పచ్చని పంటకు బుల్లి డ్రోన్లు - ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం ప్రణాళిక
రానున్న రోజుల్లో బుల్లి డ్రోన్లను అభివృద్ధి చేసి వ్యవసాయంలో వినియోగించేలా కృషి చేస్తోంది. వీటి బరువు కేవలం 10 గ్రాముల వరకు తగ్గించే ప్రయత్నం చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
డ్రోన్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పుల దిశగా ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం ముందుకు సాగుతోంది. రానున్న రోజుల్లో బుల్లి డ్రోన్లను అభివృద్ధి చేసి వ్యవసాయంలో వినియోగించేలా కృషి చేస్తోంది. వీటి బరువు కేవలం 10 గ్రాముల వరకు తగ్గించే ప్రయత్నం చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని వినియోగించడంతో పాటు రైతులనే డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దే బాధ్యతను ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టింది. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీని ఎరువులు, విత్తనాలు వెదజల్లేందుకు మాత్రమే వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి రైతులకు అన్ని దశల్లోనూ వ్యవసాయ పనులు చేసిపెట్టేలా డ్రోన్లను రూపొందించేందుకు ఎన్‌జీ రంగా వర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
అరచేతిలో ఇమిడిపోయేలా...
వ్యవసాయ రంగంలో 45 కిలోల వరకు బరువు గల ప్రైవేటు డ్రోన్లు గతంలో సేవలందించేవి. ఆయిల్ ఇంజిన్ సహాయంతో నడిచే ఈ డ్రోన్ల వల్ల ఎక్కువ శబ్దంతో పాటు బరువు కారణంగా వినియోగంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో వాటి బరువును 25 కేజీలకు కుదించిన ఎన్‌జీ రంగా వర్సిటీ ఆధునిక సాంకేతికతను వినియోగించ10 గ్రాముల బరువు తగ్గించేలా తయారు చేయడంపై దృష్టి సారించిటం తాజాగా ఆ బరువును 250 గ్రాములకు తగ్గించగలిగింది. రానున్న రోజుల్లో అరచేతిలో ఇమిడిపోయేలా ఉండే ఈ డ్రోన్లను దాదాపు 10 గ్రాముల బరువు తగ్గించేలా తయారు చేయడంపై దృష్టి సారించినట్టు వెల్లడించింది.
షేడ్ నెట్, గ్రీన్ మ్యాట్‌లలో సాగుకు ఉపయోగపడేలా...
షేడ్ నెట్, గ్రీన్ మ్యాట్ వంటి పద్ధతుల్లో పంటలు పండించే చోట గాలి ఎక్కువగా తగలకపోవడం వల్ల పుప్పొడి ఒక పుష్పం నుంచి మరో పుష్పం పైకి చేరడం లేదు. ఈ కారణంగా మొక్కల్లో పరపరాగ సంపర్కం జరగక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రూపొందించే బుల్లి డ్రోన్లను ఆ మొక్కలపై తిప్పితే పరపరాగ సంపర్కం జరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం అతి చిన్న డ్రోన్ల తయారీకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరహా డ్రోన్లు ఇప్పటికే విదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి బరువు కేవలం 10 గ్రాముల వరకు ఉంటుందని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త ఒకరు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వీటిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా షేడ్ నెట్, గ్రీన్ మ్యాట్ సాగులో మంచి ఫలితాలు సాధించే అవకాశముందని ఆయన చెప్పారు.