యూపీ సీఎంని హతమారుస్తానంటూ అజ్ఞాత వ్యక్తి హెచ్చరిక... రంగంలోకి పోలీసులు
ఎన్నికలప్పుడు, పండుగలప్పుడు, వేడుకలు జరుగుతున్నప్పుడల్లా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ ను చంపేస్తామంటూ హెచ్చరికలు వస్తూ ఉంటాయి. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్రదినోత్సవ వజ్రోత్సవాలు జరుగుతున్న వేళ యోగిని చంపుతామంటూ మళ్ళీ హెచ్చరికలు వచ్చాయి.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని మూడు రోజుల్లోగా హతమారుస్తామంటూ ఈ నెల 2 న పోలీస్ కంట్రోల్ రూమ్ కి హెల్ప్ లైన్ లో బెదిరింపు సందేశం అందింది. బాంబు వేసి ఆయనను చంపుతామని లక్నోలోని పోలీసులకు మెసేజ్ అందడంతో కేసు నమోదు చేసి వారు దర్యాప్తు ప్రారంభించారు. షాహిద్ అనే వ్యక్తి పేరిట ఈ సందేశం వచ్చిందట. ఈ వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. సైబర్ విభాగం, సర్వేలెన్స్ టీమ్స్ ని కూడా రంగంలోకి దింపారు. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాలు జరగనుండగా ఈ బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
గతంలో కూడా యోగి ఆదిత్యనాథ్ ని హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయి. గత ఏడాది మే 3 న సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసు స్టేషన్ కి అందిన బెదిరింపు సందేశంలో.. 4 రోజుల్లోగా యోగిని చంపుతామని హెచ్చరించారు. దాంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే ఎవరీ మెసేజ్ పంపారన్నది తెలియలేదు. తాజాగా ఇదే పోలీసు స్టేషన్ కి మళ్ళీ అలాగే థ్రెట్ మెసేజ్ అందడంతో ఖాకీలు కలవరపడుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో కమ్రన్ అమీన్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును ఖాకీలు అరెస్టు చేశారు. ఇతగాడు ఇలాగే ఓ బెదిరింపు మెసేజ్ పెట్టాడట. 2020 సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో సైతం యోగిని అజ్ఞాత వ్యక్తులు బెదిరించారు. 2020 మే నెలలో బీహార్ కి చెందిన తన్వీర్ ఖాన్ అనే కానిస్టేబుల్ ని పోలీసులు అరెస్టు చేశారు. యోగి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన్వీర్ ఖాన్ ఫేస్ బుక్ లో పోస్టులు పెట్ట్టాడని వారు అప్పట్లో తెలిపారు.
అయితే ఎన్నికలప్పుడు, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా, పండుగల సందర్భంగానే ఇలాంటి హెచ్చరికలు ఎందుకు వస్తున్నాయన్నదానిపై దృష్టిపెడితే బావుంటుందని నిపుణుల అభిప్రాయం