పిల్లలు అగ్రహీరోలైతేనే గుర్తిస్తారా..? దాసరిపై సినిమా.. అన్నీ చూపిస్తా..
పరిశ్రమలో పెద్దలమని చెప్పుకుంటూ దాసరిని అవమానించిన వారూ ఉన్నారని, ఆ పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయన్నారు. నిర్మాతగా తాను వ్యవహరిస్తానని.. డైరెక్టర్ కూడా సీనియరే ఉంటారన్నారు.
దాసరి నారాయణరావును రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మరిచిపోయాయని విమర్శించారు నిర్మాత నట్టి కుమార్. వాళ్ల పిల్లలు అగ్రహీరోలుగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు గుర్తిస్తాయా..? అప్పుడే సదరు వ్యక్తుల పేరుతో పార్కులు ఏర్పాటు చేస్తారా..? అని ప్రశ్నించారు. దాసరి పిల్లలు అగ్ర హీరోలు కాకపోవచ్చని.. కానీ, ఒక కాపు నాయకుడిగా, సినిమా పెద్దగా ఆయన అందరికీ గుర్తుంటారన్నారు. కాపులకు రంగా తర్వాత నాయకుడు దాసరి నారాయణరావేనన్నారు. కాపులు కూడా దాసరిని మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. మే 4వ తేదీ లోపు ఇటు హైదరాబాద్‌లో, అటు ఏపీలోని పాలకొల్లులో దాసరి పేరుతో స్మృతివనం ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఆరోగ్యశ్రీ తెచ్చి పేద ప్రజలను వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాగైతే ఆదుకున్నారో దాసరి నారాయణరావు కూడా మెడి క్లెయిమ్ తెచ్చి చిత్ర పరిశ్రమలోని కళాకారులకు అండగా నిలబడ్డారని చెప్పారు. చిత్రపరిశ్రమలో ఎంతో మందిని ఎదిరించి నిలబడిన వ్యక్తి దాసరి అని గుర్తుచేశారు. అందుకే ''ఇది దాసరి చరిత్ర'' పేరుతో ఒక సినిమా తీస్తున్నట్టు చెప్పారు.
పరిశ్రమలో పెద్దలమని చెప్పుకుంటూ దాసరిని అవమానించిన వారూ ఉన్నారని, ఆ పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయన్నారు. నిర్మాతగా తాను వ్యవహరిస్తానని.. డైరెక్టర్ కూడా సీనియరే ఉంటారన్నారు. దాసరి పాత్ర కోసం తమిళ అగ్ర హీరో కుమారుడిని సంప్రదిస్తున్నామన్నారు. అన్ని కుదిరితే మే4న సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. భారీ బడ్జెట్‌తోనే సినిమా తీస్తున్నట్టు చెప్పారు.
తామే చిత్ర పరిశ్రమ అనుకుంటున్న 21 మందికి దాసరి చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దాసరిని అవమానించి.. ఆ తర్వాత వాళ్లే దాసరి వద్దకు వచ్చి కాళ్లు ఎలా పట్టుకున్నారు అన్నది ఈ సినిమాలో చూపిస్తామన్నారు. ప్రభుత్వాలు కూడా ఐదుగురు హీరోలనే చిత్ర పరిశ్రమగా చూస్తున్నాయని విమర్శించారు. సినిమా పెద్దలు కేవలం వాళ్ల సినిమాలు ఉన్నప్పుడే వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. చిన్న నిర్మాతల కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న పోసాని, ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అలీలు అక్కడి ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ గురించి ఏం సలహాలు ఇచ్చారో కూడా తమకు తెలియదన్నారు. అసలు వీరిద్దరు ఎప్పడైనా చిత్ర పరిశ్రమ గురించి చర్చించేందుకు సమావేశం పెట్టారా..? అని నట్టి కుమార్ ప్రశ్నించారు.