క్షణాల్లో రూ.4 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద.. కారణాలివేనా..?!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడింటిలో బీజేపీ గెలవడం ఇన్వెస్టర్లకు జోష్ నిచ్చింది. ఫలితంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 902 పాయింట్ల వృద్ధితో ప్రారంభమైంది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లకు ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జోష్‌నిచ్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ పాలిత రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ మెజారిటీ సీట్లు పొందడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. ఫలితంగా సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తాజా కొత్త గరిష్ట రికార్డుతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత 9.17 గంటలకు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 902 పాయింట్లు (1.34 శాతం) లాభంతో 68,383. పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 286 పాయింట్ల లబ్ధితో (0.41 శాతం) వద్ద ట్రేడయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ-30 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.09 లక్షల కోట్లు వృద్ధి చెంది రూ.341.76 లక్షల కోట్ల వద్దకు దూసుకెళ్లింది.
సెన్సెక్స్‌లో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఎయిర్‌టెల్ స్టాక్స్ రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ లాభాలతో ముగిస్తే నెస్ట్లే నష్టపోయింది. మరోవైపు గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థలు 14 శాతం పుంజుకున్నాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 14 శాతం, అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ 12 శాతానికి పైగా, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ 6-8 శాతం లాభపడ్డాయి.
మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో దలాల్ స్ట్రీట్‌లో సానుకూల వాతావరణంతో స్టాక్స్ రికార్డు గరిష్టాలను నమోదు చేయడానికి కీలక పరిణామం. ఆర్థిక సంస్కరణలు ముందుకు తీసుకెళ్లడానికి రాజకీయ సుస్థిరత దోహదపడుతుందని, మార్కెట్ ఫ్రెండ్లీ సర్కార్ ఏర్పాటు అవుతుందన్న సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలోపేతం అయిందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటర్జిస్ట్ వీకే విజయ్ కుమార్ చెప్పారు.
ఏషియన్ మార్కెట్లలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో మిశ్రమ స్పందన కనిపించింది. సౌత్ కొరియా, ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్లు 0.4 శాతం పుంజుకోగా, జపాన్ నిక్కీ 0.4 శాతం నష్టపోయింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ త్వరలో వడ్డీరేట్లు తగ్గిస్తామని ప్రకటించడంతో అమెరికా ట్రెజరీ బాండ్లు పలు నెలల కనిష్ట స్థాయిని తాకాయి. రెండేళ్ల విలువ గల యూఎస్ ట్రెజరీ బాండ్లు జూలై మధ్యలో 4.6 శాతం, పదేళ్ల టెన్యూర్ గల బాండ్లు సెప్టెంబర్‌లో 4.3 శాతం నాటి కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.
దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) శుక్రవారం నికరంగా రూ.1,589 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేస్తే, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1448 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. వరుసగా రెండు నెలల విక్రయాలను పక్కనబెట్టి, నవంబర్‌లో ఎఫ్ఐఐలు రూ.9001 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర కాసింత తగ్గింది. ఒపెప్+ దేశాలు స్వచ్ఛందంగా క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గించడానికి తోడు వినియోగం కూడా పెరిగింది. బ్రెంట్ క్రూడాయిల్ 52 సెంట్లు తగ్గి బ్యారెల్‌పై 78.36 డాలర్లు పలికింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ప్యూచర్స్ బ్యారెల్‌పై 73.62 డాలర్లు (45 సెంట్లు క్షీణత) పలికింది. మరోవైపు ఫారెక్స్ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ ఆరు పైసలు పుంజుకుని రూ.83.27 వద్ద ట్రేడయింది.
♦