Telugu Global
National

సుప్రీం కొలీజియంపై ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సీజేఐ చంద్రచూడ్

రాజ్యాంగ ధర్మాసనాల కేసులకే కోర్టు ప్రాధాన్యత ఇస్తోందని ఇటీవల న్యాయవాది మాథ్యూ నెడుంపర ఈ-మెయిల్ పంపించడంపై సీజేఐ చంద్రచూడ్ మండిపడ్డారు.

సుప్రీం కొలీజియంపై ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సీజేఐ చంద్రచూడ్
X

సుప్రీంకోర్టు కొలీజియంపై వస్తున్న పలు ఆరోపణలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన పరిశీలన చేయకుండానే కొలీజియం జడ్జిలను నియమిస్తోందని ఆరోపించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అలాంటి ఆరోపణలు చేయడం తగదని ఆయన సూచించారు. వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా, వాస్తవిక సమాచారాన్ని విశ్లేషించిన తర్వాతే సుప్రీంకోర్టు, హైకోర్టులకు సమర్థులైన జడ్జిల నియామకం జరుగుతుందని వెల్లడించారు.

రాంజెఠ్మలాని స్మారకోపాన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు జడ్జిల నియామకం కోసం అత్యుత్తమైన 50 మందితో జాబితాను రూపొందిస్తుంది. కొలీజియం ఈ మేరకు ఎంతో క్షణ్ణంగా పరిశీలనలు జరిపి ఈ లిస్టును తయారు చేస్తుందని సీజేఐ తెలిపారు. కోర్టులు తాత్కాలిక విధానంలో కాకుండా వ్యవస్థీకృత విధానాల్లో పని చేయాలన్నదే తన లక్ష్యమని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

సుప్రీంకోర్టుపై చాలా మంది ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఒక న్యాయవాది.. దేశంలోని సామాన్య ప్రజలకు సంబంధించిన కేసులను పట్టించుకోవడం లేదని అత్యున్నత న్యాయస్థానంపై ఆరోపణలు చేశారు. ఇలాంటి అసంబద్దం ఆరోపణలు చేయడం తగదని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై దేశ ప్రజల వాణిని, కశ్మీర్ ప్రజల వాదనలు వింటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌కు సంబంధించిన కేసు కూడా సుప్రీంకోర్టులో ఉన్నది. ఇది ఎన్నో లక్షల మంది జీవనోపాధికి సంబంధించిన విషయం అని సీజేఐ గుర్తు చేశారు. రాజ్యాంగ ధర్మాసనాల కేసులకే కోర్టు ప్రాధాన్యత ఇస్తోందని ఇటీవల న్యాయవాది మాథ్యూ నెడుంపర ఈ-మెయిల్ పంపించడంపై సీజేఐ చంద్రచూడ్ మండిపడ్డారు. ఇలాంటి విషయాల వల్ల సుప్రీంకోర్టు సామాన్యులకు దూరం అవుతుందనే భావన కలుగుతుందని సీజేఐ పేర్కొన్నారు.

First Published:  16 Sept 2023 2:41 AM GMT
Next Story