5సార్లు నమాజు, ఆ తర్వాత.. రామ్ దేవ్ విద్వేష ప్రసంగం
రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు విద్వేషానికి పరాకాష్టలా ఉన్నాయి. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో చీలిక తేవాలనే ఉద్దేశంతోటే రామ్ దేవ్ లాంటివాళ్లు ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు నెటిజన్లు.
చోటా మోటా నేతలు, పాపులార్టీకోసం పాకులాడేవారు విద్వేష ప్రసంగాలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం కామన్. కానీ బీజేపీ జమానాలో నేరుగా ఎంపీలే రెచ్చిపోతారు, ముఖ్యమంత్రులే విద్వేష ప్రసంగాలు చేస్తారు. పేరు గొప్ప యోగా గురువులు రామ్ దేవ్ లాంటి వారు కూడా మరీ చీప్ గా మాట్లాడతారు. తాజాగా రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు విద్వేషానికి పరాకాష్టలా ఉన్నాయి. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో చీలిక తేవాలనే ఉద్దేశంతోటే రామ్ దేవ్ లాంటివాళ్లు ఇలా మాట్లాడతారని అంటున్నారు నెటిజన్లు.
అయుదుసార్లు నమాజు.. ఆ తర్వాత
నేరుగా ముస్లింలను టార్గెట్ చేసుకుని రామ్ దేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఐదుసార్లు నమాజు చేసే ముస్లింలు, ఆ తర్వాత వారి ఇష్టం వచ్చింది చేస్తారంటూ రాజస్థాన్ లోని బార్మేర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్వేషపూరిత ప్రసంగం ఇచ్చారు రామ్ దేవ్. ముస్లింలు హిందూ యువతులను అపహరిస్తున్నారని యోగాగురువు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం, క్రైస్తవ మతాలను ఆచరించేవారు మత మార్పిళ్లకు పాల్పడుతుంటే హిందూమతం మాత్రం హిందువులను మంచి పనులు చేయాలంటూ బోధిస్తుందని తెలిపారు.
రామ్ దేవ్ ఏమన్నారంటే..?
‘‘ప్రతి రోజు ముస్లింలు అయిదుసార్లు నమాజు చేస్తారు. ఆ తరువాత వారేం కోరుకుంటే అది చేస్తారు. హిందూ యువతులను అపహరిస్తారు. కొంతమంది ప్రపంచమంతటినీ ఇస్లాంగా మార్చేయడంపై మాట్లాడతారు. మరికొందరు ప్రపంచమంతా క్రైస్తవంలోకి మార్చాలంటారు. కొందరు ఉగ్రవాదులుగా మారుతుంటారు, మరోపక్క నమాజు చేస్తుంటారు’’ అని అన్నారు రామ్ దేవ్. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విద్వేష ప్రసంగం చేసిన రామ్ దేవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.