సచిన్ ను తాకిన రెజ్లర్ల నిరసన సెగ
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఆందోళన తెలుపుతుంటే ఎందుకు మద్దతుగా నిలవలేదని ప్రశ్నించారు. రైతు ఉద్యమంపై మాట్లాడిన ఒక విదేశీ మహిళ క్రీడాకారిణికి గతంలో మీరు సమాధానం ఇచ్చారు.
తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళన రోజురోజుకూ ఉధృతం అవుతోంది. రెజ్లర్ల నిరసన సెగ సచిన్ టెండూల్కర్ ను కూడా తాకింది. రెజ్లర్లకు మద్దతుగా నిలవాలని సచిన్ ఇంటివద్ద తాజాగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రెజ్లర్ల ఆందోళనకు ఇప్పటికే పలు పార్టీలు, క్రీడాకారులు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబై యూత్ కాంగ్రెస్ నాయకులు రెజ్లర్లకు మద్దతుగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ముంబైలోని బాంద్రా వెస్ట్ పెర్రీ క్రాస్ రోడ్ లోని సచిన్ ఇంటివద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు బ్యానర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. భారతరత్న పొందిన గొప్ప వ్యక్తి సచిన్.. అటువంటి వ్యక్తి తమను వేధిస్తున్న రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఆందోళన తెలుపుతుంటే ఎందుకు మద్దతుగా నిలవలేదని ప్రశ్నించారు. రైతు ఉద్యమంపై మాట్లాడిన ఒక విదేశీ మహిళ క్రీడాకారిణికి గతంలో మీరు సమాధానం ఇచ్చారు.
అటువంటిది ఇప్పుడు రెజ్లర్ల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు.. మీ దేశభక్తి ఏమైంది.. అని అడిగారు. మీరు కూడా సీబీఐ, ఇన్ కమ్ ట్యాక్స్ దాడులకు భయపడుతున్నారా..? అందుకే రెజ్లర్ల విషయంలో మౌనంగా ఉన్నారా..? అని యూత్ కాంగ్రెస్ నాయకులు సచిన్ ను ప్రశ్నించారు. దయచేసి ఇప్పటికైనా రెజ్లర్లకు మద్దతుగా నిలవాలని సచిన్ ను వారు కోరారు.