రీసెంట్‌గా వచ్చిన ఈ మాల్వేర్స్ తో జాగ్రత్త!
సైబర్ నేరాలు, మాల్వేర్ అటాక్‌లు విచ్చలవిడిగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఇంటర్నెట్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల పేర్లతో కొత్తకొత్త మాల్వేర్‌లు ఇంటర్నెట్ లోకి ప్రవేశిస్తున్నాయి.
సైబర్ నేరాలు, మాల్వేర్ అటాక్‌లు విచ్చలవిడిగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఇంటర్నెట్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల పేర్లతో కొత్తకొత్త మాల్వేర్‌లు ఇంటర్నెట్ లోకి ప్రవేశిస్తున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు వీటి గురించి తెలుసుకుంటూ జాగ్రత్తపడాలి.
మాల్వేర్ అంటే ఒకరకమైన కంప్యూటర్ వైరస్. ఇవి ల్యాప్‌టాప్ లేదా పీసీలోకి చొరబడి యూజర్ల డేటాను దొంగలిస్తుంటాయి. తాజా అప్‌డేట్స్ ప్రకారం కొత్తగా మూడు రకాల మాల్వేర్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని పాతవీ ఉన్నాయి. వీటికి డార్క్ గేట్, ఎమోటెట్, లోకిబాట్ అనే పేర్లు పెట్టారు. ఇవి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లు. ఇవి సాఫ్ట్‌వేర్ ఫైల్స్, ఇ–మెయిల్స్ ద్వారా సిస్టమ్‌లోకి ప్రవేశించి వేగంగా డేటాను హ్యాక్ చేయగలవు.
వీటిలో డార్క్ గేట్ మాల్వేర్ అనేది జూన్ నెలలో బయటపడింది. ఇది విండోస్ సెక్యూరిటీ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అలాగే యూజర్ల బ్రౌజింగ్ హిస్టరీని కూడా సులభంగా దొంగిలించగలదు. ఇది సాఫ్ట్‌వేర్ ఫైల్స్ నుంచి ఎంటర్ అవుతుంది. ఇక ఎమోటెట్ మాల్వేర్ విషయానికొస్తే ఇది పాత మాల్వేర్ అయినప్పటికీ తాజాగా ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. ఇది కొన్నిరకాల బ్రౌజర్ ద్వారా కొన్ని ఫేక్ వెబ్‌సైట్స్ నుంచి సిస్టమ్‌లోకి ఎంటర్ అయ్యి హానికరమైన ఫైల్స్‌ను ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేస్తుంది. అలాగే లోకిబాట్ మాల్వేర్ కూడా పాతదే అయినప్పటికీ రీసెంట్‌గా మళ్లీ ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ సంస్థలు గుర్తించాయి. ఇది కూడా బ్రౌజర్ నుంచే ఎంటర్ అవుతుంది. ఇది సిస్టమ్ డేటాను ఈజీగా దొంగలించగలదు.
జాగ్రత్తలు ఇలా..
ఇలాంటి మాల్వేర్స్ సిస్టమ్‌లోకి చొరబడకూడదంటే మంచి ఇంటర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్స్ వాడాలి. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. ఇవి ఎక్కువగా బ్రౌజర్ నుంచి ఎంటర్ అవుతున్నాయి. కాబట్టి బ్రౌజర్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా గమనిస్తుండాలి. అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. గుర్తు తెలియని మెయిల్స్‌లో ఉండే లింక్స్‌ను ఓపెన్ చేయకూడదు. మాల్వేర్ ఎంటర్ అయినట్టు అనుమానం వస్తే వెంటనే సిస్టమ్‌ను ఫార్మాట్ చేయించడం మంచిది.