పాత మిత్రుల్ని పలకరిస్తున్న యమున.. తాజ్ మహల్ ని తాకిన వరద
ప్రమాదకర స్థాయిని దాటి తాజ్ మహల్ వద్ద యమున ఉరకలెత్తుతోంది. గార్డెన్ లోకి వరదనీరు చేరింది.
యమునా నది పాత మిత్రులందర్నీ పలకరిస్తోంది. ఢిల్లీలో ఎర్రకోటను తాకింది, ఇప్పుడు ఆగ్రా వద్ద తాజ్ మహల్ ని కూడా తడిపేస్తోంది. 45 ఏళ్లలో ఎప్పుడూ ఆగ్రా వద్ద ఈస్థాయిలో వరద ప్రవాహం లేదని రికార్డులు చెబుతున్నాయి. ప్రమాదకర స్థాయిని దాటి తాజ్ మహల్ వద్ద యమున ఉరకలెత్తుతోంది. గార్డెన్ లోకి వరదనీరు చేరింది. ఇప్పుడు అక్కడ యమున ప్రవాహం 497.9 అడుగులుగా ఉంది.
Flood water has touched the walls of the most impressive monument in the country, #TajMahal in Agra. Merely days earlier the flood water had inundated #RedFort in Delhi.
— Syed Ubaidur Rahman (@syedurahman) July 18, 2023
However experts suggest that flood water can't touch main mausoleum in Agra as it has been built this way. pic.twitter.com/6wR5u4BprN
రెండు రోజుల్లో 495 అడుగులనుంచి ప్రవాహం 497.9కి చేరింది. దీంతో వరదనీరు తాజ్ మహల్ పరిసరాల్లోకి చేరింది. అయితే దీనివల్ల తాజ్‌మహల్ కు వచ్చిన ముప్పేమీ లేదని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇతిమాద్ ఉద్ దౌలా టూంబ్, దుసెరా ఘాట్ సమీపంలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. 1978లో యమునా నది వరద ప్రవాహం ఇక్కడ 508 అడుగుల గరిష్ట స్థాయికి చేరింది. అప్పట్లో తాజ్ మహల్ బేస్ మెంట్ లోని 22 గదుల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి వరదనీరు చేరుతుందేమోననే అనుమానాలు మొదలయ్యాయి.
ఢిల్లీ వద్ద నిలకడగా..
అటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా యమున ప్రవాహం ఆశించిన స్థాయిలో తగ్గలేదు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ప్రవాహ తీవ్రత వల్ల చాలా రోడ్లలో ఇప్పటికీ రాకపోకలు పునరుద్ధరించలేదు.