Telugu Global
National

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టుల మృతి

అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోయిస్టుల మృతి
X

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ భీకర ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలోనే మావోయిస్టులపై భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌ ప్రాంతమంతా కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నది. రాత్రి నుంచే అబూజ్‌మడ్‌ ప్రాంతాన్ని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. మావోయిస్టులకు పూర్తి పట్టుకున్న ఈ ప్రాంతంలో ఆపరేషన్‌ కదర్‌ పేరుతో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు 2026 కల్లా పూర్తిగా మావోయిస్టురహిత రాష్ట్రంగా చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా అబూజ్‌మడ్‌ ప్రాంతం, దండకారణ్యం లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నెల రోజుల వ్యవధిలోనే సుమారు 60 మంది మావోయిస్టులను ఎదురుకాల్పుల్లో కోల్పోయారు. తాజాగా రాత్రి బస్తర్ పరిధిలో ని నారాయణపూర్‌, దంతెవాడ, జగదల్‌పూర్‌, కొండగావ్‌ నాలుగు జిల్లాల భద్రతా బలగాలు కూంబింగ్‌కు వెళ్లాయి. తెల్లవారు జామున 3 గంటల నుంచి ఎదురు కాల్పుల్లో బస్తర్‌ సౌత్‌ అబూజ్‌మడ్‌ ప్రాంతంలో జరిగాయి. కూంబింగ్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ పాల్గొన్నాయి. ఈ సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలోనే అత్యంత భీకర కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎదురుకాల్పులు ఇంకా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

First Published:  12 Dec 2024 12:52 PM IST
Next Story