Telugu Global
NEWS

రొమ్ము క్యాన్సర్‌పై సంచలన సర్వే.. ప్రతి మహిళ ఇవి తెలుసుకోవాలి

2020లో దాదాపు 23 లక్షలుగా ఉన్న రొమ్ము క్యాన్సర్‌ కేసులు 2040 నాటికి 30 లక్షలకు పైగా పెరుగుతాయని ఈ అధ్యయనం తెలిపింది.

రొమ్ము క్యాన్సర్‌పై సంచలన సర్వే.. ప్రతి మహిళ ఇవి తెలుసుకోవాలి
X

రొమ్ము క్యాన్సర్.. ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడుస్తున్న వ్యాధి. దీని బారిన పడుతున్న మహిళల సంఖ్య ఏటా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. 2040 నాటికి దీనివల్ల ఏటా 10 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని న్యూ లాన్సెట్‌ కమిషన్‌ వెల్లడించింది. 2020 నాటికి గత ఐదేండ్లలో దాదాపు 78 లక్షల మంది రొమ్ము క్యాన్సర్‌ బారిన పడగా 6,85,000 మంది మరణించారని తెలిపింది.

ఏటా 10 లక్షల మరణాలు..

2020లో దాదాపు 23 లక్షలుగా ఉన్న రొమ్ము క్యాన్సర్‌ కేసులు 2040 నాటికి 30 లక్షలకు పైగా పెరుగుతాయని ఈ అధ్యయనం తెలిపింది. అల్పాదాయ దేశాలపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 2040 నాటికి క్యాన్సర్‌తో మరణించే వారి సంఖ్య ఏడాదికి దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని పరిశోధకుల బృందం అంచనా వేసింది.

రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది?

రొమ్ము క్యాన్సర్ అనేది ఒక వ్యాధి. ఇందులో అసాధారణ రొమ్ము కణాలు నియంత్రణ లేకుండా పెరిగి, కణితులను ఏర్పరుస్తాయి. ఇలాగే వదిలేస్తే, ట్యూమర్లు శరీరమంతా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతాయి. రొమ్ము క్యాన్సర్ కణాలు పాల నాళాల్లో, పాలను ఉత్పత్తి చేసే లోబుల్స్ లోపల ప్రారంభమవుతాయి.

రొమ్ము క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి?

ప్రతి మహిళా రొమ్ము క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవాలి. దీని వల్ల ముందుగానే ఈ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. అండర్ ఆర్మ్ ప్రాంతంలో లోపల ముద్దలా గడ్డ కట్టినట్టు చేతికి తగులుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్‌కు సంకేతం. అలాగే రొమ్ము పరిమాణం మారినా, సున్నితంగా మారినా, ఆకారం మారినా వెంటనే వైద్యులను కలవాలి. చను మొనల నుంచి స్రావం కారుతున్నా, వాటి రంగు మారినా, వారి పరిమాణం పెరిగినా కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చిందేమో అనుమానించాలి. రొమ్ముల్లో నొప్పి రావడం, గడ్డల్లాంటివి తగిలినా కూడా జాగ్రత్తగా ఉండాలి.

మరి పరిష్కారం ఏంటి?

రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం యాభై ఏళ్లలోపు మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. యువతలో క్యాన్సర్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. దీనికి కారణం వారు తినే అనారోగ్యకర ఆహారం, చెడు జీవన శైలి, ధూమపానం, మద్యపానం వంటివి. ఊబకాయం వల్ల కూడా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. క్యాన్సర్ తొలిదశలోనే గుర్తిస్తే ప్రాణాంతకం కాకుండా ముందే కాపాడుకోవచ్చు. ప్రస్తుతం క్యాన్సర్‌ను నివారించే చికిత్సలు, సర్జరీలు అమల్లోకి వచ్చాయి. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే ప్రాణం పోకుండా రక్షించుకోవచ్చు.

First Published:  17 April 2024 1:10 PM IST
Next Story