. ‘కాస్మోస్’ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌‌పై పని చేస్తుంది. ఇది చాట్ జీపీటీ, బింగ్ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

ఏఐ పిన్ డివైజ్ ధర 699 డాలర్లు ఉంది. నెలకు 24 డాలర్లు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ సేవలు పొందొచ్చు. అయితే ఏఐ పిన్‌ను సొంతం చేసుకోవాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. ప్రస్తుతానికి ప్రీఆర్డర్లు మొదలయ్యాయి.

First Published:  24 Nov 2023 10:15 AM IST
Next Story